logo

Kodali Nani: ‘వచ్చే ఎన్నికల్లో వంశీనే అభ్యర్థి’

2024లో వల్లభనేని వంశీమోహనే గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని, ఈ విషయం సీఎం జగన్‌మోహన్‌రెడ్డే తనతో స్పష్టంగా చెప్పారని, అయితే వ్యక్తులతో తనకు సంబంధం లేదని తమ అధినేత జగన్‌ ఎవరిని నిలబెడితే వారి

Updated : 01 Jul 2022 07:16 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి కొడాలి నాని, పక్కన మంత్రి జోగి రమేష్‌, పేర్ని నాని తదితరులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: 2024లో వల్లభనేని వంశీమోహనే గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని, ఈ విషయం సీఎం జగన్‌మోహన్‌రెడ్డే తనతో స్పష్టంగా చెప్పారని, అయితే వ్యక్తులతో తనకు సంబంధం లేదని తమ అధినేత జగన్‌ ఎవరిని నిలబెడితే వారి విజయం కోసమే పార్టీ శ్రేణులు కృషి చేయాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం దావాజీగూడెం ఎస్‌వీఆర్‌ కల్యాణ మండపంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి అధ్యక్షతన గన్నవరం నియోజకవర్గ వైకాపా ప్లీనరీ జరిగింది. ఈ సందుర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ గన్నవరంలో తెదేపాకు సరైన నాయకుడే లేని దుస్థితి నెలకొందన్న అన్నారు. పెనమలూరు టిక్కెట్‌ అడిగేందుకు వెళ్లిన ఆ పార్టీ నాయకులను గన్నవరం, గుడివాడలో పోటీ చేయాలని సూచిస్తున్నారని తెలిపారు. సర్గీయ ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను ఏదో అన్నారని వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు.. తన తండ్రి ఖర్జూరపునాయుడు అంటూ ఎప్పుడన్నా చెప్పారా? అంటూ విమర్శలు చేశారు. మరో మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ తెదేపా పాలనతో గుర్తిండిపోయే ఒక్క మంచి పథకాన్ని కూడా అప్పటి సీఎం చంద్రబాబు పెట్టలేకపోయారని విమర్శించారు. ఒక్క అమరావతికే రూ.లక్ష కోట్లు పెడితే నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలకు నగదు ఎవరిస్తారంటూ ప్రశ్నించారు. 2వ తేదీ జరిగే జిల్లా ప్లీనరీని విజయవంతం చేయాలని పార్టీ నేతలు గౌతమ్‌రెడ్డి కోరారు. ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ వంశీ అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు.. ఈనెల 30వ తేదీలోగా నియోజకవర్గాల ప్లీనరీలు పూర్తి చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడం వల్లనే ఎమ్మెల్యే లేకుండా తాము ప్లీనరీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య, ఎంపీపీలు రవి, చెన్ను ప్రసన్నకుమారీ, సరోజిని, పడమట సురేష్‌, పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, శ్రేణులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ను అవమానించేలా కొడాలి ప్రవర్తన

ప్లీనరీకి అతిథిగా హాజరైన మాజీ మంత్రి కొడాలి నానిని ప్రారంభోత్సవంలో భాగంగా దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేయాలంటూ మంత్రి జోగి రమేష్‌, మాజీ మంత్రి పేర్నినానితో కలిసి నాయకులు కోరారు. ఆ సమయంలో వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేయకుండా పక్కనే ఉన్న స్థానిక జడ్పీ కో-ఆప్టెడ్‌ సభ్యుడు ఎండీ గౌసాని మెడలో కొడాలి నాని పూలమాల వేయడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని