logo

‘అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులకూ వెనుకాడం’

డ్వాక్రా మహిళల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి తిన్నదంతా కక్కిస్తామని స్త్రీనిధి డీజీఎం సురేంద్ర హెచ్చరించారు.

Published : 08 Dec 2022 05:07 IST

జనార్దనపురం(నందివాడ), న్యూస్‌టుడే: డ్వాక్రా మహిళల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి తిన్నదంతా కక్కిస్తామని స్త్రీనిధి డీజీఎం సురేంద్ర హెచ్చరించారు. జనార్దనపురం, పుట్టగుంట క్లస్టర్‌ పరిధిలోని గ్రామైక్య సంఘాల పరిధిలో లక్షలాది రూపాయల అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో ఏజీఎం శ్యామలాదేవితో కలిసి డీజీఎం బుధవారం మండల సమాఖ్య కార్యాలయానికి వచ్చారు. పుట్టగుంట క్లస్టర్‌లోని పుట్టగుంట, చినలింగాల, పెదలింగాల, అరిపిరాల, చేదుర్తిపాడు గ్రామైక్య సంఘాల సభ్యులు, బుక్‌కీపర్లను కార్యాలయానికి పిలిపించి నగదు లావాదేవీల్లోని అక్రమాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా క్లస్టర్ల పరిధిలోని కొన్ని గ్రామాల్లో సీసీ, బుక్‌కీపర్లు, మరికొన్ని గ్రామాల్లో బుక్‌కీపర్లు, సంఘాల అధ్యక్షులు అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో ఇప్పటికే బయటపడిందన్నారు. సీసీ లక్ష్మీప్రసన్నను సస్పెండు చేసినట్లు తెలిపారు. జనార్దనపురంలోని 3 గ్రామైక్య సంఘాల పరిధిలో సుమారు రూ.20 లక్షల వరకు అక్రమాలు జరిగినట్లు తేలడంతో సీసీ రూ.5 లక్షల వరకు తిరిగి కట్టిందన్నారు. బుక్‌కీపర్లు, సంఘాల సభ్యులు కూడా వారు తిన్నది కట్టేందుకు ఒప్పుకున్నట్లు చెప్పారు. దీంతోనే వదిలి పెట్టమని అన్ని గ్రామైక్య సంఘాల రికార్డులను క్షుణ్నంగా తనిఖీ చేసి ఒక్కపైసా అక్రమం జరిగినట్లు తేలినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కార్యాలయంలోని అధికారులు, సిబ్బందితో డీజీఎం సమీక్ష నిర్వహించి కార్యాలయానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఎక్కువ శాతం విధులు నిర్వహించాలని ఏపీఎం ప్రధానరావు, సీసీలు, సిబ్బందికి సూచన చేశారు. తదుపరి జనార్దనపురం సందర్శించి తేజ, భార్గవి, ఉషోదయ గ్రామైక్య సంఘాల సభ్యులు, బుక్‌కీపర్లతో సమావేశమై అక్రమాల వివరాలను తెలుసుకున్నారు. ఈ రెండు క్లస్టర్‌లోని గ్రామాలన్నింటిలోని గ్రూపుల రికార్డులను తనిఖీ చెయ్యాలన్నారు. అలాగే మిగిలిన క్లస్టర్ల పరిధిలోనూ ఓవర్‌ డ్యూ వచ్చిన ప్రతి గ్రూపు రికార్డునలు తనిఖీ చెయ్యాలని ఏజీఎం శ్యామలాదేవి, మేనేజరు దశరథరామ్‌, ఏపీఎం ప్రధాన రావులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని