logo

పోషకాలు ఘనం.. ప్రోత్సాహకం శూన్యం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకంలో మార్పులు చేసిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు నిధులు మాత్రం పెంచడం లేదు.

Published : 28 Mar 2023 05:07 IST

రాగిజావ తయారీకి పైసా విదల్చని ప్రభుత్వం
గ్యాస్‌ ఖర్చులైనా ఇవ్వాలంటున్న నిర్వాహకులు
ఎటపాక, న్యూస్‌టుడే

నందిగామ జడ్పీ ఉన్నత పాఠశాలలో రాగిజావ పంపిణీ

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకంలో మార్పులు చేసిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు నిధులు మాత్రం పెంచడం లేదు. పెరుగుతున్న  ధరలకు తోడు మరింత భారం మోపుతూ అదనంగా నిధులు ఇవ్వకపోవడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు సతమతం అవుతున్నారు.

సర్కారు బడుల్లో విద్యార్థులకు గోరుముద్ద పథకంలో భాగంగా అదనపు పౌష్ఠికాహారం పేరిట ఉదయం పూట ‘రాగిజావ’ పంపిణీ మొదలుపెట్టారు. రోజు విడిచి రోజు జావ, చిక్కీలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వారంలో మూడు రోజులపాటు రాగి పిండి ఉడికించి ఇచ్చే బాధ్యత పాఠశాలల్లో మద్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకే అప్పగించారు.

* తరగతుల ప్రారంభానికి ముందే ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉప్పు, పప్పుతోపాటు గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ మెనూ కింద ఇచ్చే నిధులు చాలడం లేదని భోజన నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పుడు కొత్తగా మంగళ, గురు, శని వారాల్లో జావ ఉడికించడానికి వాడే గ్యాస్‌ అదనపు భారమవుతుందని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే విద్యార్థులకు ఉడికించి ఇస్తున్న గుగ్గిళ్లకు వాడే గ్యాస్‌కు పైసా చెల్లించని ప్రభుత్వం, మరో అదనపు పని అప్పగించడంపై ఆవేదన చెందుతున్నారు.

* జావ చేసేందుకు రోజూ కనీసం గంట ముందుగానే పాఠశాలలకు రావాలి. కనీసం గ్యాస్‌ భారమైనా ప్రభుత్వం భరించాలని వారు కోరుతున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు డివిజన్‌లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 205 ఉన్నాయి. వీటిలో సుమారు 18,771 మంది విద్యార్థులు చదువుతున్నారు.

పినపల్లిలో రాగి జావ తాగుతున్న విద్యార్థులు

ఇంకా రాని గ్లాసులు

ప్రతి విద్యార్థికి గ్లాసులిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, టెండర్లు ఖరారు కానందున ప్రస్తుతానికి ఇళ్ల నుంచి తెచ్చుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ తెచ్చుకోకపోతే సర్దుబాటు చేయాలన్న సూచనతో గ్లాసులు తెచ్చుకోని వారికి పేపర్‌, ప్లాస్టిక్‌ గ్లాసులు అక్కడక్కడ వినియోగిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు తాగిన తర్వాత వాటినే కడిగి ఇస్తున్నారు. రోజూ ప్లాస్టిక్‌ గ్లాసులు ఇవ్వాలంటే మరింత చేతిచమురు వదులుతుందని ఏజెన్సీల నిర్వాహకులు వెనుకంజ వేస్తున్నారు.


అదనపు వనరులేవీ?

వంద మంది పిల్లలకు ముగ్గురు పనివారు ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది అవసరం. మెనూ ఇచ్చారు. సరిపడా వంట పాత్రలు, గ్లాసుల్లేవు, అదనంగా గ్యాస్‌ ఖర్చవుతుంది. గోరుముద్ద పథకం అమలుతో మాకు భారమవుతోంది. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పనిచేస్తున్నాం. ఇప్పుడు రాగిజావ అందించాలని ఉదయం ఏడుగంటలకే వస్తున్నాం. రోజుకు ఏడు గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఒకరికి రూ. 3 వేలు ఇస్తున్నారు. మాకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

పద్మ, రమణ, మధ్యాహ్న భోజన నిర్వాహక సంఘాల ప్రతినిధులు


ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

రాగిజావ పంపిణీకి సంబంధించి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వీటి పరిష్కానికి చర్యలు తీసుకుంటాం. మెనూ సక్రమంగా అమలు చేయాల్సిందే.  

సలీం బాషా, డీఈఓ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు