logo

విద్యాశాఖలో గందరగోళం

విద్యాశాఖలో ఇటు పదోన్నతులు.. అటు బదిలీలు ఒకేసారి చేపడుతుండటంతో ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారు. హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్మీడియట్‌ బోధనకు స్కూల్‌ అసిసెంట్లను ఒక ఇంక్రిమెంట్‌ ఇచ్చి నియమించుకుంటున్నారు.

Updated : 28 May 2023 03:39 IST

పదోన్నతులు.. బదిలీలకు ఒకేసారి కసరత్తు
స్థానచలనానికి 6,088 మంది ఉపాధ్యాయుల దరఖాస్తు
ఈనాడు డిజిటల్‌ - అనకాపల్లి, న్యూస్‌టుడే - పాడేరు

సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు

విద్యాశాఖలో ఇటు పదోన్నతులు.. అటు బదిలీలు ఒకేసారి చేపడుతుండటంతో ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారు. హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్మీడియట్‌ బోధనకు స్కూల్‌ అసిసెంట్లను ఒక ఇంక్రిమెంట్‌ ఇచ్చి నియమించుకుంటున్నారు. వీరి స్థానంలో ఖాళీ అయిన పాఠశాల సహాయక పోస్టులను సెంకడరీ గ్రేడ్‌ టీచర్లతో భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో  సబ్జెక్ట్‌ టీచర్ల ఖాళీల్లోను ఎస్‌జీటీలనే నియమించాల్సి ఉంది. ఈ ప్రక్రియంతా పూర్తయితేనే ఏయే పాఠశాలల్లో ఎన్ని ఖాళీలున్నాయి స్పష్టంగా తెలుస్తుంది.

విలీన పాఠశాలలతో వెయ్యికి పైగా ఎస్‌జీటీ పోస్టులు మిగులు చూపిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో ఖాళీలను ఈ బదిలీల్లో చూపించడానికి అవకాశం లేదు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో 10 శాతం ఖాళీలను బ్లాక్‌ చేయబోతున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే బదిలీలకు దరఖాస్తులు స్వీకరించారు. శనివారం ఉదయం వరకు అవకాశం ఇవ్వగా 6088 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. జీరో సర్వీసు నుంచి దరఖాస్తుకు అవకాశం ఇవ్వడం.. ఉమ్మడి జిల్లా నుంచి ఆఖరి బదిలీలు కావడంతో ఎక్కువ మంది పోటీపడుతున్నారు.

ఒకేచోట ఎనిమిది విద్యా సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, అయిదేళ్లు పూర్తయిన హెచ్‌ఎం, ఎంఈవోలకు స్థానచలనం తప్పదు. వీరికి తోడు గతేడాది సుమారు 300 పైగా ప్రాథమిక పాఠశాలలను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీనివల్ల విలీన పాఠశాలల్లో 864 సెకండరీ గ్రేడ్‌ టీచర్ల పోస్టులు మిగిలిపోయాయి. ఆయా పోస్టుల్లో ఉన్నవారిని గతేడాది తాత్కాలిక ప్రాతిపదికన సర్దుబాటు చేశారు. ఈ ఏడాది నుంచి అక్కడి పోస్టులు రద్దు కానుండటంతో ఇప్పటివరకు అక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా అక్కడి నుంచి కదలాల్సిందే. అందువల్లే ఈసారి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఫౌండేషన్‌ స్కూల్‌, ఫౌండేషన్‌ స్కూల్‌ ప్లస్‌, ప్రీ హైస్కూల్‌, హైస్కూల్‌, హైస్కూల్‌ ప్లస్‌ పేర్లతో నిర్వహించనున్నారు. ఈ కొత్త విధానంలో ఖాళీలు ఎక్కడెక్కడ చూపుతారో తెలియక గురువులు అయోమయానికి గురవుతున్నారు. ఈనె 28, 29 తేదీల్లో దరఖాస్తులు పరిశీలించి ముసాయిదా జాబితా.. తుది జాబితాలను విడుదల చేసి తర్వాత ఖాళీలను ప్రదర్శించనున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.

రంపలో 250 మంది బదిలీ!

రంపచోడవరం, న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమ శాఖ (విద్య) ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించే ఉపాధ్యాయుల బదిలీలకు అన్ని చర్యలు పూర్తిచేశామని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌రాజు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఐటీడీఏ సమావేశమందిరంలో అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డీడీ సమావేశమయ్యారు. ఆశ్రమ పాఠశాలలతో పాటు గిరిజన ప్రాధమిక పాఠశాలల్లో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన సుమారు 250మంది బదిలీ అవుతారన్నారు. డీడీ కార్యాలయ పర్యవేక్షకులు కిషోర్‌, సంఘాల నాయకులు వేణుగోపాల్‌, నాగభూషణ, విల్సన్‌బాబు, సూరిబాబు, రంగారావు, మంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని