logo

నీటిబొట్టు.. ఒడిసిపట్టి

జన్నారం మండలంలోని కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Published : 19 Apr 2024 06:01 IST

తీరుతున్న వన్యప్రాణుల దాహార్తి

ర్యాంపువెల్‌

జన్నారం, న్యూస్‌టుడే: జన్నారం మండలంలోని కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మండుతున్న ఎండలకు మనుషులే తాగునీటికి అల్లాడిపోతున్నారు. అలాంటిది దట్టమైన అడవిలో ఎండిపోయిన చెట్ల మధ్య అగ్ని గుండాన్ని తలపిస్తున్న వేడిలోనూ వన్యప్రాణులకు తాగునీటి సదుపాయాలు కల్పిస్తున్నారు. జన్నారం అటవీ డివిజన్‌ పరిధిలోని తాళ్లపేట రేంజి అధికారిణి సుష్మారావు రోజూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. అనేక చోట్ల ఉన్న కుంటలు, చెరువులను పరిశీలిస్తూనే మరో అయిదు ర్యాంపు వెల్‌్్స తవ్వించారు. సాసర్‌ పిట్స్‌లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు.  

కవ్వాల్‌ పులులు సంరక్షణ కేంద్రం పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్న గుట్టల నుంచి సహజ సిద్ధమైన నీటి ఊటలు ఉబికి వస్తున్నాయి. ఆ నీటిని నిల్వ చేయడానికి చెలమలు తవ్వించారు. ఆ నీటిలో రాలిపడే ఎండిపోయిన ఆకులను బేస్‌ క్యాంపు సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు. దీంతో అటుగా వెళ్లే వన్యప్రాణులు చల్లని నీటిని తాగుతున్నాయి. తాగునీటి కోసం అడవిని వీడాల్సిన పనిలేకుండా పోయింది. తాళ్లపేట రేంజి పరిధిలోని దండేపల్లి, ఊట్ల, నీలాలొద్ది, కోతులగుండం, మహ్మదాబాద్‌, తుంగమడుగు, తపాల్‌పూర్‌, చినగుట్ట, ముత్యంపేట, మామిడిలొద్ది, చిగుర్ల ప్రాంతాల్లో సహజసిద్ధమైన నీటి వనరులున్నాయి.  

నిండుగా ఉన్న కుంటలు

అడవి మధ్యలో తవ్వించిన కుంటల్లో నీళ్లు ఇప్పటికీ నిండుగానే ఉంటున్నాయి. చెరువులు, కుంటల్లో ఏటా పూడిక తీసి అందులో నీళ్లు నిలిచేలా చేస్తున్నారు. వర్షపు నీరు కుంటల్లోకి చేరుకొని నిండుకుండను తలపిస్తున్నాయి. ఎత్తైన ప్రాంతంలో కురిసే ప్రతి చినుకు బొట్టు కుంటలు, చెరువుల్లోకి ప్రవహించి జలకళను సంతరించుకున్నాయి. ప్రతి సెక్షన్‌లోనూ చెరువులు, కుంటలు ఉన్నాయి. సోలార్‌ పిట్స్‌, సాసర్‌ వెల్స్‌, ర్యాంపు వెల్స్‌ రేంజి పరిధిలో నిండు కుండలను తలపిస్తున్నాయి.

సహజసిద్ధ నీటి ఊట ద్వారా వస్తున్న జలం


అయిదు ర్యాంపు వెల్స్‌ తవ్వించాం

సుష్మారావు, రేంజి అధికారిణి, తాళ్లపేట

తాళ్లపేట రేంజి పరిధిలో నీటి ఎద్దడి నివారణకు ఈ ఏడాది అయిదు ర్యాంపువెల్స్‌ తవ్వించాను. దీంతో ప్రస్తుతం ఇక్కడ 10 ర్యాంపు వెల్‌్్స ఉన్నాయి. ప్రతి సాసర్‌ పిట్‌లోనూ ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నాం. ఏ ఒక్క వన్యప్రాణి దాహంతో అల్లాడి పోయే ప్రసక్తే లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నా. ప్రతి నీటి బొట్టును నిలువ చేసేలా చర్యలు చేపడుతున్నాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని