logo

రూ. లక్షల్లో పెట్టుబడి.. రైతన్న కంటతడి

పంట చేతికొచ్చే తరుణంలో ఒక్కసారిగా ధర కుప్పకూలింది. రైతుకు ట‘మాట’ పడిపోయింది. భారీగా పెట్టుబడి పెట్టి.. ఎన్నో ఆశలతో సాగువేసిన టమోటా చేతికొచ్చే సమయంలో ధర పతనమవడంతో విలవిల్లాడిపోతున్నారు. మూడు నెలల కిందట కిలో టమోటా రూ.100 పలకగా.. నేడు 15 కిలోల బాక్సు రూ.30, రూ.40 మాత్రమే పలుకుతోంది.

Published : 06 Aug 2022 05:34 IST

దిగజారిన టమోటా ధర

అన్నదాతల్లో ఆందోళన

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: పంట చేతికొచ్చే తరుణంలో ఒక్కసారిగా ధర కుప్పకూలింది. రైతుకు ట‘మాట’ పడిపోయింది. భారీగా పెట్టుబడి పెట్టి.. ఎన్నో ఆశలతో సాగువేసిన టమోటా చేతికొచ్చే సమయంలో ధర పతనమవడంతో విలవిల్లాడిపోతున్నారు. మూడు నెలల కిందట కిలో టమోటా రూ.100 పలకగా.. నేడు 15 కిలోల బాక్సు రూ.30, రూ.40 మాత్రమే పలుకుతోంది.

ఊరించి.. ఉసూరుమనిపించి
మూడు నెలల కిందట అత్యధిక ధరలు పలకడంతో రైతులను ఎంతో ఊరించింది. ఇది చూసి పెద్ద ఎత్తున సాగు చేశారు. ఉమ్మడి జిల్లా సాధారణ సాగు 9,878 హెక్టార్లు కాగా సుమారు 15 వేల హెక్టార్లలో సాగు చేశారు. రైతులు ఆసక్తి చూపడంతో నారు వ్యాపారులకు లాభం పండింది. ప్రస్తుతం మార్కెట్‌కు టమోటా భారీగా వస్తోంది. మార్కెట్‌ మాయాజాలంతో వినియోగదారులకు కిలో రూ.10 విక్రయిస్తుండగా.. రైతుకు మాత్రం రూ.2-రూ.3 మించి దక్కడం లేదు.

మేల్కోని మార్కెటింగ్‌శాఖ
మార్కెటింగ్‌ శాఖ జిల్లాలో పంటల ఉత్పత్తులకు ధరలు ఉన్నాయా? లేదా? అని నిత్యం పర్యవేక్షించాలి. వారు పట్టించుకోవడం లేదు. ధర దక్కక రైతులు పంట పారేస్తే తప్ప వారిలో చలనం రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో టమోటా వేలాది టన్నులు పండుతోంది. మార్కెటింగ్‌ శాఖ పదుల సంఖ్యలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన దిగుబడి ఎవరు కొనుగోలు చేస్తారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.


రోడ్డు పక్కన పారబోత


 

పంపనూరు సమీపంలో కొండవద్ద పోసిన టమోటాలు

ఆత్మకూరు: కళ్యాణదుర్గం, రాయదుర్గం, చెళ్లికెర ప్రాంతాల నుంచి అనంతపురం మార్కెట్‌కి రైతులు టమోటా తరలిస్తున్నారు. మార్కెట్‌లో నో సేల్‌ బోర్డు పెట్టడంతో పంటను వెనక్కి తీసుకొచ్చి రోడ్డు పక్కన పారబోస్తున్నారు. 15 కిలోల బాక్సు కనీసం రూ.150 పలికినా గిట్టుబాటు ధర ఉంటుందని రైతులు చెబుతున్నారు.


రైతు కష్టం నీళ్లపాలు

బావిలో పడేస్తూ..

చెన్నేకొత్తపల్లి: చెన్నేకొత్తపల్లికి చెందిన అన్నదమ్ములు శ్రావణ్‌కుమార్‌, నరసింహులు నాలుగెకరాల్లో పంట వేశారు. గురువారం కాయలను గ్రేడింగ్‌చేసి 20 కిలోలుగా 150 బాక్సుల్లో నింపారు. వాహనంలో ధర్మవరం మార్కెట్కు తరలించారు. టమోటా అమ్ముడుపోలేదు. దీంతో అనంత మార్కెట్ తీసుకొచ్చారు. అక్కడ వ్యాపారుల స్పందన కరవైంది. చేసేదేమిలేక తిరిగి పొలానికి తరలించి పక్కనే ఉన్న బావిలో పడేశారు. 15 మంది కూలీలకు ఒక్కొక్కరికీ రూ.250, వాహన బాడుగ రూ.3 వేలు చేతి నుంచి చెల్లించాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


నాణ్యత లేదు.. కొనలేం..


మార్కెట్‌కు సమీపంలో పారబోస్తున్న రైతు

శుక్రవారం 4 లక్షల బాక్సుల (15 కిలోలు) టమోటా అనంతలోని కక్కలపల్లి మార్కెట్‌కు వచ్చింది. వర్షానికి కాయలు తడిసిపోయాయని.. నాణ్యత లేదని 70 వేల బాక్సులు (105 టన్నులు) కొనలేదు. ‘నో సేల్‌’ అని వ్యాపారులు చెప్పడంతో రైతులు కంగుతిన్నారు. చేసేదిలేక కొందరు సరకును మార్కెట్లో వదిలేసి వెళ్లిపోయారు. మరికొందరు మార్కెట్‌ సమీపంలో జాతీయ రహదారి వెంట పారబోశారు.


టమోటా కొంటాం
- సత్యనారాయణ చౌదరి, ఏడీఎం

జిల్లాలో టమోటా ధరలు తగ్గుతున్నాయి. నాణ్యత లేకపోవడంతో వ్యాపారులు కొనలేదని తెలిసింది. శుక్రవారం అనంతపురం మార్కెట్‌కు వెళ్లి తనిఖీ చేశా. రైతులు, వ్యాపారులతో మాట్లాడాను. ప్రభుత్వం తరపున టమోటా కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు సరఫరా చేస్తాం. ఇప్పటికే 7 టన్నులు కొని, కర్నూలుకు పంపించాం. రైతులు, వ్యాపారులు సంప్రదిస్తే.. ధర నిర్ణయించి కొనుగోలు చేస్తాం.


రూ.2 లక్షలు నష్టపోయా
నాగరాజు, బలపంపల్లి, శెట్టూరు

మూడెకరాల్లో టమోటా సాగు చేశా. సుమారు రూ.2.90 లక్షలు వెచ్చించా.  800 బాక్సులు మార్కెట్‌కు తీసుకొచ్చా. 15 కిలోల బాక్సు ధర రూ.60 పలికింది. రూ.48 వేలు చేతికొచ్చింది. ధరలేక నష్టపోయా. అప్పులే మిగిలాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని