logo

నిశిత తనిఖీలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

Published : 29 Mar 2024 04:08 IST

ఒకే రోజు రూ.3.07 లక్షల నగదు పట్టివేత
విజయవాడ నేరవార్తలు, విద్యాధరపురం, న్యూస్‌టుడే

ప్రకాశం బ్యారేజీ వద్ద సిబ్బందికి సూచనలు ఇస్తున్న డీసీపీ టి.హరికృష్ణ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్క గురువారం రోజున ఎన్టీఆర్‌ కమిషనరేట్‌ పరిధిలోని రెండు చెక్‌పోస్టుల్లో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.3.07 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గుంటుపల్లిలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.2లక్షలు, ప్రకాశం బ్యారేజీ వద్ద మరో వ్యక్తి నుంచి రూ.1.07 లక్షలు పట్టుబడ్డాయి. పశ్చిమ జోన్‌ డీసీపీ టి.హరికృష్ణ నేతృత్వంలో గురువారం రాత్రి నగరంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ వద్ద.. చెక్‌పోస్టు సిబ్బంది పనితీరును పరిశీలించారు. పోలీసు అధికారులు, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీంతో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

సీసీ కెమెరాలతో రికార్డింగ్‌..

చెక్‌పోస్టుల వద్ద తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. తనిఖీల కార్యక్రమాన్ని మొత్తాన్ని సీసీ కెమెరాలతో రికార్డు చేస్తున్నారు. దాన్ని ఎన్నికల కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానం చేశారు. ఫలితంగా ఏ విధమైన అవకతవకలకు అవకాశం ఉండదని, సిబ్బందిలో జవాబుదారీతనం మరింత పెరుగుతుందన్నారు.

రెండు కొత్త చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు

నగర పరిధిలో నిరంతర పరిశీలన అనంతరం ఎన్టీఆర్‌ కమిషనరేట్‌ పరిధిలో మరో కొత్త చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించారు. నున్న పవర్‌ గ్రిడ్‌ వద్ద, కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాములకాలువ వద్ద చెక్‌పోస్టులు అత్యవసరమని గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల్లో.. కేంద్రబలగాలతో నిఘా ఉంచారు.

నగదు రవాణాలో జాగ్రత్తలు తప్పనిసరి

ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ రూ.50వేల వరకు మాత్రమే నగదు తీసుకువెళ్లవచ్చు. చాలా మంది ఆ విషయం తెలియక ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకువెళుతూ పట్టుబడుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ.50వేల కన్నా ఎక్కువ నగదు ఉంటే దాన్ని స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగిస్తామని డీసీపీ హరికృష్ణ తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.


బంగారం.. నగదు స్వాధీనం

గుంటుపల్లిలో స్వాధీనం చేసుకున్న నగదుతో పోలీసులు

కృష్ణలంక, న్యూస్‌టుడే: గుంటూరు వైపు నుంచి వచ్చే కనకదుర్గమ్మ వారధి చెక్‌పోస్ట్‌ వద్ద గురువారం చేపట్టిన సోదాల్లో పోలీసులు బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. కారును ఆపి సోదాలు నిర్వహించగా.. అందులో సుమారు 500 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.70 వేల నగదు ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన రూడా అఖిల్‌.. నరసరావుపేట నుంచి హైదరాబాద్‌కు ఆభరణాలు తీసుకెళుతున్నట్లు చెప్పారు. సరైన ఆధారాలు లేనందున ఆభరణాలు, నగదు మొత్తం స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని