logo

ముందస్తు ఆడిట్‌ విధానం విజయవంతం

రాష్టంలో గత ఏడాది ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ముందస్తు ఆడిట్‌ విధానం విజయవంతమైందని, ఈ నెలలో పురపాలక శాఖలో కూడా బిల్లులు చెల్లించే విధానం అమల్లోకి తెస్తున్నామని స్టేట్‌ ఆడిట్‌ రాష్ట్ర డైరెక్టర్‌ ఆర్‌.హరిప్రకాష్‌ తెలిపారు.

Published : 09 Jun 2023 06:26 IST

మాట్లాడుతున్న హరిప్రకాష్‌

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: రాష్టంలో గత ఏడాది ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ముందస్తు ఆడిట్‌ విధానం విజయవంతమైందని, ఈ నెలలో పురపాలక శాఖలో కూడా బిల్లులు చెల్లించే విధానం అమల్లోకి తెస్తున్నామని స్టేట్‌ ఆడిట్‌ రాష్ట్ర డైరెక్టర్‌ ఆర్‌.హరిప్రకాష్‌ తెలిపారు. అనకాపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన  అధికారులు, సిబ్బంది అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ బిల్లులు చెల్లించిన అనంతరం వీలు చూసుకొని ఆడిట్‌ చేసేవారమని, దీంతో ఏమైనా తప్పులు జరిగినా, అధిక చెల్లింపులు చేసినా దిద్దుబాటు చర్యలు కష్టంగా జరిగేవన్నారు. అలా కాగితాలపై నెలలు, సంవత్సరాలు కూడా వీటిపై చర్యలు జరిగేవన్నారు. దీంతో ప్రయోగాత్మకంగా దేవాదాయ శాఖలో గత ఏడాది జులై 7 నుంచి తప్పనిసరి ప్రీ ఆడిట్‌ విధానం ప్రవేశపెట్టామన్నారు. రూ. 2,100 కోట్ల లావాదేవీల్లో 25 శాతం వరకూ వ్యయాన్ని ఆదా చేయగలిగామని చెప్పారు. ఇది పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందన్నారు. ఎవరూ ఎవరినీ సంప్రదించాల్సిన పనిలేదన్నారు. ప్రతి చెల్లింపునకు ముందస్తుగా ఆడిట్‌ చేయించుకొని, అనుమతి పొందిన తరవాతే బిల్లులు చెల్లించడం సాధ్యం అవుతుందన్నారు. దీంతో ఇప్పటికే 60 శాతానికి పైగా సత్పలితాలు వచ్చాయన్నారు. శత శాతం ఫలితాలు సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ఎదురైన సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పుడు పురపాలక, ఆర్థిక శాఖల అనుమతితో పురపాలక శాఖలో ముందస్తు ఆడిట్‌ విధానం అమల్లోకి తీసుకువస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయాలు కూడా ఈ విధానం కోరాయని, పంచాయతీరాజ్‌ శాఖలో కూడా ప్రయత్నాలు ఆరంభమయ్యాయన్నారు. దీంతో నిధులు విడుదలకు ముందే జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు ఉంటుందన్నారు. నిధులు చేజారిన తరవాత రికవరీ విధానం ఇబ్బందిగా మారుతోందన్నారు. ఈ విధానంపై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అవసరమైన సిబ్బంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుతున్నామన్నారు. ఎప్పటి ఆడిట్‌ అప్పుడే పూర్తి అవుతుందన్నారు. అనుమతి లేకుంటే బిల్లులు చెల్లించడం సాధ్యం కాదన్నారు. విశాఖ రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పి.సీతారామారావు, అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జి అధికారి నాగభూషణం, ఆడిట్‌ అధికారులు సుధాకర్‌రాజు, శ్రీనివాస్‌, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని