logo

గుడివాడ కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్‌

ఐపీఎల్‌లో జరిగే బెట్టింగ్‌ తీరుతెన్నులు ఇది. ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొడితే పందెం కాసిన బెట్టింగ్‌రాయుళ్లకు డబ్బులు చెల్లించాలి. అదే కొట్టలేకపోతే బెట్టింగ్‌ రాయుళ్లు కట్టిన సొమ్ము బుకీలకు పంపాలి.

Published : 01 May 2024 05:25 IST

 వైకాపా నేతలే మధ్యవర్తులు

రూ.లక్షల్లో మోసపోతున్న అమాయకులు

‘ఈ ఓవర్‌లో 2 సిక్స్‌లు పడతాయి’

 ‘వచ్చే బాల్‌ సిక్స్‌ కొడతారు...

 రూ.50 వేలు బెట్టింగ్‌..’
‘ఈ ఓవర్‌లో వికెట్‌ పడుతుంది...’

న్యూస్‌టుడే, విజయవాడ నేరవార్తలు: ఐపీఎల్‌లో జరిగే బెట్టింగ్‌ తీరుతెన్నులు ఇది. ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొడితే పందెం కాసిన బెట్టింగ్‌రాయుళ్లకు డబ్బులు చెల్లించాలి. అదే కొట్టలేకపోతే బెట్టింగ్‌ రాయుళ్లు కట్టిన సొమ్ము బుకీలకు పంపాలి. వీరిద్దరి మధ్యన బోర్డు ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ బ్రోకర్లు కమీషన్‌ తీసుకుంటారు. బుకీలకు, బెట్టింగ్‌ రాయుళ్ల మధ్య... బ్రోకర్లుగా బోర్డు నిర్వహించే వారు అమాయకులను నిలువునా మోసం చేసి రూ.కోట్లు కొట్టేస్తున్నారు. బుకీలకు బెట్టింగ్‌ చెప్పకుండా ఒక్కోసారి నిలిపివేసి బెట్టింగ్‌ ఓడిపోయిన వారి నుంచి డబ్బులు గుంజేస్తున్నారు. ఒక వేళ బెట్టింగ్‌ రాయుళ్లు గెలిస్తే.. బుకీలకు సమాచారం అందలేదని, నేను మీ డీల్‌ను ఇంకా అంగీకరించలేదుగా అంటూ అడ్డంగా బుకాయిస్తూ.. డబ్బులు ఎగ్గొడుతున్నారు. ప్రధానంగా బాల్‌ బాల్‌కి జరిగే బెట్టింగ్‌ల్లో ఇలాంటి మోసాలు జరిగిపోతున్నాయి. గుడివాడ కేంద్రంగా జరుగుతున్న ఈ తరహా దందాను గుడివాడ తెదేపా సోషల్‌ మీడియా మంగళవారం విడుదల చేసింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అత్యంత సన్నిహితుడిగా ఉండే ఒక వ్యక్తి చేసే దందా వెలుగులోకి రావడం కలకలం రేగింది.

గుడివాడకు చెందిన ఐ ప్యాక్‌ బృందంలోని వినోద్‌ అనే సభ్యుడు దీనికి ప్రధాన సూత్రధారి అని తెదేపా విడుదల చేసిన సోషల్‌ మీడియాలో ఉంది. ఎమ్మెల్యే కొడాలి నాని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మధ్యన ఉన్న ఈ వ్యక్తిదే వాయిస్‌ అంటూ తెదేపా సోషల్‌ మీడియా రెండు ఫొటోలు విడుదల చేసింది. బెట్టింగ్‌ కట్టిన ఓ వ్యక్తికి డబ్బులు రాకపోవడంతో అతను ప్రశ్నించగా.. మీ డీల్‌ను నేను ఇంకా అంగీకరించలేదుగా అంటూ వినోద్‌ బుకాయించటం వినిపించింది. ఎమ్మెల్యే అనుచరులు ఏ విధంగా బెట్టింగ్‌ దందా నిర్వహిస్తున్నారో.. ఈ వాయిస్‌ స్పష్టం చేస్తోందని తెదేపా పేర్కొంటోంది.

కొడాలి అనుచరులే...

గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనుచరులు బెట్టింగ్‌ దందా నిర్వహిస్తున్నారని సర్వత్రా వినిపిస్తోంది. గుడివాడతో పాటు కైకలూరు, ఏలూరు కేంద్రాలుగా ఈ బెట్టింగ్‌ దందా నిర్వహిస్తున్నారు. యువత, మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని.. బ్రోకర్లు బరి తెగిస్తున్నారు. గెలిచిన వారికి డబ్బు ఇవ్వకుండా బెదిరించి బెట్టింగ్‌కు డీల్‌ కుదరలేదంటూ బెదిరిస్తున్నారు. బెట్టింగ్‌ కట్టి ఓడిపోతే.. వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా అమాయకుల నుంచి రూ.కోట్లు గుంజేస్తున్నారని, యువతను బెట్టింగ్‌కు బానిసగా మార్చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్‌ ముఠా వివరాలు తెలిసినా ఎవరికీ చెప్పుకోలేక.. చెబితే ఏమవుతుందో అనుకుంటూ వణికిపోతున్నారు. పోలీసులకు సమాచారం తెలిసినా.. చూసీ చూడనట్లు పోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ బెట్టింగ్‌ మహమ్మారికి ఎప్పుడు బ్రేక్‌ పడుతుందో అంటూ.. ఎదురు చూస్తున్నారు.


లింగ నిర్ధారణ  పరీక్షలు నిర్వహిస్తే చర్యలు

కానూరు: లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యఅధికారిణి డాక్టర్‌ గీతాబాయి హెచ్చరించారు. మంగళవారం కానూరులోని టాప్‌స్టార్‌, శృతి ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో అనుమతులు లేని ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, లాబరేటరీలు, పరీక్షాకేంద్రాలు గుర్తించినట్లయితే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని