విశాఖ ఉక్కుపై.. నష్టాల నెపమా?
ఓ వైపు బొగ్గు కొనలేక ఉత్పత్తి తగ్గిస్తుంటే.. విశాఖ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం తగ్గిందంటూ పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇవ్వడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
ఆర్థిక చేయూత దిశగా పడని అడుగులు
పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా ఇద్దరు వైకాపా ఎంపీలు
గనుల కేటాయింపు, బొగ్గు కొరతపై దృష్టిసారించని వైనం!
ఈనాడు-విశాఖపట్నం
ఓ వైపు బొగ్గు కొనలేక ఉత్పత్తి తగ్గిస్తుంటే.. విశాఖ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం తగ్గిందంటూ పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇవ్వడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సమస్య మూలాలపై దృష్టి పెట్టి, ఆర్థిక చేయూత దిశగా అడుగులు వేయకుండా విశాఖ ఉక్కుపై నష్టాల నెపమేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
* ఏపీలో కేంద్ర ప్రభుత్వ రంగంలో నడుస్తోన్న అతిభారీ పరిశ్రమ విశాఖ ఉక్కు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కల్పవృక్షంలాంటి పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికల్లోనూ ‘విశాఖ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల దేశవ్యాప్తంగా ఉక్కు రంగంలో 2.1% మేర ఉత్పత్తి తగ్గింది’ అని పేర్కొనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
బొగ్గు కొరత ఓ కారణం: విశాఖ ఉక్కు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 73 లక్షల టన్నులు. ప్రతి రోజూ 21-22 వేల టన్నుల ఉక్కు తయారు చేయడానికి తగ్గ వనరులున్నాయి. కేవలం ముడి సరకు లేకపోవడంతో ఈ ఉత్పత్తి రోజుకు 10-12 వేల టన్నులకు పరిమితమైంది. గతేడాది విశాఖ ఉక్కులో వచ్చిన రూ.950కోట్ల లాభాలను కేవలం బొగ్గు కొనుగోలుకే ఉపయోగించాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో కేంద్రం ఆర్థికంగా చేయూత ఇవ్వాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు వేయలేదు. దేశీయంగా ఉండే బొగ్గు సైతం గత ఏడాదిగా తగినంత సరఫరా సరిగా చేయడంలేదన్న ఆరోపణలున్నాయి. మహానది కోల్‌హిల్స్ నుంచి టన్ను రూ.3200 వచ్చే బొగ్గు ఇవ్వకపోవడంతో.. రూ.6-15 వేలు ఖర్చు చేసి ఇతర కేంద్రాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చిందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
పాదయాత్రలో హామీ ఇచ్చినా: 2013లో విశాఖ స్టీల్ ప్లాంటుకు గనులు కేటాయించాలని, స్టీల్ అథార్టీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌ఏఐఎల్)లో కలపాలని రెండు సూచనలు అప్పటి కమిటీ చేసింది. గనుల చట్టం మార్చే ముందు పార్లమెంటరీ కమిటీలు సమావేశమై విశాఖ ఉక్కుకు గనులు కేటాయించే దిశగా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశాయి. అయినా గనుల కేటాయింపు జరగలేదు. విశాఖ ఉక్కు 2007 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.35 వేల కోట్లు ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం)కు అదనంగా ఎన్‌ఎండీసీ (నేషనల్ మినరల్ డవలెప్‌మెంట్ కార్పొరేషన్)కు చెల్లించాయి. ఆ నగదు ఎన్‌ఎండీసీకి లాభాలుగా చూపించి పెద్దపీట వేస్తున్నారే తప్ప, డబ్బులు అదనంగా విశాఖ ఉక్కుతో ఎందుకు ఖర్చు పెట్టించారనే దిశలో కేంద్రం ఆలోచించడం లేదని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అలా ఆలోచించి ఉంటే ఆ సమయంలోనే గనులు కేటాయించి ఉండేవారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా శంకుస్థాపన చేసిన ‘జిందాల్’కు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మైన్స్ (గనులు) అడిగి వచ్చారని, విశాఖ ఉక్కుకు గనులు ఎందుకు అడగడం లేదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. వైకాపా అధికారంలోకి వస్తే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో మాట్లాడి విశాఖ ఉక్కుకు గనులు ఏర్పాటు చేస్తామని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇద్దరు ఎంపీలు సభ్యులైనా...:
పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి, రాజ్యసభ సభ్యులు వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకట రమణ నియమితులయ్యారు. అయితే ఈ ఏడాది ప్రస్తుత కమిటీలో మోపిదేవి వెంకటరమణ లేరు. ఈ కమిటీలో ఉన్న మిగిలిన ఇద్దరు సభ్యులు ఒత్తిడి తెచ్చి పార్లమెంటరీ స్థాయి సంఘంతో కలిసి గత రెండేళ్లలో విశాఖ ఉక్కును సందర్శించలేదు. కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులతో ఉత్పత్తి తగ్గడానికి గల కారణాలపై, సమస్యలపై చర్చించలేదు. గతేడాది డిసెంబరు 30, 31న బెంగళూరులో దక్షిణ భారతదేశంలో స్టీలు వినియోగంపై సమావేశం నిర్వహిస్తే ఏపీ సభ్యులు గైర్హాజరయ్యారు. ఆ సమయంలో సీఎం పర్యటన ఉందని ఓ ఎంపీ హాజరుకాకపోవడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. పార్లమెంటరీ కమిటీ సభ్యుల్లో ఉన్న ఎంపీలు సబ్ కమిటీగా విశాఖ ప్లాంట్‌ను సందర్శించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Yash 19: హాలీవుడ్ డైరెక్టర్‌తో యశ్.. సంబరపడుతోన్న అభిమానులు..
-
26 ఏళ్ల టెక్ సీఈవో.. నేరగాడి చేతిలో హత్యకు గురై..!
-
Road Accident: రోడ్డు ప్రమాదంలో నలుగురు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల దుర్మరణం
-
Jairam Ramesh : మణిపుర్ వెళ్లేందుకు మోదీకి ఒక్కరోజు కూడా వీలు కాలేదా?: కాంగ్రెస్
-
Nepal Cricket: కార్డియాక్ కిడ్స్... వీళ్ల స్ట్రోక్‌లు మామూలుగా ఉండవ్!
-
Uttar pradesh: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దళిత యువతిపై.. పోలీసు అత్యాచారం