logo

వైకాపా వ్యతిరేక ఓటును ఆపే కుట్ర?

ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగం తొలి రోజైన శనివారం ప్రహసనంగా మారింది.

Updated : 05 May 2024 11:03 IST

ఉద్యోగులను ముప్పుతిప్పలు పెట్టిన వైనం

పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగంలో అవాంతరాలు

ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో తికమక, గందరగోళం

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌: ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగం తొలి రోజైన శనివారం ప్రహసనంగా మారింది. విజయవాడలో పలు ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు వెళ్లిన ఉద్యోగులు కొందరు.. తమ ఓటు హక్కును వినియోగించుకోలేక, వెనుదిరగాల్సి వచ్చింది. ఆయా నియోజకవర్గాల పోస్టల్‌ బ్యాలట్లు రాలేదని చెప్పడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పీవోలు, ఏపీవోలకు ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు నిర్వహించడం, తర్వాత ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం వల్ల ఇక్కట్లకు గురయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటు హక్కు వినియోగించే అవకాశం లేకపోయిందని ఉద్యోగులు వాపోయారు ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఉద్యోగులకు అక్కడే పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేసినా, ఎవరూ పట్టించుకోలేదని, ఎన్నికల విధులు నిర్వర్తించే చోటే.. పోస్టల్‌ బ్యాలట్‌ను వినియోగించే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఏ ఉద్యోగి ఎక్కడ పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకోవాలనే విషయంలో జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. తొలి రోజు 20 శాతం మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోలేక వెనుదిరిగారని చెబుతున్నారు. ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉన్నారని, వ్యతిరేక ఓటును నిలుపుదల చేయడానికి ఇలాంటి గందరగోళ పరిస్థితులకు తెరలేపినట్లు పలువురు ఉద్యోగులు అంటున్నారు.

ఇదేం చోద్యం..

  • విజయవాడ సెంట్రల్‌లో ఓటు హక్కు ఉన్న ఒక ఉద్యోగి.. పామర్రులో పని చేస్తున్నారు. ఈయనకు గన్నవరం లో ఎన్నికల విధులు వేశారు. తీరా ఫెసిలిటేషన్‌ కేంద్రం ఎక్కడో తెలపలేదు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో కేంద్రీకృత ఫెసిలిటేషన్‌ కేంద్రానికి రావాలా? సెంట్రల్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రానికి వెళ్లాలా అనేది తెలియదు. తీరా నగరంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో సెంట్రల్‌ నియోజకవర్గ ఫెసిలిటేషన్‌ కేంద్రానికి వెళితే.. పామర్రు నుంచి పోస్టల్‌ బ్యాలట్‌ రాలేదని తెలిపారు. వివరాలు తెలుసుకోవడానికి పామర్రు లేదా బందరు వెళ్లాలని సూచించారు. దీంతో ఆయన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు.
  • మరో ఇద్దరు మహిళా ఉద్యోగులు తమ ఓటు కోసం విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాలకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడకు వెళితే ఇక్కడకు, ఇక్కడకు వెళితే అక్కడకు వెళ్లాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని వాపోయారు.
  • ముఖ్యంగా పీబీ సిద్ధార్థ కళాశాలలోని విజయవాడ సెంట్రల్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఉద్యోగుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. పలువురు మహిళా ఉద్యోగులు గట్టిగా ప్రతిఘటిస్తే గాని, ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు.
  • నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులకు విజయవాడలో ఎన్నికల విధులు కేటాయించారు. తీరా వీరు శిక్షణ కోసం వచ్చిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తే.. ఆయా నియోజకవర్గాల నుంచి పోస్టల్‌ బ్యాలట్‌లు రాలేదని సమాధానం వచ్చింది. సరైన ముందస్తు సమాచారం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని చాలా మంది ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
  • కొంత మంది ఉద్యోగులకు తాజాగా విధులు కేటాయించారు. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు ప్రారంభమయ్యే తేదీకి ఒక రోజు ముందు విధులు కేటాయించారు. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగానికి ఫారం-12 దాఖలు తప్పనిసరి. ఈ విషయమై ప్రశ్నిస్తే.. ఆర్వోల వద్దకు వెళ్లండని సలహా ఇచ్చారని, అక్కడకు వెళ్లినా ప్రయోజనం శూన్యం అంటూ పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
  • ఫారం-12 దాఖలుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగంలో తొలి రోజు గందరగోళం నేపథ్యంలో గడువు పొడిగించాలని ఉద్యోగులు కోరుతున్నారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని