logo

కాంగ్రెస్‌లో కొత్తదనం.. కలిసొచ్చిన పాతతరం

ప్రజలకు అభివాదం చేస్తూ, యువతకు స్వీయచిత్రాల అవకాశమిచ్చిన అగ్రనేత రాహుల్‌గాంధీ, గాడిద గుడ్డు కథ వివరిస్తూ నినాదాలు చేయించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఒకే వేదికపై కూచాడి శ్రీహరిరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, వేణుగోపాలాచారి కనిపించటం, భారీగా తరలివచ్చిన జనం..

Updated : 06 May 2024 06:26 IST

నిర్మల్‌ రాహుల్‌గాంధీ సభ
విజయవంతంతో శ్రేణుల్లో ఉత్సాహం
ఈటీవీ-ఆదిలాబాద్‌, న్యూస్‌టుడే-నిర్మల్‌

ప్రజలకు అభివాదం చేస్తూ, యువతకు స్వీయచిత్రాల అవకాశమిచ్చిన అగ్రనేత రాహుల్‌గాంధీ, గాడిద గుడ్డు కథ వివరిస్తూ నినాదాలు చేయించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఒకే వేదికపై కూచాడి శ్రీహరిరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, వేణుగోపాలాచారి కనిపించటం, భారీగా తరలివచ్చిన జనం... వెరసి నిర్మల్‌లో నిర్వహించిన జనజాతర సభ విజయవంతం కావటం కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. సభ ఆద్యంతం పాత, కొత్త కలయిక అన్నట్లు సాగింది. ఆదిలాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఆదివారం నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభకు పార్టీ భారీ జనసమీకరణ చేసింది. నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌, బోథ్‌ నియోజకవర్గాల నుంచి ఉదయం 11గంటలకు జనం తరలివచ్చారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 12:44 గంటలకు రాగానే జనం నుంచి విశేష స్పందన లభించింది. మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రారంభమైన రేవంత్‌రెడ్డి ప్రసంగం పది నిమిషాల్లో ముగిసింది. ఆతర్వాత మధ్యాహ్నం 1:15 గంటలకు ప్రారంభమైన రాహుల్‌గాంధీ అనువాదంతో కూడిన ప్రసంగం 1:40 గంటల వరకు సాగింది. సభాస్థలిలో షామియానాలు వేయటంతో అధిక ఉష్ణోగ్రతల నుంచి కాస్తంత ఉపశమనం లభించింది.

సీఎం రేవంత్‌ గాడిద గుడ్డు అంటుంటే బొమ్మను ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే బొజ్జు, కంది శ్రీనివాస్‌రెడ్డి, అభ్యర్థి ఆత్రం సుగుణ, పక్కన శ్రీహరిరావు

ఆకట్టుకున్న అభివాదం

వేదికపైకి రాహుల్‌ రాగానే జనం ఆయనను దగ్గర నుంచి చూడటానికి పోటీ పడ్డారు. వేదికపై నుంచే ఆయన అటూ ఇటూ తిరుగుతూ అభివాదం చేయటం, కొంతమంది యువకులు తీసుకొచ్చిన చిత్రపటాలను స్వీకరించడం, ఒకరిద్దరితో కరచాలనం తర్వాత స్వీయచిత్రాల(సెల్ఫీ)లకు అవకాశం ఇవ్వటం యువతలో ఉత్సాహం నింపింది. రాహుల్‌ హిందీ ప్రసంగాన్ని ఆ పార్టీకి చెందిన ఓ యువకుడు తెలుగులోకి సరిగా అనువాదం చేయకపోవడంతో కొన్ని అంశాలు సభికులను అర్థం కాలేదు. ఉపాధిహామీ పథకం ప్రస్తుత రోజు కూలీ రూ.250ని రూ.400కు పెంచుతామని రాహుల్‌ అంటే అనువాదకుడు రూ.2500గా పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకాన్ని రాహుల్‌ నరేగా (నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ స్కీం)గా పేర్కొనగా అనువాదకుడు సైతం నరేగానే పేర్కొన్నారు. దీంతో వేదికపై ఉన్న మంత్రి సీతక్క నరేగాకు బదులు ఉపాధిహామీ పథకం అని సంబోధించాలని సూచించినా అనువాదకుడికి అర్థంకాలేదు.  

రేవంత్‌-ఐకేరెడ్డి ముచ్చట్లు

రాహుల్‌ ప్రసంగిస్తున్నప్పుడు వేదికపై పక్కపక్కనే కూర్చున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరస్పరం ముచ్చటించటం ఆసక్తి రేకెత్తించింది. నియోజకవర్గాల్లో పరిస్థితిని సీఎం ఆరా తీయడమే కాకుండా ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించి తీరాలని సూచించినట్లు తెలిసింది. ఇంద్రకరణ్‌రెడ్డి పక్కన కూర్చున్న కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి సైతం మాట కలపటం కనిపించింది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రేంసాగర్‌రావు, వినోద్‌, వివేక్‌ సభకు హాజరుకాలేదు.

వేదికపై ఆసీనులైన కాంగ్రెస్‌ నాయకులు గజేందర్‌, నారాయణరావు పటేల్‌, కంది శ్రీనివాస్‌రెడ్డి, వెడ్మబొజ్జు (ఎమ్మెల్యే), విఠల్‌రెడ్డి, శ్రీహరిరావు, విష్ణునాథ్‌, ఆత్రం సుగుణ (ఎంపీ అభ్యర్థి), సీతక్క(మంత్రి), సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలాచారి, అద్దంకి దయాకర్‌, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, రాములునాయక్‌, నరేష్‌జాదవ్‌


శ్రీహరిరావు హైలెట్‌

జనజాతర సభలో నిర్మల్‌ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నీతానై మెలగటం కనిపించింది. భారాసలో ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలాచారి, విఠల్‌రెడ్డి సహా పలువురు పాతతరం నేతలంతా ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన తర్వాత నిర్మల్‌లో అగ్రనేత రాహుల్‌ హాజరుకావడంతో సహజంగానే ఆసక్తి వ్యక్తమైంది. కానీ ఎక్కడా విభేదాలు కనిపించకుండా సభ విజయవంతం కావటం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మంత్రి సీతక్కసహా ఇతర కీలక నేతల సమక్షంలో సభ ఆద్యంతం శ్రీహరిరావు మార్గదర్శకత్వంలోనే సాగింది. రాహుల్‌ ప్రసంగించే ముందు శ్రీహరిరావు పేరు ప్రస్తావించగానే యువత నుంచి కేరింతలతో కూడిన స్పందన వచ్చింది. ఆచార్య కోదండరాం, పార్టీ నేతలు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, అద్దంకి దయాకర్‌, సత్తు మల్లేశం, విష్ణునాథ్‌, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

హాజరైన కార్యకర్తలు, ప్రజలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని