logo

డాక్టర్‌ జగన్‌మోసంరెడ్డి

అర్థ రూపాయి ఖర్చుపెట్టి రూ. 500తో ప్రచారం చేసుకుంటారు జగన్‌. వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు, ఫ్యామిలీ ఫిజీషియన్‌, ఆరోగ్య సురక్ష అంటూ ప్రచార ఆర్భాటం చేసుకున్నారే తప్ప వాటితో రోగులకు మేలు జరిగిందే లేదు.

Updated : 05 May 2024 03:30 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకొరగానే సేవలు
పరికరాలు, రసాయనాలకు కొరతే
వైకాపా సర్కారు ప్రచారయావే తప్ప సేవలు లేవు

ఈనాడు - పాడేరు, న్యూస్‌టుడే - రంపచోడవరం, గంగవరం, కొయ్యూరు, జి.మాడుగుల: అర్థ రూపాయి ఖర్చుపెట్టి రూ. 500తో ప్రచారం చేసుకుంటారు జగన్‌. వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు, ఫ్యామిలీ ఫిజీషియన్‌, ఆరోగ్య సురక్ష అంటూ ప్రచార ఆర్భాటం చేసుకున్నారే తప్ప వాటితో రోగులకు మేలు జరిగిందే లేదు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు మెరుగైన వైద్యసేవలు అందించలేక పోతున్నాయి. సర్కారు దవాఖానాల్లో మందులు తగినంత లేవు. ఇక వైద్య పరీక్షల సంగతైతే చెప్పనవసరమే లేదు. పరికరాలుంటే రసాయనాలు ఉండవు. రెండూ ఉంటే ల్యాబ్‌ టెక్నీషియన్లు ఉండరు. వైద్యులు సిఫార్సు చేసిన పరీక్షల్లో సగంవాటికి ప్రైవేటు ల్యాబ్‌లపైనే ఆధారపడాల్సి వస్తోంది.

నాడి పట్టడంతోనే సరి!

ఆరోగ్య కేంద్రాల్లో 63 రకాల పరీక్షలంటూ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్నారు.. వారు చెబుతున్నట్లు ఆసుపత్రిలో అన్ని పరీక్షలు జరగడం లేదు. పరికరాలు లేవని కొన్ని.. రసాయనాలు సరఫరా లేదని మరికొన్ని టెస్ట్‌లు చేయడం లేదు. పీహెచ్‌సీకి సగటున 40 నుంచి 70 మంది రోజూ తనిఖీలకు వస్తుంటారు. వీరిలో సగం మందికి వ్యాధి నిర్ధరణ పరీక్షల కోసం వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. ఈ పరీక్షల కోసం ల్యాబ్‌ టెక్నీషియన్‌ దగ్గరకు వెళితే ఇందులో రెండు చేస్తాం. ఓ రెండు బయట చేయించుకోండని పంపించేస్తున్నారు.

కె.కోటపాడు ఆసుపత్రిలో సొంత దుప్పట్లను వాడుతున్న రోగులు

ఇదేనా ఆరోగ్య సురక్ష?

  • అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ సేవలు అందడం లేదు. కొన్నాళ్లుగా ఈ పరికరం పనిచేయక మూలనపడేశారు. ఇటీవల కొత్త యంత్రం తెచ్చినప్పటికీ వినియోగంలోకి తేకుండా కాలయాపన చేస్తున్నారు. సీటీ స్కాన్‌ అవసరమైన వారు బయట రూ. వేలు ఖర్చుచేసి తీయించాల్సి వస్తోంది.  
  • ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పరీక్షలు నిర్వహించడానికి ఖరీదైన పరికరాలు ఉన్నా పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన రసాయనాలు లేకపోవడం వల్ల రోగులు బయట ప్రైవేటు ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. థైరాయిడ్‌ తదితర పరీక్షలు చేయాల్సి వస్తే బయట ప్రైవేటుకు చీటీ రాయాల్సి వస్తోంది. ఇది రోగులకు భారంగా మారింది. ఆసుపత్రికి రోజూ 250 నుంచి 300 మంది వరకూ రోగులు వస్తుంటారు. వీరిలో పేదలే ఎక్కువ మంది ఉంటారు. వీరికి సుగర్‌, మలేరియా, క్రియాటిన్‌, లివర్‌ పనితీరు పరిక్షలు వంటివి తప్ప మిగిలిన పరీక్షలు చేయలేకపోతున్నారు.
  • ఇటీవల జి.మాడుగుల మండలం గాంధీనగరం గ్రామానికి చెందిన వంతాల లలిత రాత్రంతా విరోచనాలతో బాధపడగా, మరుసటి రోజు జి.మాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. మందులు బయట మెడికల్‌ దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసి తీసుకువస్తే వైద్యసేవలు అందిస్తామని సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. పీహెచ్‌సీ పరిధిలోని ఆశ కార్యకర్తల వద్దా సరైన మందు నిల్వలు ఉండడం లేదు. జ్వరానికి పారాసెట్మాల్‌ మాత్రలు కూడా అందుబాటులో ఉండడం లేదు. ఆరోగ్య కేంద్రంలో నిల్వలు లేవని, తమకు తక్కువగా ఇస్తున్నారని ఆశ కార్యకర్తలు చెబుతున్నారు.
  • కె.కోటపాడు ఆసుపత్రిలో 14 మంది వైద్యులుండాల్సి ఉండగా 11 మందే ఉన్నారు. ముఖ్యంగా ఎండీ జనరల్‌ మెడిసిన్‌ పోస్టు ఖాళీగా ఉంది. చిన్నపిల్లల వైద్య నిపుణులు 2023 జూన్‌ నుంచి లేకపోవడంతో ప్రైవేటు వైద్యుల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఫార్మసిస్ట్‌ పోస్టు ఖాళీగా ఉంది. రోజుకు 250 నుంచి 300 మంది వరకు రోగులు ఆసుపత్రికి వస్తుండగా అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు ఆసుపత్రి కంటూ ప్రత్యేకంగా అంబులెన్స్‌ లేదు.

నాడు-నేడు మారలేదు చూడు

  • గంగవరంలో 2022 డిసెంబర్‌లో భవనం ప్రారంభించినా 2023 జూన్‌ వరకు అందుబాటులోకి తీసుకురాలేదు. భవన నిర్మాణంలో పలు లోపాలున్నాయని అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి గుర్తించి గుత్తేదారు నుంచి స్వాధీనం చేసుకోలేదు. ఆమె బదిలీ అనంతరం కొత్త భవనంలోకి మార్చారు. పీహెచ్‌సీ వద్దకు సరైన రహదారి లేదు. కొత్త ఫర్నిచర్‌ ఏర్పాటు చేయలేదు. తుప్పుపట్టిన కుర్చీలు, మంచాలు వినియోగిస్తున్నారు.
  • రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామంలో నాడు-నేడు కింద నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని ఆరు నెలల క్రితం వినియోగంలోకి తీసుకొచ్చారు. మూడు నెలల క్రితమే ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. రోగులకు పది మంచాలకు బదులు ఐదు మాత్రమే ఉన్నాయి. వైద్యసిబ్బంది విధులు నిర్వహించేందుకు టేబుల్స్‌, కుర్చీలు లేవు. భవనం నిర్మించినా అవసరమైన మౌలిక వసతులు కల్పించలేదు.
  • చోడవరం ఆసుపత్రిలో ఎక్స్‌రే యంత్రం తెచ్చి పెట్టారు గాని, ఒక్కసారీ ఉపయోగించిన పాపాన పోలేదు. దీనిని ఉపయోగించేందుకు నిపుణులను నియమించలేదు.  ఎక్స్‌రే పరికరాన్ని గదిలో పెట్టి తలుపులు మూసేసి భద్రంగా ఉంటారు. రోగులు ఎక్స్‌రే కోసం ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. దానికితోడు ఇక్కడ ఎముకల వైద్య నిపుణుడి పోస్టు లేదు.
  • కొయ్యూరు మండలం యు.చీడిపాలెంలో మెట్లకు రెయిలింగ్‌ వేయించలేదు. ప్రధాన ద్వారం గేటు ఏర్పాటు చేయలేదు. విద్యుత్తు, ప్లంబింగ్‌ పనులు పూర్తి చేయలేదు. ప్రహరీ నిర్మించలేదు. కంఠారం భవనంలో ప్రహరీగోడ కొంతమేర నిర్మించి వదిలేశారు. రాజేంద్రపాలెంలో ఐదేళ్ల కిందట నిర్మించిన భవనానికే శ్లాబు పెచ్చులు ఊడదీసి మళ్లీ పిక్కతో శ్లాబు పూత వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని