logo
Updated : 05/09/2021 11:02 IST

గుంటూరు నీళ్లల్లో.. సిలికా..!

నీటి నాణ్యత పరీక్షలతో బహిర్గతం

దీర్ఘకాలం తాగితే అవయవాలు దెబ్బతినే ప్రమాదం

ఈనాడు-గుంటూరు

పరీక్ష చేయగా పచ్చగా మారిన నీళ్లు

గుంటూరు నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న నీళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు లక్ష్మీపురం, పట్టాభిపురంలోని రెండు రిజర్వాయర్ల నుంచి నీళ్లను పట్టుకెళ్లి పరీక్ష చేయించగా 31 నుంచి 34 మధ్య పార్ట్సు ఫర్‌ మిలియన్‌(పీపీఎం) ఇసుక రేణువులు బయటపడ్డాయి. నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీం్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(నాగపూర్‌) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఆ నీళ్లను పరీక్షించి చూడగా బయటపడిన వాస్తవమిది.. లీటరు నీళ్లలో సిలికా ఎంత ఉందో తెలుసుకోవటానికి ఆయా రసాయనాలు వేసి చూడగా నీళ్లు పచ్చగా మారిపోయాయి. కొందరు మున్సిపల్‌ నీటిని ఫ్యూరిఫైడ్‌ చేసే మిషన్లతో శుద్ధి చేసి తాగుతున్నారు. కొరిటిపాడు, పట్టాభిపురంలో రెండు ఇళ్లల్లో వినియోగిస్తున్న ఫ్యూరిఫైడ్‌ వాటర్‌ పట్టుకెళ్లి పరీక్షలు చేయించగా వాటిల్లో ఒకటి నుంచి 4 పీపీఎం మాత్రమే ఇసుక రేణువులు ఉన్నాయి. మున్సిపల్‌ వాటర్‌తో పోలిస్తే ఫ్యూరిఫైడ్‌ వాటర్‌లో అవి చాలా తక్కువమొత్తంలో ఉన్నాయి.

ఆ పరీక్షలే చేయడం లేదు?

నగరంలో మూడింట రెండొతుల మందికి పైగా జనాభా మున్సిపల్‌ నీళ్లనే తాగుతోంది. అలాంటప్పుడు నగరపాలక ప్రజలకు అందించే తాగునీరు విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే. వర్షాకాలంలో నీళ్లు బాగా కలుషితమయ్యే అవకాశం ఉంది. దీంతో తరచుగా నీటి పరీక్షలు చేయిస్తూ ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లను సరఫరా చేయాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. వచ్చేవి కృష్ణా నది నీళ్లు కాబట్టి స్వచ్ఛంగానే ఉంటాయనే భ్రమలో యంత్రాంగం ఉంది. నీళ్లల్లో ఆమ్లం, క్షారత్వం శాతాలు, బురద, మట్టి ఏమైనా ఉందా? ఇతర లవణాలు ఉన్నాయా అనే కోణంలో నాలుగైదు పరీక్షలు మాత్రమే చేయిస్తోంది. కీలకమైన సిలికా పరీక్షను విస్మరించింది.

నగరపాలకసంస్థ నీటి నాణ్యత పరీక్షలను గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ ప్రయోగశాలలో చేయిస్తోంది. అక్కడ కెమికల్‌, బ్యాక్టీరియా పరీక్షల నిర్వహణకు మాత్రమే అవకాశం ఉంది. ఆ ల్యాబ్‌లో ఉండే ఎనలిస్టులు, శాంఫిల్‌ కలెక్షన్‌ టేకర్లు సైతం నగరపాలక సరఫరా చేస్తున్న నీళ్లలో సిలికా ఉందా అనే కోణంలో హైదారబాద్‌కు పంపి పరీక్ష చేయించిన దాఖలాలు లేవు. ఏడాది క్రితమే పట్టాభిపురంలో ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌ ఏర్పాటైంది. అక్కడ అన్ని రకాల నీటి పరీక్షలు చేస్తారు. కనీసం దాన్ని వినియోగించుకోలేదు. కృష్ణానది నుంచి వచ్చే నీళ్లుకావటంతో సాధారణంగా పీహెచ్‌, టర్బిడిటీ, హార్టునెస్‌, ఎలక్ట్రిక్‌ కండక్టవిటీ పరీక్షలు చేయిస్తున్నామని నగరపాలక పర్యవేక్షక ఇంజినీరు దాసరి శ్రీనివాసులు తెలిపారు. ఇకపై సిలికా పరీక్షలు చేయిస్తామన్నారు..


లక్ష్మీపురం రిజర్వాయర్‌ నుంచి సరఫరా అవుతున్న నీళ్లలో సిలికా ఉందని నిర్ధారించే నివేదిక

కారణాలు ఇవే...

* నీళ్లలో ఆలం నిర్దేశిత మోతాదులో కలపాలి. అది లోపించినా సిలికా వస్తుంది.

* రిజర్వాయర్లను తరచూ శుభ్రపరచాలి. వారానికి ఒకసారి అడుగుభాగంలో చుక్క లేకుండా వదలాలి.

* నీటి సరఫరా కాల్వల్లో ఎరువులు-పురుగుమందులు కలిసి ప్రవహించినా సిలికా వస్తుంది.● ఇళ్లల్లో ఆర్వో సిస్టమ్‌ ఫిల్టర్లు, బ్రెష్‌లను తరచూ మారుస్తూ ఉండాలి.

భారత ప్రమాణాల సంస్థ(బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌: బీఐఎస్‌) లెక్కల ప్రకారం తాగే నీళ్లలో ఇసుక రేణువులు (సిలికా) అనేవి అసలు ఉండకూడదు. గుంటూరు నగరపాలకసంస్థ సరఫరా చేస్తున్న నీళ్లలో సిలికా ఉంటోంది. ఇసుక రేణువులతో కూడిన నీళ్లను దీర్ఘకాలంగా తాగితే శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం పడుతుంది.

రోజువారీ నీళ్ల వినియోగం 125 మిలియన్‌ గ్యాలన్లు

నగర జనాభా 10 లక్షలు

నగరపాలక చేయిస్తున్న పరీక్షలు: పీహెచ్‌, టర్బిడిటీ, ఫ్లోరైడ్‌, హార్డునెస్‌, ఎలక్ట్రిక్‌ కండక్టవిటీ

నిత్యం ప్రతి రిజర్వాయర్‌ వద్ద క్లోరిన్‌ శాతం తెలుసుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి.


శ్రద్ధ అవసరం

సిలికా లేని నీళ్లు తాగటం ఉత్తమం. ఇది ఉందని తెలిస్తే వెంటనే దాని నివారణకు చర్యలు తీసుకోవాలి. దీర్ఘకాలంగా ఈ నీళ్లు తాగితే శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి.

-ఆచార్య ఆర్‌.నాగేశ్వరరావు, సామాజిక వ్యాధుల విభాగాధిపతి, గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని