Dharmapuri Arvind: పక్కా ప్రణాళిక ప్రకారమే నాపై దాడి: ఎంపీ ధర్మపురి అర్వింద్
హైదరాబాద్: పక్కా ప్రణాళిక ప్రకారమే మంగళవారం తనపై దాడి జరిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తనపై దాడిని ప్రగతిభవన్ వేదికగా మంత్రి కేటీఆర్ పర్యవేక్షించారని ఆయన ఆరోపించారు. రైతులెవరూ తనపై దాడి చేయలేదని.. వారికి అటువంటి మనస్తత్వం ఉండదన్నారు. హైదరాబాద్ భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అర్వింద్ మాట్లాడారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సుమారు 25 మంది.. స్థానికంగా ఉన్న కొంతమంది తెరాస నేతలతో కలిసి తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
రాము అనే వ్యక్తి తనపై దాడి చేశాడని.. దాడి జరిగిన సమయంలో ఏ ఒక్క పోలీసు అధికారి కూడా తనను రక్షించే ప్రయత్నం చేయలేదని అర్వింద్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో రాము దిగిన ఫొటోలను మీడియా ముందు ఆయన ప్రదర్శించారు. తనపై జరిగిన దాడి విషయమై నిజామాబాద్ సీపీ, ఏసీపీకి ఫిర్యాదు చేసినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రివిలేజ్ కమిటీ, తెలంగాణ హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.