logo

పేదలకు పాట్లు.. వైకాపా నాయకులకు రూ.కోట్లు

గుడివాడలో ఐదేళ్ల జగన్‌ ప్రభుత్వ పథకాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కానీ.. ఎమ్మెల్యే నాని అండతో అతని అనుచరులు మాత్రం భారీగానే ఆర్జించారు.

Published : 01 May 2024 05:29 IST

జగనన్న కాలనీల పేరుతో ఎమ్మెల్యే నానీ అనుచరుల అరాచకం

ప్రభుత్వానికి అధిక ధరకు భూముల విక్రయాలు

 రైతులకు సగమే ఇచ్చి.. మిగతాది నొక్కేశారు 

ఈనాడు, అమరావతి: గుడివాడలో ఐదేళ్ల జగన్‌ ప్రభుత్వ పథకాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కానీ.. ఎమ్మెల్యే నాని అండతో అతని అనుచరులు మాత్రం భారీగానే ఆర్జించారు. పేదలకు స్థలాలిస్తామంటూ జగనన్న కాలనీ పేరుతో మల్లాయపాలెంలో సుమారు 77 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇక్కడ మార్కెట్‌ ధర ఎకరా రూ.25 లక్షల వరకు ఉంటే.. రూ.52 లక్షలు పెట్టి ప్రభుత్వంతో కొనిపించారు. రైతులకు భారీగా లబ్ధి చేకూర్చామంటూ.. ఊదరగొట్టారు. కానీ.. తెరవెనుక మాత్రం భారీగా దండుకున్నారు. ముందే రైతులతో లోపాయికారీగా.. ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు ఇస్తామని చెప్పి, మిగతాది తమకు ఇచ్చేయాలంటూ.. వైకాపాలోని కొందరు కీలక నాయకులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. అనుకున్నట్లే.. ప్రభుత్వం నుంచి విడుదల చేసిన డబ్బులు రైతుల ఖాతాల్లో పడగానే..తమకు రావాల్సిన ఎకరాకు రూ.20లక్షలకుపైగా సొమ్ము దండుకున్నట్టు తెలిసింది. ఇలా 77 ఎకరాలకు కలిపి.. దాదాపు రూ.15కోట్లకు పైగా రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. పొలాలు అమ్ముకున్న తమకంటే.. వీళ్లు దోచుకుతిన్నదే ఎక్కువని రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారిప్పుడు.

ప్రైవేటు వెంచర్లకూ మట్టి అమ్ముకొని..

గంగాధరపురంలో వైకాపా నాయకులు మట్టి అమ్ముకున్న చెరువు

గుడివాడ నియోజకవర్గం పరిధి గ్రామాల్లోని చెరువులు, కాలవల్లో మట్టిని విచ్చలవిడిగా తవ్వుతూ ఐదేళ్లలో రూ.కోట్లు కొల్లగొట్టారు. టన్నుల కొద్ది అధిక లోడుతో ట్రిప్పర్లు మట్టితో వస్తుండడంతో రహదారులు ధ్వంసమవుతున్నాయని స్థానికులు గగ్గోలు పెట్టినా.. కనీసం అటువైపు కన్నెత్తి చూసే సాహసం కూడా అధికారులు చేయలేదు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలుండడం, అతని కీలక అనుచరులే అన్నీ తామై.. ఈ దందాను నడపడంతో.. అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. నందివాడ, గుడివాడ మండలాల్లో విచ్చలవిడిగా తవ్వకాలు జరిగినా.. రెవెన్యూ, మైనింగ్‌ సహా ఏ అధికారులూ పట్టించుకోలేదు.  హనుమాన్‌జంక్షన్‌ సహా పలు ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి మట్టిని తరలించి అమ్ముకున్నారు. ఒక్కో టిప్పర్‌ మట్టి నందివాడ మండలంలో రూ.10 వేలు, బయటకు వెళ్తే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకూ అమ్ముకున్నారు.

మెరక పేరుతో భారీగా మేసేశారు..

జగనన్న కాలనీ కోసం తీసుకున్న పొలాలను మెరక చేస్తామంటూ.. వైకాపా నాయకులు రూ.కోట్లలో దండుకున్నారు. మల్లాయపాలెం గ్రామంలోని టిడ్కో ఇళ్లకు సమీపంలోనే రైతుల నుంచి సేకరించిన ఈ 77 ఎకరాలను మెరక చేసి 7007 ప్లాట్లుగా మార్చేందుకు  రూ.12 కోట్ల ప్రభుత్వ నిధులతో అంచనాలు రూపొందించారు. సగం పనులు తర్వాత నిధులు చాలవంటూ.. మరో రూ.12 కోట్లకు అంచనాలు పెంచారు. మొత్తం రూ.24 కోట్లతో చేపట్టిన మెరక పనులు కూడా మమ అనిపించారు. గుడివాడ మండలంలోని పలు గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా పంచాయతీ చెరువులు, పంట బోదెలు, కాల్వలు, ప్రభుత్వ స్థలాల్లోని మట్టిని విచ్చలవిడిగా తవ్వుకొచ్చి జగనన్న కాలనీలో పోసేసి మెరక చేశారు.

చెరువులు, పొలాలు గుల్ల చేశారు..

  • గుడివాడ మండలంలోని బొమ్ములూరు శివారు గంగాధరపురంలో ఏడు ఎకరాల చెరువును గ్రామస్థులు స్నానాలు చేయడానికి వినియోగించేవారు. ఈ చెరువును ఎమ్మెల్యే అనుచరులైన కొందరు వైకాపా నాయకులు తమ అధీనంలోకి తీసుకొని విచ్చలవిడిగా మట్టిని తవ్వి తరలించారు. ఇదేంటని గ్రామస్థులు ప్రశ్నిస్తే.. జగనన్న కాలనీ కోసం అంటూ చెప్పారు. కానీ.. యథేచ్ఛగా మట్టి తవ్వేసి.. ప్రైవేటు లేఔట్లను మెరక చేసేందుకు తరలించారు.
  • మోటూరులో ఎలాంటి అనుమతులు లేకుండా ఓ వైకాపా నాయకుడు చెరువును తవ్వి మట్టి తరలిస్తుంటే.. ఆపేందుకు వెళ్లిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై పొక్లెయిన్‌తో నెట్టేసి దాడి చేశాడు.
  • మరో వైకాపా నాయకుడు వలివర్తిపాడు శివారున పొలాల్లోని మట్టిని తవ్వేసి అమ్ముకున్నాడు. తవ్వకాలు ఆపేందుకు వెళ్లిన వీఆర్‌వోపై ఎమ్మెల్యే నాని అండతో బదిలీ వేటు వేశారు.
  • శేరీదింటకుర్రు పంచాయతీ చెరువును కూడా తవ్వేసి.. మట్టిని తరలించుకుపోయారు.
  • ఎవరైనా మట్టి ఎక్కడికని నిలదీస్తే.. జగనన్న కాలనీలకంటూ.. గొడవకు దిగేవారు. మరీ అడ్డగోలుగా మట్టిని గ్రామం నుంచి తరలిస్తుండగా.. గ్రామస్థులంతా కలిసి చాలాసార్లు అడ్డుకున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని