logo

విజయ పరంపరకు నాంది పలుకుదాం

ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించి అసెంబ్లీ ఎన్నికల విజయ పరంపరకు నాంది పలకాలని తెదేపా నేతలు పిలుపునిచ్చారు.

Published : 07 Feb 2023 03:43 IST

తెదేపా మండలి అభ్యర్థి పరిచయంలో నేతలు

చిరంజీవిని సత్కరిస్తున్న బండారు, బుద్ద, పప్పల, కిడారి, ఈశ్వరి

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించి అసెంబ్లీ ఎన్నికల విజయ పరంపరకు నాంది పలకాలని తెదేపా నేతలు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా తెదేపా కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అధ్యక్షత వహించారు. ముందుగా అభ్యర్థి చిరంజీవిని అందరికీ పరిచయం చేశారు. ఆయనకు శాలువా కప్పి నూకాలమ్మ చిత్రపటం అందించి సత్కరించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలో వాలంటీర్ల మద్దతుతో దొడ్డిదారిన గెలవాలని వైకాపా ప్రయత్నిస్తోందని, దీనిని అడ్డుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీతోపాటు అభ్యర్థి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. అందుకే చంద్రబాబు ఎంతో లోతుగా ఆలోచించి అభ్యర్థిని మార్చారని చెప్పారు. రాజధాని వ్యవహారం న్యాయస్థానంలో ఉండగా ఉగాదికి విశాఖ రాజధాని అంటూ మంత్రులు నోటికొచ్చింది మాట్లాడుతూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను ఓడించడానికి ఉద్యోగులు, నిరుద్యోగులు చూస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

సమావేశంలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్‌, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ వంజంగి కాంతమ్మ, మాడుగుల, ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పి.వి.జి.కుమార్‌, ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, నాయకులు బత్తుల తాతయ్యబాబు, జి.మల్లునాయుడు, కోట్ని బాలాజీ పాల్గొన్నారు.


సామాన్య కుటుంబం నుంచి వచ్చా..

అభ్యర్థి చిరంజీవి మాట్లాడుతూ తనను పరిచయం చేసుకున్నారు. ‘రావికమతం మండలం దొండపూడి సొంత ఊరు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడిని. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా ఉద్యోగం చేశాను. పుష్కర కాలం సర్వీసు ఉన్నా స్వచ్ఛంద పదవీ విరమణ చేశానని’ చెప్పారు. తన శిష్యులు అన్ని రంగాల్లో ఉన్నారని తెలిపారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, పటిష్ఠమైన పార్టీ క్యాడర్‌ సహకారంతో విజయం సాధిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని