logo

ఉన్నోళ్లతోనే.. లాగించేద్దాం!

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 47 ప్రభుత్వ హైస్కూళ్లలో ఆరంభించిన ఇంటర్‌ విద్య మొదటి ఏడాది పూర్తిగా విఫలమైంది. నిరుడు చేరిన విద్యార్థుల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

Published : 01 Jun 2023 05:36 IST

ఈసారీ హైస్కూళ్ల గురువులతోనే ఇంటర్‌ బోధన
గతేడాది దారుణ ఫలితాలొచ్చినా మారని వైఖరి
ఈనాడు, అమరావతి

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 47 ప్రభుత్వ హైస్కూళ్లలో ఆరంభించిన ఇంటర్‌ విద్య మొదటి ఏడాది పూర్తిగా విఫలమైంది. నిరుడు చేరిన విద్యార్థుల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. తరగతులు ఆలస్యంగా ఆరంభించడం, సౌకర్యాల లేమి, బోధన సిబ్బంది కొరతతో ఆశించిన ఫలితాలు రాలేదని సాకులు చెప్పారు. కనీసం ఈసారైనా.. పూర్తిస్థాయిలో ఇంటర్‌ విద్యకు సౌకర్యాలు, సిబ్బంది నియామకంపై దృష్టి పెడితే బాగుండేది. కానీ.. ఈసారి కూడా హైస్కూళ్ల ఉపాధ్యాయుల్లో కొందరిని ఎంపిక చేసి.. వారితో ఈ ఏడాది నెట్టుకొచ్చేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.’

గతేడాది హైస్కూళ్లలో ప్రవేశపెట్టిన ఇంటర్‌ విద్యలో రెండు జిల్లాల్లో కలిపి 341 మంది విద్యార్థులు చేరారు. వీరిలో కేవలం 42 మంది మాత్రమే సొంతంగా చదివి ఉత్తీర్ణులయ్యారు. హైస్కూళ్లలో పదో తరగతి వరకూ బోధించే స్కూల్‌ అసిస్టెంట్లనే బతిమాలి కొందరితో తరగతులు చెప్పించారు. ఈ మాత్రం దానికి.. అసలు హైస్కూళ్లలో ఇంటర్‌ విద్య ఎందుకు ప్రవేశపెట్టారని... తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వీటికంటే ఇప్పటికే ఉన్న ఇంటర్‌ ప్రభుత్వ కళాశాలలు వంద రెట్లు మెరుగ్గా ఉన్నాయి. ఇంటర్‌ విద్యకు అవసరమైన సౌకర్యాలు.. అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారు. అయినా.. ఇంటికి దగ్గరిలో కళాశాల విద్య కూడా వచ్చిందనే ఆనందంతో విద్యార్థులొచ్చి చేరారు. కానీ.. కనీసం తరగతులను సైతం సరిగా చెప్పకపోవడంతో అత్యధికశాతం మంది విద్యార్థులు పరీక్షలు తప్పారు.

ఉన్నోళ్లలోనే కొందరిని తీసుకొచ్చి...

ఈ ఏడాది రెండు జిల్లాల్లో ప్రభుత్వ, నగరపాలక, జడ్పీ పాఠశాలల్లోని 276 మంది వరకు ఉపాధ్యాయులు ముందుకొస్తే ఇంటర్‌ బోధనకు సరిపోతుందని అధికారుల అంచనా. ప్రస్తుతం బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మేథ్స్‌, సివిక్స్‌, కామర్స్‌, ఎకనామిక్స్‌, తెలుగు, ఇంగ్లీష్‌ బోధించే వాళ్లు కావాలి. కానీ.. ఇప్పటివరకూ పదో తరగతి వరకే బోధించే ఉపాధ్యాయులు.. ఇంటర్‌ పాఠ్యాంశాలను పూర్తిస్థాయిలో చెప్పగలరా అనేది సందేహమే. వీరికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. గతసారి కూడా చాలాచోట్ల వీళ్లే బోధించడంతో ఫలితాలు దారుణంగా వచ్చాయి.

ఇంటర్మీడియట్‌కు అప్‌గ్రేడ్‌ చేసిన సింగ్‌నగర్‌లోని ఎం.కె.బేగ్‌ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల


ఇప్పటికి మూడుసార్లు పిలిచారు..

ఈ ఏడాది బోధనా సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. బయట నుంచి ఇంటర్‌ విద్యకు అవసరమైన జూనియర్‌ లెక్చరర్లను నియమిస్తారని అంతా భావించారు. కానీ.. ఈసారి కూడా హైస్కూళ్లలో ఉపాధ్యాయుల్లోనే కొందరిని ఎంపిక చేసి నియమించే ప్రయత్నాలు చేస్తున్నారు. హైస్కూళ్లలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. పీజీలో 50 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లు ఎవరైనా ఆయా సబ్జెక్టుల్లో బీఈడీ కలిగి ఉండి ఆసక్తి ఉంటే ఇంటర్‌ బోధనకు రావాలని విద్యాశాఖ కోరింది. ఇప్పటికి మూడుసార్లు పిలిస్తే.. 242 మంది వచ్చారు. వీరిని ఆయా ఖాళీల్లో సర్దుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. దీంతో కనీసం ఒక్కో హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలకు కనీసం ఇద్దరు ముగ్గురినైనా నియమించాలని అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. విజయవాడ పరిధిలో రెండు నగరపాలక, ఒక ప్రభుత్వ కలిపి మూడు హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలున్నాయి. వీటిలో ఇంటర్‌ విద్య బోధించేందుకు ఇప్పటివరకూ ఒక్కరిని కూడా నియమించలేదని తెలుస్తోంది.


ఒక్క విద్యార్థి కూడా గట్టెక్కలేదు...

కృష్ణా జిల్లాలో 18, ఎన్టీఆర్‌లో 16 హైస్కూళ్లలో మాత్రమే ఇంటర్‌ విద్యలో 341 మంది చేరారు. వీరిలో కృష్ణాలో 221, ఎన్టీఆర్‌లో 120 మంది ఉన్నారు. కృష్ణాలోని ఘంటసాల, కోడూరు, బాపులపాడు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, అవనిగడ్డ, పెనమలూరు మండలాల్లోని పాఠశాలల్లో ఒక్కరు కూడా ఉత్తీర్ణులు కాలేదు. పెడన, గూడూరు, బంటుమిల్లి, గుడ్లవల్లేరు, పునాదిపాడుల్లో ఒక్కొక్కరు ఉత్తీర్ణులయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లాలోనూ కంచికచర్ల వంటిచోట్ల ఒక్కరు కూడా పాస్‌ కాలేదు.


ఈసారి ప్రాక్టికల్స్‌ కూడా ఉంటాయి..

గతసారి మొదటి ఏడాది చేరిన వాళ్లు ప్రస్తుతం రెండో ఏడాదికి వచ్చారు. వీరికి ఈ ఏడాది ప్రాక్టికల్స్‌ ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఇవి చాలా కీలకం. కానీ.. ప్రస్తుతం ఎక్కడా ప్రత్యేకంగా వీరికి అవసరమైన ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్న దాఖలాలు లేవు. దీంతో విద్యార్థుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని