logo

ఆ మాత్రం ఇవ్వలేరు..!

‘జక్కంపూడికాలనీకి చెందిన ఎస్‌.వెంకటేశ్వరమ్మకు తరచూ తీవ్రమైన తలనొప్పి వస్తుండడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఓపీకి సోమవారం వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు 15 రోజులకు మందులను రాశారు. మందులను వాడిన తర్వాత మరోసారి రమ్మని సూచించారు.

Updated : 28 Jun 2022 07:36 IST

ఐదు రోజులకోసారి ఆస్పత్రికి రాలేకపోతున్నాం..!

ఈనాడు, అమరావతి

‘జక్కంపూడికాలనీకి చెందిన ఎస్‌.వెంకటేశ్వరమ్మకు తరచూ తీవ్రమైన తలనొప్పి వస్తుండడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఓపీకి సోమవారం వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు 15 రోజులకు మందులను రాశారు. మందులను వాడిన తర్వాత మరోసారి రమ్మని సూచించారు. ఆమె మందుల కౌంటర్‌ వద్దకు వెళితే.. కేవలం ఐదు రోజులకు మాత్రమే మందులను ఇచ్చారు. అవి అయిపోయిన తర్వాత రమ్మని చెప్పారు. వైద్యులు రాసిన చీటీలోని రెండు రకాల మందులు కూడా లేవని, వాటిని బయట కొనుక్కోమని చెప్పారు. ఆమెకు వైద్యులు రాసిన రెండు వారాల మందుల కోసం మూడుసార్లు ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిన పరిస్థితి ఉందని బతిమాలినా.. కౌంటర్‌లోని సిబ్బంది పట్టించుకోలేదు. కేవలం ఐదు రోజులకు మాత్రమే మందులు ఇవ్వాలని తమకు చెప్పారంటూ ఆమెకు చెప్పి పంపించేశారు.’

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం ఓపీకి రెండు వేల మందికి పైగా ప్రస్తుతం వస్తున్నారు. వీరిలో కొద్దిమంది ఆసుపత్రిలో చేరుతుంటారు. మిగిలిన వారికి మందులను రాసి వాడుకోమని వైద్యులు సూచిస్తుంటారు. దీంతో రోజుకు కనీసం 1500మందికి పైగా మందుల కౌంటర్ల వద్ద బారులుతీరి మందులను తీసుకుంటూ ఉంటారు. అయితే.. వీరి వ్యాధిని బట్టి వైద్యులు రెండు వారాల నుంచి నెల రోజులకు పైగా మందులను రాస్తుంటారు. కొంతమంది దీర్ఘకాలికంగా మందులను వాడాల్సి ఉంటుంది. వైద్యులు ఎన్ని రోజులకు మందులు రాసినా.. ఆసుపత్రిలోని ఉచిత కౌంటర్‌లో మాత్రం కేవలం ఐదు రోజులకే ఇస్తున్నారు. దీంతో నెల రోజులకు మందులను రాస్తే.. కనీసం ఆరుసార్లు ఆసుపత్రికి వస్తున్నారు. అసలే పేద రోగులు కావడంతో.. బయట కొనుక్కునే స్థోమత లేక ఆటో, బస్సు ఛార్జీలను పెట్టుకుని ఐదు రోజులకోసారి ఆసుపత్రికి వస్తున్నారు.

మందుల కౌంటర్‌ వద్ద రోగులు, వారి బంధువుల రద్దీ


ఐదు రోజులకోసారి విజయవాడలోని పలు ప్రాంతాల నుంచి ఆసుపత్రికి రావడమే కష్టంగా మారుతోంది. ఇంక నగర శివారుల్లోని పల్లెలు, జిల్లాలోని ఇతర ప్రాంతల నుంచి మందుల కోసం ప్రతిసారి వచ్చి వెళ్లడం జరగని పనే. అందుకే.. కొంతమంది ఒకసారి మాత్రమే ఆసుపత్రిలో మందులను తీసుకుని, ఐదు రోజులకు అవి అయిపోయాక స్థానికంగా ఉండే మందుల దుకాణాల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. శస్త్రచికిత్సలు చేయించుకుని ఇళ్ల వద్ద ఉంటూ దీర్ఘకాలం మందులను వాడే వారి పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంటోంది.


చాలాకాల నుంచి ఇదే సమస్య..

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు రోజులకు మాత్రమే మందులను ఇస్తుండడంతో రోగుల పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోంది. రోజూ ఓపీకి వచ్చే రెండు వేల మందితోపాటు ఐదు రోజులకోసారి మళ్లీ మళ్లీ వచ్చే వారితో మందుల కౌంటర్ల వద్ద భారీగా రద్దీ పెరుగుతోంది. ప్రతి ఐదు రోజులకోసారి ఆసుపత్రికి వచ్చి క్యూలైన్‌లో నిలబడడం చాలా కష్టంగా ఉంటోందని వృద్ధులు, మహిళలు వాపోతున్నారు. చాలాకాలం నుంచి ఇదే సమస్య ఉందని చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నెల రోజులకోసారి ఇచ్చేవారు. తర్వాత 15 రోజులకు ఓసారి ఇచ్చేవారు.


ఇప్పుడు కేవలం ఐదు రోజులకే తగ్గించడంతో.. ఇలా వచ్చామా.. మందులు వాడామా.. మళ్లీ వచ్చి క్యూలో నిలబడ్డామా అన్నట్టుగానే తమ పరిస్థితి ఉంటోందని విజయవాడకు చెందిన ఓ వృద్ధుడు వాపోయాడు.


వైద్యులు రాసిన వాటిలో కొన్నే..

వైద్యులు రాస్తున్న మందుల్లో కొన్ని మాత్రమే ఆసుపత్రిలోని కౌంటర్‌లో ఉంటున్నాయి. లేనివి బయట కొనుగోలు చేసుకోమంటూ సూచిస్తున్నారు. అధికారులు మాత్రం మందుల కొరత లేదని చెబుతున్నారు. ఉన్న మందులు కూడా ఐదు రోజులకే ఇస్తున్నారు. ఇదేంటని గొడవ పడుతుండడంతో.. ఐదు రోజులకే మందులు ఇస్తామంటూ ఆసుపత్రిలోని మందుల కౌంటర్‌ వద్ద నోటీసులు కూడా అంటించారు. కనీసం ఓ పది రోజులకైనా మందులు ఇస్తే.. తమకు కొంత భారం తగ్గుతుందని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని