logo

కేంద్రాలు దూరం.. తప్పని భారం!

కాకతీయ విశ్వవిద్యాలయ (కేయూ) పరిధిలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ పరీక్షల్లో విద్యార్థులకు అవస్థలు తప్పేలా లేవు. వారం రోజులుగా 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు.

Updated : 06 May 2024 06:27 IST

నేటి నుంచి కేయూ డిగ్రీ పరీక్షలు

న్యూస్‌టుడే, ఆసిఫాబాద్‌ అర్బన్‌: కాకతీయ విశ్వవిద్యాలయ (కేయూ) పరిధిలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ పరీక్షల్లో విద్యార్థులకు అవస్థలు తప్పేలా లేవు. వారం రోజులుగా 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. పరీక్ష కేంద్రాల కేటాయింపులో విద్యాలయ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంతో.. విద్యార్థులు మరింతగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్ని కళాశాలల యాజమాన్యాల లాభం కోసం కేంద్రాలను కేటాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కనీస సదుపాయాలు, సరిపడా గదులు కూడా లేకపోయినప్పటికీ కేంద్రాలను ఇవ్వడంలో ఆంతర్యమేమిటన్న విమర్శలు వస్తున్నాయి.

జిల్లాలో 10 డిగ్రీ కళాశాలలు ఉండగా.. ఈ నెల 6వ తేదీ నుంచి 2, 4, 6 సెమిస్టర్‌ పరీక్షలు జరుగనున్నాయి. వీరి కోసం కాగజ్‌నగర్‌లో మూడు, ఆసిఫాబాద్‌, రెబ్బెనలలో ఒక్కొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భానుడి భగభగల దృష్ట్యా పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు  డిమాండు చేశారు. అయినా పరీక్షలు ప్రకటించిన సమయంలోనే కొనసాగిస్తున్న అధికారులు కనీసం విద్యార్థులకు సమీపంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంలో శ్రద్ధ చూపకపోవడంపై సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేటాయించిన కేంద్రంలోనూ వసతుల గురించి పట్టించుకోక పోవడం ఆందోళన కలిగిస్తోంది.

పక్క జిల్లాకు మార్చి

రెబ్బెనలోని డిగ్రీ కళాశాలను పరీక్ష కేంద్రంగా మార్చిన అధికారులు.. ఇక్కడి విద్యార్థులకు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లికి కేటాయించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెబ్బెన డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా గదులు లేవని, కొన్ని సందర్భాల్లో బయట టెంట్లు వేసి పరీక్షలు రాయిస్తున్నారని విద్యార్థులు గతంలో నిరసన వ్యక్తం చేశారు. దీంతోపాటు గదుల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను కూర్చోబెడుతున్నారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం విషయంలో ఇన్ని అవస్థలు పడుతున్నప్పటికీ కేయూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో అన్ని వసతులతో కూడిన పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


మండుటెండల్లో రోజూ 50-60 కి.మీ. ప్రయాణం..

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో రెండు ప్రైవేటు, ఒక మహిళా డిగ్రీ కళాశాల, బెండార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆసిఫాబాద్‌, వాంకిడి, కెరమెరి, రెబ్బెన మండలాలకు చెందిన మారుమూల ప్రాంతాల విద్యార్థులు చదువుతున్నారు. ఆసిఫాబాద్‌లోని మూడు కళాశాలల విద్యార్థులకు జిల్లా కేంద్రంలో కాకుండా రెబ్బెనలోని డిగ్రీ కళాశాలను పరీక్ష కేంద్రంగా ఇవ్వడంతో.. ఇక్కడి వందలాది మందికి దూరభారం తప్పడం లేదు. ఆసిఫాబాద్‌లోని కళాశాలల్లో కెరమెరి, వాంకిడి, తిర్యాణి మండలాల మారుమూల గ్రామాలకు చెందిన విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. జిల్లా కేంద్రాన్ని దాటి రెబ్బెన కేంద్రానికి చేరుకోవడానికి సుమారు 50-60 కి.మీ. దూరం రోజూ ప్రయాణించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి, అందులో రవాణా సదుపాయం సరిగా లేని ప్రయాణం భయాందోళన కలిగిస్తోందని వాపోతున్నారు. అన్ని విధాలా అనుకూలంగా ఉండే జిల్లా కేంద్రంలో కేంద్రాన్ని ఇవ్వకుండా తమను రెబ్బెనకు పంపించడం సరికాదని చెబుతున్నారు. కాగా కౌటాల డిగ్రీ కళాశాల విద్యార్థులు సైతం సుమారు 50 కి.మీ. ప్రయాణించి కాగజ్‌నగర్‌లో పరీక్షలు రాయడానికి ఇబ్బంది పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని