వివాదమా..వాలిపోతారంతే!

అది.. జాతీయ రహదారికి సమీప స్థలం. విలువ... రూ.కోట్ల పైమాటే. అది ఎప్పుడో అనధికార లే ఔట్‌ వేసి.. అమ్మేశారు.

Updated : 03 Jun 2023 05:33 IST

రూ.కోట్ల విలువైన భూమిపై వైకాపా నేతల కన్ను
ఏకంగా శిబిరం ఏర్పాటు

వివాదాస్పద స్థలం

ఈనాడు, అమరావతి - మధురానగర్‌, న్యూస్‌టుడే: అది.. జాతీయ రహదారికి సమీప స్థలం. విలువ... రూ.కోట్ల పైమాటే. అది ఎప్పుడో అనధికార లే ఔట్‌ వేసి.. అమ్మేశారు. మొత్తం రెండు ఎకరాల విస్తీర్ణం. 25 మంది వరకు కొన్నారు. తాజాగా కొందరు భూమి తమదని శిబిరాలు ఏర్పాటు చేసి హంగామా సృష్టించారు. వీరికి కొందరు అధికార పార్టీ నాయకులు అండగా నిలిచారు. ఇరువర్గాలకు పూర్తి స్థాయి హక్కులు లేవని అంటున్నారు. ఈనేపథ్యంలో వివాదం రెవెన్యూ, పోలీసు శాఖల దృష్టికి వెళ్లగా ఇరువర్గాలకు 145 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఇరువర్గాలు స్థలంలోకి వెళ్లవద్దని ఆదేశించారు. దీనిపై ఈనెల 7, 8న ఎవరికి వారు ఆధారాలు సమర్పించాలని సూచించారు. మరోవైపు ఇరువర్గాలు వైకాపా ముఖ్య నేతను ఆశ్రయించారు. ఆప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నాయి. వివాదస్పద భూమిలో గజం రూ.20 వేలు ఉండగా.. ఏకంగా బోర్డుల ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది.
అంతరవలయ రహదారికి సమీపంలో గుణదల 1వ డివిజన్‌లో 2 ఎకరాల భూమి వివాదస్పదంగా మారింది. సర్వే నెంబరు 117/2సి, 117/2డి భూమి ఉంది. తమ పూర్వీకులకు చెందిందనీ.. పిన్నమనేని బాబ్జి, పిన్నమనేని రతీష్‌కు హక్కులు లేవని న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని సాతులూరి పరుశురామ్‌ అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఇటీవల కొందరు శిబిరం పెట్టి బైఠాయించటంతో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణలంకకు చెందిన అధికార పార్టీ నేత అనుచరులు ఉన్నారు. ఈ స్థలాలను గతంలోనే కొనుగోలు చేసిన వారు ఈ పరిస్థితిని చూసి లబోదిబో అంటున్నారు.


డీకేటీ పట్టాలు...

గుణదల 1వ డివిజన్‌లో సర్వే నెంబరు 117/2సి, 117/2డి లో సాతులూరి ఏసుదాసు, సాతులూరి యాకోబులకు 2 ఎకరాల స్థలం ఉంది. ఇవి డీకేటీ పట్టాలు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి. దీన్ని 1975లోనే విక్రయించారు. కొన్న వారు ఇళ్ల స్థలాలుగా విభజించి (అనధికార లే ఔట్‌) విక్రయించారు. ఎకరం విస్తీర్ణంలో 25 మంది హక్కుదారులు ఉన్నారు. పిన్నమనేని బాబ్జి, పిన్నమనేని రతీష్‌లు కొంత స్థలం తమ పేరుమీదే ఉంచుకున్నారు. ఇటీవల ఈ వివాదం తెరమీదకు వచ్చింది. పట్టాదారు పేరు ఏసుదాసు, యాకోబులు ఉండగా అనుభవదారులుగా బాబ్జీ, రతీష్‌ల పేర్లు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం... షరతుల పట్టాలను క్రమబద్ధీకరించి నిషేధ జాబితా నుంచి తొలగించడంతో వీరు ప్రయత్నాలు చేశారు. దీంతో ఇది వెలుగులోకి రావడంతో వారసులమని కొందరు రంగంలోకి దిగినట్లు తెలిసింది. పిన్నమనేని బాబ్జి, పిన్నమనేని రతీష్‌లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం వీరి పిటిషన్‌ను డిస్మిస్‌ చేయగా... తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. ఇంకా ఇన్‌జంక్షన్‌ ఆర్డరు రాలేదు. ఈలోగా.. అక్కడ శిబిరం పెట్టి హడావిడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.


145 సెక్షన్‌ కింద నోటీసులు...

ఈ వివాదస్పద స్థలం వద్ద ఇరువర్గాల తీరుతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేశారు. ఈనెల 7, 8న సింగ్‌నగర్‌ ఠాణాకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఎవరి వద్ద ఉన్న హక్కులు వారు చూపించాలని రెవెన్యూ, పోలీసులు అధికారుల సమక్షంలో పరిశీలిస్తామనీ.. ఇరువర్గాలు ఆ స్థలంలోకి ప్రవేశించకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన షరతుల గల పట్టాల భూములను కొంటే.. ఆ భూములను లింక్‌ డాక్యుమెంట్ల ద్వారా ఎవరు కొనుక్కున్నారో వారికే హక్కులు ఉంటాయనేది రెవెన్యూ అధికారుల మాట. ప్రభుత్వం కండిషనల్డ్‌ పట్టాలు రిలీజ్‌ చేయగా రీ సర్వే.. రీ సెటిల్‌మెంట్‌... రిజిస్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌)లో తమ పూర్వీకుల పేరు ఉండటంతో ఒకరు తమకు సదరు ఆస్తిపై హక్కు ఉందని వాదిస్తున్నారని రెవెన్యూ అధికారులు వివరించారు. వివాదానికి ఇదే కారణమని చెబుతున్నారు.


బెదిరింపులతో హడల్‌...

వారం కిందటే.. రాత్రికి రాత్రే 30 మంది అక్కడకు వచ్చి సదరు ఖాళీస్థలంలో షామియానాలు వేసి బైఠాయించారు. స్థలం కొన్న వారిని బెదిరించటంతో వారు అక్కడకు వెళ్లేందుకు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా అక్కడ కృష్ణలంక అధికార పార్టీ నాయకులు హడావిడి చేస్తుండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయమై వైకాపా నేతను ఇరువర్గాలు కలిసినట్లు తెలిసింది. స్థలాలు కొన్న 25 మంది లబ్ధిదారులు, తమ పూర్వీకుల స్థలం అని వాదిస్తున్న వారు కూడా కలవగా.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. అక్కడ ఉద్రిక్తతలు తొలగించాలని పోలీసులను కోరారనీ.. ఎవరి హక్కులు ఉంటే వారే న్యాయస్థానంలో తేల్చుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు.


నోటీసులు జారీ చేశాం

దీనిపై ఉత్తర మండల తహసీల్దారు దుర్గాప్రసాద్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా.. స్థలం వివాదాన్ని పరిశీలిస్తున్నామనీ... దీనిపై సెక్షన్‌ 145 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన వారికే పూర్తి హక్కులు ఉంటాయని చెప్పారు. దీనిపై పిన్నమనేని బాబ్జీ ‘ఈనాడు’తో మాట్లాడుతూ... ప్రస్తుతం న్యాయస్థానానికి సెలవులు కావడం వల్ల తమకు ఆదేశాలు అందలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని