logo

కార్డులు ఎక్కడ...రాయితీ ఎలా..?

ఈ ఏడాది ఖరీఫ్‌ను ముందస్తుగా ప్రారంభించాలని చెప్పిన పాలకులు దానికి అనుబంధంగా ఉండే ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించడం లేదని రైతులు వాపోతున్నారు. వాటిలో ప్రధానమైనవి కౌలురైతు గుర్తింపు కార్డులు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో ఉన్న కౌలు విస్తీర్ణాన్ని బట్టి 50వేలకుపైగా కార్డులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు

Published : 02 Jul 2022 05:32 IST

ప్రారంభమైన సాగు పనులు

ఆందోళనలో అన్నదాతలు
మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే

ఈ ఏడాది ఖరీఫ్‌ను ముందస్తుగా ప్రారంభించాలని చెప్పిన పాలకులు దానికి అనుబంధంగా ఉండే ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించడం లేదని రైతులు వాపోతున్నారు. వాటిలో ప్రధానమైనవి కౌలురైతు గుర్తింపు కార్డులు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో ఉన్న కౌలు విస్తీర్ణాన్ని బట్టి 50వేలకుపైగా కార్డులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగు పనులు ప్రారంభమైనా ఇంకా పంపిణీ పూర్తికాలేదు. గతేడాది జూన్‌ నెలాఖరు వరకు ఇచ్చిన  కార్డులను మాత్రమే రైతుభరోసాకు పరిగణనలోకి తీసుకోవడంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఈసారి కూడా అలాంటి సమస్య పునరావృతం అవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో చాలామండలాల్లో ఇంకా సగం కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంది.
ఇచ్చింది 49శాతమే
జిల్లావ్యాప్తంగా సీసీఆర్సీ కార్డుల పంపిణీ ప్రక్రియ 49శాతం మాత్రమే పూర్తయ్యింది. నాగాయలంక మండలంలో అత్యధికంగా 87శాతం పూర్తి చేయగా గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో అతి తక్కువగా 29శాతం పూర్తి చేశారు. బందరు, కంకిపాడు మండలాల్లో 70శాతానికి పైగా చల్లపల్లి, మోపిదేవి, కృత్తివెన్ను, పెనమలూరు, ఉయ్యూరు, గూడూరు, ఉంగుటూరు, బంటుమిల్లి, కోడూరు మండలాల్లో 66 నుంచి 50శాతం మధ్యలో పూర్తిచేసి కొంతవరకు ఫర్వాలేదనిపించారు. తోట్లవల్లూరు, పెదపారుపూడి, గన్నవరం, పెడన, అవనిగడ్డ, మొవ్వ, పమిడిముక్కల, పామర్రు, బాపులపాడు, ఘంటసాల, గుడివాడ, మండలాల్లో 50శాతం లోపే అందజేశారు. సీసీఆర్సీ కార్డుల పంపిణీలో మిగిలిన జిల్లాలతో పోల్చితే కొంతవరకు ఫర్వాలేదు. కార్డుల జారీ ప్రక్రియ ఆలస్యమైతే ప్రభుత్వం అందించే లబ్ధి కోల్పోయే అవకాశం ఉందని కౌలురైతులు ఆవేదన చెందుతున్నారు.
అది ఉంటేనే రైతు భరోసా
కౌలు రైతుల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులకు సీసీకార్డు ఉంటే రైతుభరోసా అందిస్తారు.దీంతోపాటు ప్రభుత్వం ఇచ్చే  ఏ రాయితీ పొందాలన్నా పంటసాగు హక్కు పత్రం తప్పని సరి. ఇప్పటికే రైతుభరోసా కేంద్రాల ద్వారా రాయితీపై వరి విత్తనాలు పంపిణీ  ప్రక్రియ పారరంభించారు. పెడన, గూడూరు, బందరు వివిధ మండలాల్లో రైతులు వెద పద్ధతిలో సాగు పనులు ప్రారంభించారు. ఇప్పటికీ ప్రక్రియ పూర్తిచేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. కౌలు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా భూ యజమానులు అంగీకరించకపోవడంతో చాలామంది కార్డులు పొందలేక పోతున్నారు. మిగిలిన వారికైనా సక్రమంగా అందుతాయా అంటే అదీ కనిపించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటపై పెట్టుబడికి బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలన్నా కార్డు అవసరం. ఇప్పటికైనా  ఉన్నతాధికారులు చొరవ తీసుకుని వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు పంపిణీ ప్రక్రియను  త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

 


త్వరలోనే పూర్తి చేస్తాం
సీసీఆర్సీ కార్డుల పంపిణీ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుంది. ప్రస్తుతం కార్డుల జారీలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కృష్ణా జిల్లా ముందంజలో ఉంది. రెవెన్యూశాఖ ఉద్యోగులను సమన్వయం చేసుకుని త్వరితగతిన పంపిణీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాం. వెనుకబడిన మండలాల అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. కౌలు రైతులు కూడా చొరవ తీసుకుని వ్యవసాయశాఖ సిబ్బందిని కలిసి కార్డులు పొందాలి. భూ యజమానులు కూడా అవగాహనతో కౌలురైతుకు పంటసాగుహక్కు పత్రాలు అందించేందుకు అంగీకారం తెలపాలని కోరుతున్నాం.
- మనోహరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని