logo

భావ ప్రకటనా స్వేచ్ఛ గొంతు నొక్కుతున్నారు : కాంగ్రెస్‌

దేశంలో స్వేచ్ఛకు భంగం కలుగుతోందని, భావ ప్రకటనా స్వేచ్ఛ గొంతు నొక్కుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ పేర్కొన్నారు.

Published : 27 Nov 2022 05:12 IST

రాజ్యాంగంలో కీలకమైన అంశాల ప్రతిని చూపుతున్న
శైలజానాథ్‌. చిత్రంలో గురునాథరావు, నరసింహారావు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : దేశంలో స్వేచ్ఛకు భంగం కలుగుతోందని, భావ ప్రకటనా స్వేచ్ఛ గొంతు నొక్కుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం ఆంధ్రరత్న భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో స్వేచ్ఛకు భంగం కలుగుతోందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గట్టిగా చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. దేశం కోసం నిజాయతీగా పనిచేసిన వారంతా కలిసి కూర్చుని, రాజకీయ అభిప్రాయాలను పక్కన పెట్టి దేశం కోసం, ప్రజల మంచి కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం రచించారని తెలిపారు. రాజ్యాంగంలోని న్యాయం, స్వాతంత్య్రం, స్వేచ్ఛ, సమానత్వానికి.. భాజపా రూపంలో సవాలు వచ్చిందన్నారు. మనిషి మనిషికి మధ్య దూరం పెరుగుతోందని, అల్ప సంఖ్యాకులైన కొందరు.. భారతదేశ ఆర్థిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని ప్రపంచ కుబేరుగా చెలామణి అవుతుంటే.. కోటానుకోట్ల మంది నిరుపేదలవుతున్నారని పేర్కొన్నారు. న్యాయం ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా ఉంటోందన్నారు. కేంద్రం, రాష్ట్రం నుంచి స్వేచ్ఛను వెతుక్కునే కాలం వచ్చిందని విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్ఛ, ఆస్తి కలిగి ఉండే స్వేచ్ఛ వంటి వాటికి భంగం కలుగుతోందని దుయ్యపట్టారు. గౌరవô కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, దాని కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ ఆ ప్రయత్నంలోనే ఉన్నారని గుర్తు చేశారు. రాజకీయాలు, పార్టీలకతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. అధికారంలో ఉన్న వారు భారత రాజ్యాంగ పీఠిక చదువుకోవాలని సూచించారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్‌ వల్లే స్వేచ్ఛగా మాట్లాడుతున్నామని శైలజానాథ్‌ పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్‌ నాయకులతో జరిగిన సదస్సులో.. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి.గురునాథం, నరహరశెట్టి నరసింహారావు, జెట్టి గురునాథరావు, పి.వై.కిరణ్‌, కొరివి వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని