logo

గిరిజనులకు ప్రేమామృత ధార

అసలే శ్రీరామనవమి. ఆపై తమ గ్రామానికి సత్యసాయి సేవా ట్రస్టు సహకారంతో రక్షిత మంచినీరు వచ్చింది. ఇక ఆ గిరి పల్లె ఆనందానికి హద్దేముంటుంది. చిన్నాపెద్దా, ఆడా, మగా అంతా పండగ వేళ తమ గ్రామానికి

Published : 31 Mar 2023 03:09 IST

రక్షిత నీటి పథకాన్ని ప్రారంభిస్తున్న  సత్యసాయి సేవాట్రస్టు ప్రతినిధులు

చింతపల్లి, న్యూస్‌టుడే : అసలే శ్రీరామనవమి. ఆపై తమ గ్రామానికి సత్యసాయి సేవా ట్రస్టు సహకారంతో రక్షిత మంచినీరు వచ్చింది. ఇక ఆ గిరి పల్లె ఆనందానికి హద్దేముంటుంది. చిన్నాపెద్దా, ఆడా, మగా అంతా పండగ వేళ తమ గ్రామానికి మంచినీరొచ్చిందన్న ఆనందంతో ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ప్రభుత్వాలు తాగునీటి సరఫరాకు ముందుకు రాకపోయినా సత్యసాయి సేవా ట్రస్టు తమ గ్రామంలో సుమారు 200 కుటుంబాలకు మంచినీరు అందించిందంటూ ఆ గిరిజనులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

బిందెలతో ఏర్పాటు చేసిన తోరణాలు

చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ బయలు కించంగి గ్రామానికి ఆనుకుని ఉన్న పెద్దవీధిలో సుమారు 200 గిరిజన కుటుంబాలున్నాయి. వీరికి చాలాకాలంగా తాగునీటి సదుపాయం లేదు. ప్రభుత్వ పథకాలు పనిచేయకపోవడంతో గిరిజనులంతా తాగునీటికి అవస్థలు పడుతున్నారు. దీనిపై పెద్దవీధి గిరిజనులు సత్యసాయి సేవాట్రస్టు ప్రతినిధులను సంప్రదించారు. గ్రామస్థులంతా శ్రమదానం చేస్తే సుమారు రూ.5 లక్షలు వెచ్చించి అవసరమైన రక్షిత నీటి పథకాన్ని నిర్మిస్తామని ట్రస్టు ప్రతినిధులు హామీ ఇచ్చారు. దీనికి గ్రామస్థులంతా అంగీకరించారు. సత్యసాయి ప్రేమామృత ధార పథకంలో భాగంగా కొండపై ఉన్న నీటి వనరులను ఆధారంగా చేసుకుని ట్యాంకు, పైపులైన్లు, కుళాయిల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సత్యసాయి సేవాట్రస్టు ప్రతినిధులు సమకూర్చారు. గిరిజనులంతా శ్రమదానం చేసి పథకం నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరించారు.


గిరిజనుల సంప్రదాయ స్వాగతం

సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులుగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వశిష్ఠ జీవిత బీమా సంస్థ ప్రతినిధులు వంశీతోపాటు సినీపాటల రచయిత దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామశాస్త్రి దంపతులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నీటి కుళాయిలను అతిథులు, సత్యసాయి సేవాట్రస్టు ప్రతినిధులు గణేష్‌, మూర్తి తదితరులు ప్రారంభించారు. చౌడుపల్లి సర్పంచి కె. లలిత, ఎంపీటీసీ సభ్యురాలు లువ్వాబు మీనా కుమారి, మాజీ సర్పంచులు సాగిన కృష్ణపడాల్‌, అప్పలమ్మ, దేవుడమ్మ,  సత్యసాయి ట్రస్టు ప్రతినిధి అడపా  విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని