logo

1నే జీతాలివ్వండి మహాప్రభో!

తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. 

Updated : 18 Apr 2024 05:49 IST

వైకాపా పాలనపై ఉపాధ్యాయులు, ఉద్యోగుల అసహనం

న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్‌: తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.  ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సి ఉండగా 15వతేదీకి కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛను దారులు ఉంటే జిల్లాలో లక్షమందికి పైగా ఉన్నారు. ఉద్యోగుల జీతాలతోపాటు విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు కూడా సకాలంలో అందక అవస్థలు పడుతున్నారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఎన్ని నెలలకు జీతాలు ఇస్తారో కూడా తెలియని దుస్థితి దాపురించింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హామీల వర్షం కురిపించిన జగన్‌ సీఎం అయిన తరువాత వాటి గురించి పట్టించుకోలేదని అదేంటని ప్రశ్నించిన వారిని అరెస్టులు చేయించడం, భయపెడుతూ అణచివేతకు గురిచేశారని ఉద్యోగ వర్గాలు విమర్శిస్తున్నాయి.

ఉద్యోగుల సమస్యలపై చేపట్టిన ధర్నాలో పాల్గొన్న సంఘ నాయకులు, ఉద్యోగులు


వడ్డీ కట్టాల్సి వస్తోంది

ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వండి అంటూ మొరపెట్టుకున్న దాఖలాలు గతంలో చూడలేదు. ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతాలు 7వ తేదీ, 10వతేదీ ఇలా వారం పదిరోజులు ఆలస్యంగా అయినా ఇస్తున్నాం కదా అని పాలకులు మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. ఆ జీతంపై ఆధారపడే ప్రతి నెల ఒకటో తేదీన ఈఎంఐలు కట్టకపోతే వడ్డీలు వేస్తున్నారు. అవి కట్టడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు సక్రమంగా ఇవ్వడంతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఇవ్వాల్సిన రూ. వేల కోట్ల బకాయిలు తక్షణం విడుదల చేయాలని కోరుతున్నాం.

కేఏ. ఉమామహేశ్వరరావు, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి


రోడ్డెకాల్సి వచ్చింది

ఉద్యోగుల జీతాలే కాదు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు కూడా సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వృద్ధాప్యంలో వచ్చే పింఛనుతోనే వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు తీర్చుకుంటూ జీవనం సాగించే వృద్ధులు సైతం తమ డిమాండ్ల సాధనలో భాగంగా ధర్నాలు చేయాల్సి వచ్చింది. ఇంకా అనేక సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. అవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో తెలియని పరిస్థితి.

గుడివాడ రామస్వామి, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘ నాయకుడు


ఎప్పుడూ ఇలా జరగలేదు  

ప్రస్తుత ప్రభుత్వం హయాంలో గత కొన్నేళ్లుగా చూస్తే ఏ నెలా ఉద్యోగులు ఒకటో తేదీన జీతాలు తీసుకున్న దాఖలాలు లేవు. పింఛనుదారుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. బాండ్‌లు తాకట్టుపెట్టి అప్పుతెచ్చి జీతాలు ఇస్తున్నారు. ఉద్యోగ విరమణ తరువాత వచ్చే ప్రోత్సాహకాల కోసం నెలల తరబడి  ఎదురు చూడాల్సి దుస్థితి దాపురించింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బకాయిలు విడుదల చేయాలి.

పైడిపాటి రామ్‌దేవ్‌, యూటీఎఫ్‌ పూర్వ జిల్లా అధ్యక్షుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు