logo

గడువు ముందర సందిగ్ధం!

ఏటా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ప్రభుత్వ పనులకు బడ్జెట్‌ కేటాయిస్తారు. దానిని ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన బిల్లులను ఖజానా శాఖకు పంపిస్తే.. వారు ఈ-కుబేర్‌లో నమోదు చేస్తారు.

Published : 29 Mar 2024 05:50 IST

పెండింగ్‌ బిల్లులు మంజూరయ్యేనా?

బిల్లుల దస్త్రాలు పరిశీలిస్తున్న జిల్లా ఖజానా అధికారి రాజేశ్వర్‌

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: ఏటా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ప్రభుత్వ పనులకు బడ్జెట్‌ కేటాయిస్తారు. దానిని ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన బిల్లులను ఖజానా శాఖకు పంపిస్తే.. వారు ఈ-కుబేర్‌లో నమోదు చేస్తారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే సంబంధిత ఖాతాల్లో జమవుతాయి. ఇదంతా ఏటా జరిగే ప్రక్రియ. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మూడు రోజులే గడువు ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల బిల్లులు ఖజానా కార్యాలయానికి వెళ్లాయి. కానీ గడువు లోపు ప్రభుత్వం నిధులు విడుదల చేయకుంటే అవన్నీ మురిగినట్లే. కొత్త ఆర్థిక సంవత్సరంలో మరోసారి పంపించాల్సి ఉంటుంది. దీంతో గడువులోపు బిల్లులు వస్తాయా? లేదా? అని ఉద్యోగులు, లబ్ధిదారులు సందిగ్ధంలో ఉన్నారు.

జిల్లాలో సుమారు 46 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వీటిలో ఆర్థికపరమైన ప్రతి బిల్లు ఖజానా ద్వారా పొందాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు మెస్‌ ఛార్జీలు, కాస్మోటిక్‌, ఉపకార వేతనాలు, బోధనా రుసుములు సంబంధించిన బిల్లులు ఉంటాయి. ఇవేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పీఎఫ్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌, వైద్య బిల్లులు,  కార్యాలయాల నిర్వహణ నిధులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌.. ఇలా వివిధ రకాల సంక్షేమ పథకాలకు సంబంధించి అనేక బిల్లులను సంబంధిత శాఖలు ఖజానా కార్యాలయానికి పంపిస్తారు. ఆర్థిక సంవత్సరం తేదీ మారితే బిల్లులన్నీ నిలిచిపోతాయి. ఇవి మంజూరు కావాలంటే 2024-25 మూడో త్రైమాసికం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే జిల్లా ఖజానా కార్యాలయంలో రూ.109.57 కోట్లకు సంబంధించి 5,939 బిల్లులు ఈ-కుబేర్‌లో నమోదై ఉన్నాయి.

ఎప్పటికప్పుడు పంపుతున్నా..

ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు బిల్లులు చేసి ఖజానా కార్యాలయానికి పంపిస్తున్నా.. నిధుల విడుదలలో జాప్యం ఇబ్బందిగా మారుతోంది. నెలల తరబడి బిల్లులకు అనుమతి లభించనట్లు కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ప్రీ, పోస్టుమెట్రిక్‌ వసతి గృహాలు 11 ఉన్నాయి. వీటి పరిధిలో 825 మంది విద్యార్థుల భోజనానికి సంబంధించి డైట్‌ ఛార్జీలు రూ.68.21 లక్షల కోసం ఖజనా కార్యాలయానికి పంపి సుమారు 3-4 నెలలు అవుతోంది. బోధన రుసుములు, ఉపకార వేతనాలకు సంబంధించి రూ.4.90 కోట్ల బిల్లులు పంపించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కు సంబంధించి 127 మంది బిల్లులు ఖజానా కార్యాలయానికి పంపించారు. ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో పోస్టు, ప్రీ మెట్రిక్‌ వసతి గృహాలు 10 వరకు ఉండగా.. 567 మంది విద్యార్థులు చదువుతున్నారు. డైట్‌ ఛార్జీలు రూ.78 లక్షల బిల్లులు పంపించినా వీటిలో సగానికి పైగా పెండింగ్‌లో ఉన్నాయి. వసతి గృహాల మరమ్మతులకు సంబంధించి రూ.31 లక్షల బిల్లు పెండింగ్‌లో ఉంది. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు 50 వరకు ఉన్నాయి. ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు డైట్‌ ఛార్జీలు రూ.5.80 కోట్ల బిల్లులు పంపారు. 10,600 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తుల కుట్టు కూలీకి సంబంధించి రూ.20.97 లక్షలు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3.44 లక్షల బిల్లులు ట్రెజరీకి పంపించారు. మూడు రోజుల్లోపు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తప్ప వీటికి పరిష్కారం లభించదు.


మా వద్ద పెండింగ్‌ ఉండదు
జె.రాజేశ్వర్‌, జిల్లా ఖజానా అధికారి

ప్రభుత్వ శాఖలు పంపించిన బిల్లులను పరిశీలించి వెంటనే ఈ-కుబేర్‌లో నమోదు చేస్తాం. తేడాలుంటే తిరస్కరిస్తాం. ఇక్కడ ఎలాంటి పెండింగ్‌ ఉండదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే సంబంధిత ఖాతాల్లో జమవుతాయి. ఆర్థిక సంవత్సరంలోపు కాకుంటే మళ్లీ బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని