logo

రూ.5 కే కడుపు నిండా భోజనం

 ప్రస్తుతం మార్కెట్లో ఏ వస్తువు ధర చూసినా మండిపోతున్న తరుణంలో రూ.5కే కడుపు నిండా రుచికరమైన భోజనం పెట్టడం సాధ్యమా..? ఎవ్వరిని అడిగినా కచ్చితంగా సాధ్యం కాదనే అంటారు. ఒకవేళ ఇంత తక్కువ ధరతో భోజనం పెట్టడానికి ముందుకు వచ్చినా, ఈ సేవ కొనసాగించడా

Published : 22 Jan 2022 04:25 IST

అనంత నగరంలో పేదల ఆకలి తీరుస్తున్న యువకులు


భోజనం తింటున్న పేదలు

ఈటీవీ, అనంతపురం, న్యూస్‌టుడే, కమలానగర్‌: ప్రస్తుతం మార్కెట్లో ఏ వస్తువు ధర చూసినా మండిపోతున్న తరుణంలో రూ.5కే కడుపు నిండా రుచికరమైన భోజనం పెట్టడం సాధ్యమా..? ఎవ్వరిని అడిగినా కచ్చితంగా సాధ్యం కాదనే అంటారు. ఒకవేళ ఇంత తక్కువ ధరతో భోజనం పెట్టడానికి ముందుకు వచ్చినా, ఈ సేవ కొనసాగించడానికి సిద్ధం కావటం సాహసమే అవుతుంది. అనంతపురం నగరంలో చరణ్‌ అనే యువకుడు తన స్నేహితులు శంకర్‌, విజయభాస్కర్‌ రెడ్డి, లక్ష్మి, హరీష్‌, చింటు, నాగరాజు, పవన్‌తో కలిసి రూ.5కే రుచిగా, శుచిగా భోజనం వడ్డిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండు నుంచి సైఫుల్లా ఉపరితల వంతెనకు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన కౌంటర్‌ ఏర్పాటు చేసి రోజూ మధ్యాహ్నం భోజనం అందిస్తుండటం విశేషం.

రోజూ ఓ వంటకంతో రుచిగా...

రూ.5కే అందిస్తున్న భోజనం రోజూ ఒకేలా కాకుండా వేర్వేరు వంటకాలతో వడ్డిస్తున్నారు. అన్నం, పప్పు, చెట్నీతో ఓరోజు, సాంబార్‌ అన్నం, చెట్ని, వేరుసెనగ పొడితో ఓరోజు ఇలా అనేక వంటకాలతో భోజనం అందిస్తున్నారు. త్వరలో రూ.2కే ఇడ్లి కూడా అందించాలని చరణ్‌ అతని మిత్రబృందం భావిస్తోంది. భోజనం కోసం బుక్కరాయసముద్రం, కూడేరు మండలాల్లో పలువురు రైతులు, గ్రామీణ వ్యాపారుల నుంచి నాణ్యమైన కూరగాయలు నేరుగా చౌకగా కొనుగోలు చేస్తున్నారు. బియ్యాన్ని పామిడి, గార్లదిన్నె మండలంలోని రైతులు, మిల్లుల నుంచి నేరుగా కొనడంతో అక్కడ కూడా ధర తగ్గి ఆర్థికంగా కలిసి వస్తోంది. రోజూ 300 మందికి భోజనం అందిస్తున్నామని, అందుకుగాను రూ.3,500 వరకు ఖర్చు అవుతుందని చరణ్‌ తెలిపారు.

స్పందన క్యాంటీన్‌ పేరుతో..

చరణ్‌.. సుమారు 12 ఏళ్లుగా స్పందన అనే స్పచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా మృతులకు ఉచితంగా అంత్యక్రియలు చేసిన చరణ్‌, అతని మిత్రులు అప్పట్లో అనేక మంది ప్రశంసలు పొందారు. అప్పట్లోనే ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో రూ.5కు భోజనం, రూ.2కు ఇడ్లిని రోగులకు, వారి బంధువులకు అందించారు. అయితే అధికారుల హెచ్చరికలతో దాన్ని కొనసాగించ లేకపోయారు. అప్పటి నుంచి ఏదోలా ఈ భోజన వితరణ కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తూ వచ్చిన చరణ్‌ ఎట్టకేలకు దీన్ని ఆచరణలో పెట్టారు. స్పందన క్యాంటీన్‌ పేరుతో ప్రస్తుతం రూ.5కు భోజనం అందిస్తున్నారు.

నిరుపేదల ఆకలి తీర్చాలనే..

భోజనం ఉచితంగా ఇస్తే వృథా చేస్తారని కరోనా సమయంలో ప్రత్యక్షంగా చూసిన తరువాతనే నామమాత్రంగా వసూలు చేస్తూ రూ.5కే భోజనం పెడుతున్నాం. ప్లేటు కోసం రూ.1, నీళ్ల ప్యాకెట్‌కు 90 పైసలు వెచ్చిస్తున్నాం. మా అమ్మ, భార్య స్వయంగా వండుతున్నారు. ఉదయం అల్పాహారంగా రూ.2కు ఇడ్లీ ఇవ్వాలని అనుకున్నా. బస్టాండు సమీపంలో నిరుపేదలు ఎక్కువగా ఉంటారని సర్వే చేసిన తరువాతనే కౌంటర్‌ ఏర్పాటు చేశాం. ఇందుకు డిప్యూటీ మేయర్‌ కొగటం విజయభాస్కర్‌రెడ్డి సహకారం మరువలేనిది. కూలీలు, మెకానిక్‌ షెడ్లలో పనిచేసేవారు, గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చే వారు మా భోజనం చేస్తున్నారు. ఇంతమంది ఆకలి తీరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. - చరణ్‌, స్పందన క్యాంటీన్‌ నిర్వాహకుడు

క్యాంటీన్‌లో చరణ్‌, అతని మిత్రులు

రుచికరంగా సాంబార్‌ అన్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని