logo

అంగన్‌వాడీ పాలు.. అంతటా లోపాలు!

అరకు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో గత మూడు నెలలుగా పాల సరఫరా నిలిచిపోయింది. ఇటీవల పాల ప్యాకెట్లు అందించారు. అవి కూడా మే 13తో వినియోగానికి గడువు ముగిసినవి సరఫరా చేశారు.

Updated : 03 Jun 2023 04:41 IST

పాలప్యాకెట్లు

ఈనాడు డిజిటల్‌, పాడేరు - న్యూస్‌టుడే, అరకులోయ, అనకాపల్లి పట్టణం, పాడేరు పట్టణం : అరకు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో గత మూడు నెలలుగా పాల సరఫరా నిలిచిపోయింది. ఇటీవల పాల ప్యాకెట్లు అందించారు. అవి కూడా మే 13తో వినియోగానికి గడువు ముగిసినవి సరఫరా చేశారు. వీటిని అంగన్‌వాడీ కార్యకర్తలు వెంటనే గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అవి చిన్నారులు తాగితే తీవ్ర ఇబ్బందులే తలెత్తేవి..

* అనకాపల్లిలో చాకలిపేట1, లోకవారివీధి, తాకాశివీధి కేంద్రాలకు పాలు అరకొరగా సరఫరా అవుతున్నాయి. మార్చిలో ఈ సెంటర్లకు అస్సలు సరఫరా కాలేదు. ఫిబ్రవరిలో ఉన్న పాలను సర్దుబాటు చేశారు. గత నెలలో 16 నుంచి 30వ తేదీ వరకు అందించలేదు. మాకవరపాలెం మండలంలో అంగన్‌వాడీ కేంద్రాలకు రెండు నెలలుగా సరఫరా ఆగిపోయింది.

* మునగపాకలోని ఎనిమిదో నంబర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో 16 మంది గర్భిణులు.. 48 మంది మూడేళ్లలోపు చిన్నారులు, 13 మంది ప్రీ స్కూల్‌ పిల్లలున్నారు. ఏప్రిల్‌లో వీరెవరికీ చుక్క పాలు కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది జనవరి నుంచి పాల సరఫరా సక్రమంగా జరగడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు.  

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పేరుతో పౌష్ఠికాహారం సరఫరా చేస్తున్నామని సర్కారు ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. ఆ పోషకాహారంలో కీలకమైన పాలును మాత్రం సక్రమంగా సరఫరా చేయలేకపోతోంది. గత కొంతకాలంగా వీటి సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఓ కేంద్రానికి ఒకనెలలో అందితే రెండు నెలలు ఇవ్వడం లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు క్రమం తప్పకుండా అందాల్సిన పాల కోసం పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. తల్లిపాల ప్రాధాన్యం గురించి నొక్కి వక్కాణించే అంగన్‌వాడీ కేంద్రాలు కనీసం ప్యాకెట్‌ పాలు అందించడంలోనూ నిర్లక్ష్యం చూపుతున్నాయి.

ఇలాగేనా పోషకాహారం అందించేది..?

మాతాశిశు మరణాలకు పోషకాహార లోపమే కారణం. అందుకే ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఏటా రూ.కోట్ల ఖర్చుచేస్తున్నాయి. గత మూడేళ్లుగా పాలు సరఫరాలో లోపాలను అధిగమించలేకపోతున్నారు. ఏడాదిలో ఆరు నెలలు పూర్తిగాను.. మిగతా ఆరు నెలలు 50 నుంచి 70 శాతమే పాలను సరఫరా చేస్తున్నారు. ఓ ప్రాజెక్టుకు ఒక నెల సరఫరాచేస్తే మరోనెల వేరే ప్రాజెక్టుకు అందజేస్తున్నారు. చిన్నారులకు రోజుకు 100 ఎం.ఎల్‌ చొప్పున 25 రోజులకు 2.5 లీటర్లు ఇవ్వాలి. గర్భిణి, బాలింతలకు రోజుకు 200 ఎం.ఎల్‌ చొప్పున 25 రోజులకు 5 లీటర్ల చొప్పున అందజేయాలి. అరకొరగా సరఫరా అవుతుండటంతో లబ్ధిదారులకు ఇచ్చే పరిమాణంలో కోతపెడుతున్నారు. కొన్నిచోట్ల పిల్లలకు బియ్యం, పప్పు, గుడ్లతోనే భోజనం పెడుతున్నారు.

ఏప్రిల్‌లో ఇవ్వలేదు

కేంద్రాలకు పాలు సక్రమంగా వస్తే మాకు అందుతున్నాయి. లేకుంటే ఆ నెల ఇవ్వడం లేదు. మొన్న నాలుగో నెలలో ప్రభుత్వం పాలు సరఫరా చేయలేదని మాకు ఇవ్వడం ఆపేశారు. గుడ్లు, పప్పులైతే ఇస్తున్నారు.. పాలు క్రమం తప్పకుండా ఇస్తేనే మేలు.

కట్టా సంతోషి  కుమారి. మునగపాక

నెల తప్పించి నెల ఇస్తున్నారు..

పాలు ప్రతినెలా ఇవ్వడం లేదు. ఒక నెల ఇస్తే మరుసటి నెల ఇవ్వడం లేదు. రోజూ బయట కొనుక్కొని తాగే స్థోమత మాలాంటి వారికి ఉంటుందా?, ప్రభుత్వం సక్రమంగా పాలు సరఫరా చేయాలి. ఏజెన్సీలో పౌషకాహార లోపం ఎక్కువ ఉంటుంది. ఇక్కడే అంగన్‌వాడీ కేంద్రాలకే పాలు ఇవ్వకపోతే ఎలా?

కిడారి లలిత కుమారి, పాడేరు

ఒక్కోసారి ఇవ్వడం లేదు.

బాలింతలకు రోజూ పాలు ఇవ్వాల్సి ఉండగా మే నెలలో 15 రోజుల పాటు పాలు ఇవ్వలేదు. మార్చిలో ఇదే పరిస్థితి. ఫిబ్రవరిలో వచ్చిన వాటిని మార్చిలో కొన్నిరోజుల పాటు సర్దుబాటు చేశారు. నెలలో ఒక్కోసారి సరఫరా లేదని ఇవ్వడం మానేస్తున్నారు. సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలి.

స్నేహ, బాలింత, అనకాపల్లి

ఉన్నతాధికారులు పరిష్కరిస్తారు..

పాల సరఫరా కొంత తగ్గింది. అవకాశాన్ని బట్టి అన్ని కేంద్రాలకు అందేలా చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులకు సర్దుబాటు చేయడానికి వీలు కావడంలేదు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం. పాల సరఫరాలో సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. కాలం చెల్లిన ప్యాకెట్ల సరఫరా గురించి ఎక్కడా ఫిర్యాదులు లేవు. సాధారణంగా వేసవిలో దిగుబడి తక్కువగా ఉండడం కూడా ఈ సమస్యకు కారణం.

ఉషారాణి, పీడీ, ఐసీడీఏస్‌, అనకాపల్లి

అంగన్‌వాడీ కేంద్రంలో బుడతలకు పౌష్ఠికాహారం


ఉమ్మడి జిల్లాలో ఐసీడీఎస్‌ ముఖచిత్రం ఇదీ

ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు : 25

అంగన్‌వాడీ కేంద్రాలు : 4,952

నెలకు సరఫరా చేయాల్సిన పాలు : 11.71 లక్షల లీటర్లు

నెలకు సగటున ఇస్తున్నది  : 5 నుంచి 6 లక్షల లీటర్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని