logo

ఇక విద్యుత్తు కోతలకు చెక్‌

ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో కొన్ని చోట్ల  సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశం...

Published : 29 Mar 2024 05:56 IST

ఓవర్‌లోడ్‌ ప్రాంతాల్లో నియంత్రికల ఏర్పాటు

పట్టణంలో ఏర్పాటు చేస్తున్న నియంత్రిక

ఆదిలాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో కొన్ని చోట్ల  సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశం ఉండటంతో లోవోల్టేజీ, ఓవర్‌లోడ్‌ ఉన్న ప్రాంతాలను గుర్తించి నియంత్రికల సామర్థ్యం పెంచేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మండలాలవారీగా ప్రస్తుతం ఉన్న నియంత్రికలు, విద్యుత్తు వినియోగం, కనెక్షన్లు తదితర వివరాలు సేకరించడంతోపాటు నియంత్రికల అవసరాన్ని గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో 2.67 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉండగా ఇందులో గృహావసరాలకు సంబంధించిన కనెక్షన్లు 2.04 లక్షలు ఉన్నాయి. ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వాడకం ఎక్కువైంది. వ్యవసాయరంగంతోపాటు, పరిశ్రమలకు ఒకేసారి విద్యుత్తు అవసరం ఏర్పడటంతో ఓవర్‌లోడ్‌ కారణంగా నియంత్రికలు, ఫ్యూజులు కాలిపోతున్నాయి. జనవరి నెల వినియోగం 46.79 మిలియన్‌ యూనిట్లు ఉండగా ఫిబ్రవరి నెల వచ్చే సరికి 50 మిలియన్‌ యూనిట్లుకు చేరుకుంది. ఈ నెలలో 52 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత విద్యుత్తు వినియోగం పెరిగే అవకాశం ఉండటంతో ఓవర్‌లోడ్‌ ప్రాంతాలను గుర్తించి అదనపు నియంత్రికలు ఏర్పాటు చేస్తున్నారు.

20 చోట్ల గుర్తింపు..

జిల్లా మొత్తంలో ఇప్పటికే 20 నియంత్రికలు ఓవర్‌లోడ్‌లో ఉన్నట్లు గుర్తించి వాటిని మార్చే పనిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 15, పట్టణంలో 5 నియంత్రికలు కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు ఆదిలాబాద్‌ పట్టణంలోని రెండు ప్రాంతాల్లో 100 కేవీ నియంత్రిక స్థానంలో 160 కేవీ నియంత్రికలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫ్యూజులు సరిగా లేని చోట కొత్తవి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌ గ్రామీణ ప్రాంతంలో అంకోలి, తంతోలి, యాపల్‌గూడ, సిరికొండ తదితర ప్రాంతాల్లో 15 కేవీ సామర్థ్యం ఉన్న నియంత్రికల స్థానంలో 25 కేవీ నియంత్రికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో అయిదు నియంత్రికలకు ప్రతిపాదనలు పంపించడంతో మంజూరు అయినట్లు వివరించారు.

అంతరాయం కలిగితే ఫోన్‌ చేయొచ్చు

విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే సమాచారం అందించేందుకు వీలుగా నియంత్రికలపై లైన్‌మెన్‌ చరవాణి నంబర్లు రాయించారు. అయిదు పది నిమిషాలకంటే ఎక్కువ సేపు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే సంబంధిత లైన్‌మెన్‌కు ఫోన్‌ చేస్తే కారణం తెలియచేయడంతోపాటు వెంటనే సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు.


తగిన చర్యలు తీసుకుంటున్నాం
జైవంత్‌రావు చౌహాన్‌, ఎస్‌ఈ, ఆదిలాబాద్‌

జిల్లాలో అన్ని రంగాలకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటికే ఓవర్‌లోడ్‌  ఉన్న ప్రాంతాలను గుర్తించాం. అవసరమైన ప్రాంతాల్లో కొత్త నియంత్రికలు ఏర్పాటు చేస్తున్నారు. వారం, పది రోజుల్లో పనులు పూర్తి చేస్తారు. కొన్ని చోట్ల ఇప్పటికే మార్చేశారు. 33 కేవీ లైన్‌ వెంట ఉండే అంతరాయాలను సైతం తొలగించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగితే ప్రధాన కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేశాం. సమాచారం ఇస్తే వెంటనే సంబంధిత లైన్‌మెన్‌కు సమాచారం ఇచ్చి బాగు చేయించేలా చర్యలు తీసుకున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని