logo

ఎన్నికల నిర్వహణకు సహకరించండి: కలెక్టర్‌

జిల్లాలో ప్రశాంతంగా, సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు.

Published : 01 May 2024 05:22 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ బాలాజీ, వేదికపై ఎస్పీ, జిల్లా ఎన్నికల పరిశీలకులు
కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాలో ప్రశాంతంగా, సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఎస్పీ నయీమ్‌ అస్మి, జిల్లాకు నియమితులైన ఎన్నికల పరిశీలకులతో కలిసి పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులను అభ్యర్థులకు పరిచయం చేశారు.

పోస్టల్‌బ్యాలట్‌కు ఫెసిలిటేషన్‌ కేంద్రాలు

 పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునేందుకు ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు మే 4న, ఓపీఓలకు మే 5న, పోలీస్‌ పర్సనల్‌, ఎసెన్షియల్‌ సర్వీసెస్‌, డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు మే 6న తమ పోస్టల్‌ ఓటింగ్‌ కోసం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. ఆయా తేదీల్లో పోస్టల్‌ ఓటింగ్‌ను వినియోగించుకోలేని వారి కోసం 7, 8 తేదీల్లోనూ కేంద్రాలు కొనసాగుతాయన్నారు.  85 సంవత్సరాలు నిండిన వృద్ధులు, దివ్యాంగులకు హోమ్‌ ఓటింగ్‌ కోసం ఈనెల 2 నుంచి 8వ తేదీ మధ్య, మిగిలిపోయిన వారికోసం 9, 10 తేదీల్లో ఇళ్లవద్దకే వచ్చి ఓటింగ్‌ నిర్వహిస్తాయన్నారు.

 జిల్లాలో 15.39 లక్షల ఓటర్లు

ఏప్రిల్‌ 25 నాటికి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,39,460గా ఉందని కలెక్టర్‌ తెలిపారు.  ఎస్పీ నయీమ్‌ అస్మి మాట్లాడుతూ జిల్లా శాంతిభద్రతల నిర్వహణ కోసం తీసుకున్న చర్యల గురించి వివరించారు.

72 గంటల ముందు ప్రచారాలు నిలిపివేయాలి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా పోలింగ్‌కు 72 గంటల ముందు అంటే ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాజకీయ పార్టీలు ప్రచారాలకు సంబంధించి ప్రచారబల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ మెసేజ్‌లు నిలుపుదల చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ చెప్పారు. కలెక్టరేట్‌లో మంగళవారం వివిధ నెట్‌వర్క్‌ల సర్వీస్‌ ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని