logo

అధికారుల దన్ను.. గిరి యువత దమ్ము

పాడేరు ఐటీడీఏ పరిధిలో పదకొండు మండలాల్లో ఆరు లక్షల జనాభా ఉంటే ప్రతి ఏటా లక్ష మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

Published : 29 Jan 2023 03:19 IST

కలిసొచ్చిన   ఉచిత శిక్షణ
గ్రూప్‌-1 మెయిన్స్‌కు 12 మంది ఎంపిక

గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఎంపికైన గిరి యువత

ఒకప్పుడు సివిల్స్‌, ఏపీపీఎస్సీ గ్రూప్స్‌ పోటీ పరీక్షలంటే భయపడే గిరి యువత ఇప్పుడు పోటీ    పరీక్షల్లోనూ ప్రతిభ చూపుతోంది. పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ చొరవతో ఏర్పాటు చేసిన సివిల్స్‌ కోచింగ్‌ శిబిరం వీరికి తోడుగా నిలిచింది. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షల్లో మన్యం బిడ్డలు రాణించారు.  శిబిరంలో శిక్షణ తీసుకుంటున్న 45 మంది అభ్యర్థుల్లో 12 మంది మెయిన్స్‌కు ఎంపికై అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నారు.

సివిల్స్‌ ఉచిత శిక్షణ కేంద్రంలో యువతకు సూచనలిస్తున్న ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ (పాత చిత్రం)

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే: పాడేరు ఐటీడీఏ పరిధిలో పదకొండు మండలాల్లో ఆరు లక్షల జనాభా ఉంటే ప్రతి ఏటా లక్ష మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో ఆరు వేల మంది వరకూ పదో తరగతి విద్యార్థులు, ఐదు వేల మంది వరకు డిగ్రీ, ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. మరో రెండు వేల మంది వరకు బీఈడీ, ఇంజినీరింగ్‌ కోర్సులు చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వం భర్తీ చేసే ఉపాధ్యాయ, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకే పరిమితమవుతున్నారు. ఈ ప్రాంతంలో చదువుతున్న గిరిజన యువతకు ఎన్నో రకాల ఉన్నత స్థాయి పోస్టులున్నా పోటీ పరీక్షలపై అంతగా ఆసక్తి, అవగాహన ఉండేవి కావు. దీంతో ఆయా కొలువుల్లోకి ప్రవేశించ లేకపోతున్నారు. పదకొండు మండలాల్లో సుమారు 15 వేల మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులున్నారు. వీరిలో గ్రూప్‌-1, ఇతర అత్యున్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వారు పదుల సంఖ్యలోనే ఉండటం గమనార్హం.
ఏడాదిన్నర కిందట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రోణంకి గోపాలకృష్ణ ఇక్కడున్న గిరి యువత ప్రతిభను గుర్తించారు. వీరికి శిక్షణను అందించగలిగితే రాణిస్తారని ఆలోచించారు. ఈ క్రమంలో సివిల్స్‌, గ్రూప్స్‌ అభ్యర్థులకు శిక్షణను అందించడంలో అనుభవమున్న 21 సెంచురీ సాఫ్ట్‌వేర్‌ సొల్సూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో అర్హత పొందిన 45 మందిని ఎంపిక చేశారు. సివిల్స్‌తో పాటు పోటీ పరీక్షలకు విశాఖ పరిధిలో వేపగుంట కేంద్రంగా శిక్షణ అందిస్తున్నారు. వీరిలో తాజాగా గ్రూప్‌-1 మెయిన్స్‌కు 12 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. గ్రూప్స్‌-4 మెయిన్స్‌కు మరో తొమ్మిది మంది ఎంపికయ్యారు.


ఇదే స్ఫూర్తితో ముందుకు..

ఐటీడీఏ ఆధ్వర్యంలో తొలిసారిగా సివిల్స్‌, పోటీ పరీక్షల కోసం కోచింగ్‌ ఇప్పించడం మాకో గొప్ప అవకాశం. మెటీరియల్‌ బాగా ఉపయోగపడుతోంది. నేను గ్రూప్‌-1, 4 మెయిన్స్‌కు ఎంపికయ్యాను. శిక్షణ ద్వారా అందించిన మెలకువలతో మాకు నమ్మకం కలిగింది. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో సివిల్స్‌లో కూడా నెగ్గుకు రాగలమనే ధీమా కలుగుతోంది.

ఉమాసాయి


భయాన్ని పోగొట్టింది..

గ్రామీణ ప్రాంతంలో అరకొర సదుపాయాలతో విద్యను అభ్యసించిన మాకు పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రాగలమో అనే భయం ఉండేది. ఐటీడీఏ ఏర్పాటు చేసిన శిబిరం మాలో భయాన్ని పోగొట్టింది. ప్రస్తుతం గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఎంపికయ్యాను.

జయరాం


సువర్ణావకాశంగా భావిస్తున్నాం

మా తల్లిదండ్రులు దినసరి కూలీలు. ఎంతో కష్టపడి నన్ను డిగ్రీ వరకూ చదివించారు. ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆశయం నాలో ఉన్నా మా కుటుంబ పరిస్థితి బాగులేక ముందుకు సాగలేకపోతున్నాను. ఇంతలో ఐటీడీఏ పీవో చొరవతో ప్రారంభించిన సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ నాకెంతో సహాయపడింది. రూ.లక్షలు ఖర్చు చేస్తేగాని పొందలేని శిక్షణను ఈ శిబిరం ద్వారా పొందగలిగాం. శిక్షణలో ఇచ్చిన సలహాలు, మెలకువలు నాకు గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఎంపికయ్యేందుకు ఉపయోగపడ్డాయి. మా ఉన్నతికి ఇదో సువర్ణావకాశంగా భావిస్తున్నాం.

ఇంద్రకుమారి


ఎంతో సంతోషాన్నిచ్చింది...

చక్కని ప్రతిభ, సామర్థ్యమున్న గిరి యువత కొన్ని ఉద్యోగాలకే పరిమితమవుతున్నారు. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఉన్నతాధికారులతో చర్చించి సివిల్స్‌, గ్రూప్స్‌కు శిక్షణ కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలనుకున్నా. అనుకున్నదే తడవుగా ఓ శిక్షణ సంస్థతో ఒప్పందం చేసుకుని తొమ్మిది నెలల కిందట కోచింగ్‌ ప్రారంభింపజేశాం. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించాం. ఇందులో శిక్షణ పొందుతున్న వారు ప్రస్తుతం గ్రూప్‌-1 మెయిన్స్‌కు 12 మంది ఎంపిక కావడం ఆనందించదగ్గ విషయం. భవిష్యత్‌లో ఇక్కడ శిక్షణ పొందుతున్న అభ్యర్థులు సివిల్స్‌లోనూ రాణిస్తారని ఆకాంక్షిస్తున్నా.

గోపాలకృష్ణ, ఐటీడీఏ పీవో, పాడేరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని