logo

గుట్టుగా గుట్కా.. జోరుగా మట్కా!

ప్రజల జేబులకు చిల్లు పెట్టే జూదం.. ఆరోగ్యాన్ని దెబ్బతీసే నిషేధిత గుట్కా, కర్ణాటక మద్యం విక్రయాలకు గుంతకల్లు, గుత్తి పట్టణాలు కేంద్రాలుగా మారుతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి కొందరు పెద్దఎత్తున మట్కా నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా..

Published : 17 Aug 2022 03:54 IST

గుంతకల్లు కేంద్రంగా వ్యాపారం


గుంతకల్లులో అమ్ముతున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లు

గుంతకల్లు, న్యూస్‌టుడే: ప్రజల జేబులకు చిల్లు పెట్టే జూదం.. ఆరోగ్యాన్ని దెబ్బతీసే నిషేధిత గుట్కా, కర్ణాటక మద్యం విక్రయాలకు గుంతకల్లు, గుత్తి పట్టణాలు కేంద్రాలుగా మారుతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి కొందరు పెద్దఎత్తున మట్కా నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా.. ఫోన్‌పే ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. వివిధ వాహనాల నంబర్లతో మట్కా చీటీలు రాస్తూ.. చరవాణుల్లో పంపుతున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. గుంతకల్లులోనే ప్రస్తుతం 20 మందికిపైగా నిర్వాహకులు ఉన్నారు. గుత్తిలోనూ జోరుగా సాగుతోంది. నిత్యం గుంతకల్లులో రూ.20 లక్షలకుపైగా మట్కా జూదం సాగుతోంది.

ఇంటింటికీ కర్ణాటక మద్యం

పట్టణానికి చెందిన కొందరు బళ్లారి నుంచి మద్యం ప్యాకెట్లను తెచ్చి పలువురు ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. రోజుకు రూ.12 లక్షలు విలువచేసే ప్యాకెట్ల అమ్మకాలు సాగుతున్నట్లు అంచనా. నెలకు ఒకసారి డబ్బు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు దాడులు చేస్తారనే భయంతో వృద్ధులు, పిల్లలతో వీటిని విక్రయిస్తున్నారు. ప్యాకెట్లను కొందరు రైళ్లలో తెస్తున్నారు. మద్యం ప్యాకెట్లు ఉన్న సంచులను పట్టణ శివారులో కిందపడేసి తరువాత తరలిస్తున్నారు.

పొరుగు రాష్ట్రం నుంచి..

నిషేధిత గుట్కా అమ్మకాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. వ్యాపారులు కొందరు కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్‌ నుంచి గుట్కా ప్యాకెట్లను తెప్పించి, గుంతకల్లులో అధిక ధరకు అమ్ముతున్నారు. రైళ్లు, లారీలు, ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్నారు. రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచుతున్నారు. పలుమార్లు గోదాములపై పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నా మార్పు రావడం లేదు. రాత్రికి రాత్రే పట్టణంలోని వివిధ దుకాణాలు, బీడీ బంకులకు సరఫరా చేస్తున్నారు. పట్టణంలో రోజుకు రూ.8 లక్షలు విలువచేసే గుట్కా ప్యాకెట్ల అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం.

కఠిన చర్యలు తీసుకుంటాం - నరసింగప్ప, డీఎస్పీ

గుంతకల్లులో గుట్కా అమ్మకాలు జరగకుండా, మట్కా నిర్వహించకుండా గట్టి చర్యలు తీసుకుంటాం. పోలీసులు దాడులు చేసి బాధ్యులైన వారిని పట్టుకుంటూ కేసులు నమోదు చేస్తున్నారు. రహస్యంగా కార్యకలాపాలు చేసేవారిపై దృష్టిపెట్టి, వారి ఆట కట్టిస్తాం. పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని