logo

వ్యవసాయ క్షేత్రాలే.. పేకాట కేంద్రాలు!

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో జూదం జూలు విదిలిస్తోంది. రోజుకు రూ.లక్షల్లో చేతులు మారుతోంది. ఆదివారం, సెలవు రోజుల్లో పేకాట మరింత జోరుగా సాగుతోంది.

Updated : 07 Dec 2022 04:31 IST

ఆత్మకూరులో జోరుగా జూదం
వైకాపా నాయకుల అండతో నిర్వహణ

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో జూదం జూలు విదిలిస్తోంది. రోజుకు రూ.లక్షల్లో చేతులు మారుతోంది. ఆదివారం, సెలవు రోజుల్లో పేకాట మరింత జోరుగా సాగుతోంది. వ్యవసాయ క్షేత్రాల్లో ప్రైవేటు సెక్యూరిటీ మధ్య నిర్వహిస్తున్నారు. ఇదంతా రాప్తాడు నియోజకవర్గంలోని కీలక వైకాపా నేత సోదరుడి కనుసన్నల్లో జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు బెంగళూరు నుంచి మనుషుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడిస్తున్నారు. తోపుదుర్తి, వేపచర్ల, గొరిదిండ్ల ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేశారు. కొంతమంది పోలీసులు మామూళ్లు తీసుకుని పేకాట స్థావరాల నిర్వహణకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల గొరిదిండ్ల ప్రాంతంలో పేకాటరాయుళ్లను పోలీసులు పట్టుకుని, రాజకీయ ఒత్తిళ్లతో వదిలేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రవేశ రుసుం

పేకాట ఆడటానికి ఒక్కొక్కరి నుంచి రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ప్రవేశ ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతోపాటు ఆటలో గెలిచిన వ్యక్తి లాభంలో 20 శాతం నిర్వాహకులకు సమర్పించుకోవాలి. ఒక వ్యక్తి ఆటలో రూ.లక్ష గెలిస్తే అందులో రూ.20 వేలు వైకాపా నాయకుడి జేబులోకి వెళ్తోంది. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని పకడ్బందీగా జూదం ఆడిస్తున్నారు. పోలీసులు వస్తే సమాచారం ఇవ్వడానికి 5 కిలోమీటర్ల దూరం వరకు ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాపలా ఉండే వ్యక్తులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. ఇలా రోజుకు ఒక్కో స్థావరంలో రూ.30 లక్షల వరకు నగదు చేతులు మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఉమ్మడి జిల్లాలో దందా

ఆత్మకూరు, తాడిపత్రి ప్రాంతాల్లో పేకాట స్థావరాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. హిందూపురం వైకాపా నాయకులు కర్ణాటక సరిహద్దుల్లో పేకాట ఆడిస్తున్నారు. ఇటీవల కొందరిని కర్ణాటక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. గుడిబండ మండలం మండలపల్లి, రాళ్లపల్లి ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట స్థావరాలను స్థానిక నాయకులు నడిపిస్తున్నారు. ఈ వ్యవహారంలో సహకరిస్తున్న ఓ కానిస్టేబుల్‌ను ఇటీవల సస్పెండ్‌ చేశారు. మడకశిర మండలం కల్లుమర్రిలోని పంట పొలాల్లో రాత్రి వేళల్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం.

కూడేరులోనూ..

ఉరవకొండ నియోజకవర్గంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారుడి ప్రధాన అనుచరుడు పేకాట స్థావరాలను నిర్వహిస్తున్నారు. కూడేరు మండలం అరవకూరు గ్రామ సమీపంలోని కొండల్లో జూదం జోరుగా సాగుతోంది. రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 4 వరకు పేకాట నడుస్తోంది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు ఎక్కువగా పాల్గొంటున్నట్లు సమాచారం. నియోజకవర్గ నాయకుడి ప్రధాన అనుచరుడికి భారీగా కమీషన్‌ అందుతోంది.

ప్రత్యేక వాహనాల్లో తరలిస్తూ..

ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో మామిడి తోటలు, చింతవనాలు కేంద్రంగా చేసుకుని పేకాట నిర్వహిస్తున్నారు. స్థావరానికి కొద్ది దూరంలో సొంత వాహనాలను నిలిపేస్తున్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చే వారికోసం ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించినట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా రోజుకొక ప్రాంతంలో పేకాట ఆడిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఆట కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో వైకాపా నాయకుడికి రూ.లక్షల్లో కమీషన్‌ చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇదంతా పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మా దృష్టికి రాలేదు

ఆత్మకూరు ప్రాంతంలో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు. దీనిపై వెంటనే విచారణ జరిపిస్తాం. నిజమని తేలితే చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టి పేకాటను నియంత్రించే దిశగా గట్టి చర్యలు తీసుకుంటాం. ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. 

రామకృష్ణ, సెబ్‌ ఇన్‌ఛార్జి ఏఎస్పీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని