logo

సీఎం జగన్‌ ఎగ్గొట్టిన హామీలు 85% : నెట్టెం

రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన పార్టీనీ చిత్తుగా ఎందుకు ఓడించాలో చెప్పడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు.

Published : 28 Mar 2024 05:44 IST

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే : రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన పార్టీనీ చిత్తుగా ఎందుకు ఓడించాలో చెప్పడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. బుధవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్‌ దాటకుండా పరిపాలన సాగించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని బస్సుయాత్ర పేరుతో ప్రజల ముందుకు రావడం సిగ్గుచేటని అన్నారు. జగన్‌ ఇచ్చిన హామీల జాబితాలో 85 శాతం ఎగ్గొట్టిన విషయం ప్రజలందరికీ తెలుసని, వారిని మభ్యపెట్టేందుకు నామమాత్రంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ఆ ముసుగులో లక్షల కోట్లు కొల్లగొట్టిన జగన్‌ దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. మద్య నిషేధం అమలు చేస్తానని, ఏకంగా దాని అమ్మకాలపై రుణం తెచ్చుకోవడమే కాక నాశిరకం మద్యంతో లక్షల మంది ఆరోగ్యాలు కొల్లగొట్టారని, వేలమంది ప్రాణాలు బలిగొన్నారని మండిపడ్డారు. విద్యార్థులకు, అంగన్‌వాడీ సిబ్బందికి మొండిచేయి చూపడమే కాక, అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే కాక ఏకంగా సచివాలయం తాకట్టు పెట్టి సొమ్ములు కాజేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని, ఎన్నికల ప్రచారంలో ఆయన వీటన్నిటికీ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో గింజుపల్లి రమేష్‌, తాళ్లూరి వెంకటేశ్వర్లు, కన్నెబోయిన రామలక్ష్మి, కారుపాటి డేవిడ్‌, గుంజావెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని