logo

కొత్త రైల్వే లైన్లకు మొండిచెయ్యి!

ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లో గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కనీస స్థాయి కేటాయింపు కూడా లేవు.

Published : 04 Feb 2023 04:00 IST

గుంతకల్లు రైల్వే జంక్షన్‌

గుంతకల్లు, న్యూస్‌టుడే: ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లో గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కనీస స్థాయి కేటాయింపు కూడా లేవు. సర్వేలు పూర్తిచేసుకుని కొన్ని సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న కొత్తలైన్ల నిర్మాణానికి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కొత్తలైన్లు నిర్మాణం అవుతాయని వందలాది గ్రామాల ప్రజలు ఎదురుచూస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. డివిజన్‌లో కొత్త రైల్వేలైన్ల నిర్మాణాన్ని చేపట్టడానికి డివిజన్‌ అధికారులు రైల్వేబోర్డు ఆదేశాల మేరకు సర్వేలు చేసి నివేదించారు. నివేదికలు పంపి ఆరు నెలల నుంచి రెండేళ్లు అవుతున్నా వాటికి నిధులను కేటాయించలేదు. రాయచోటి నుంచి కదిరి మీదుగా హిందూపురానికి, పుట్టపర్తి- కదిరి, కోలార్‌- కదిరి, ధర్మవరం- బళ్లారి, ముద్దనూరు- ముదిగుబ్బల మధ్య కొత్తలైన్లను నిర్మించడానికి అధికారులు సర్వేలు చేశారు. వాటికి నిధులను కేటాయించాలని కోరుతూ బోర్డుకు నివేదికలు సమర్పించారు. వీటికి బడ్జెట్‌లో చోటు దక్కలేదు.


డబుల్‌లైన్‌లకు నిధులు అంతంతమాత్రమే

ధర్మవరం నుంచి పాకాల మీదుగా కాట్పాడి వరకు (290 కి.మీ.లు) డబుల్‌లైన్‌ను నిర్మించడానికి గతంలో రూ.200 కోట్లు కేటాయించి తరువాత ఆ నిధులను ఇతర పనులకు మళ్లించారు. ప్రస్తుత బడ్జెట్‌లో డబుల్‌లైన్‌ కోసం రూ.40 కోట్లను కేటాయించినట్లు బడ్జెట్‌కు చెందిన కార్యాచరణ ప్రణాళికలో పొందుపరిచారు. గుత్తి- పెండేకల్లు, యర్రగంట్ల- నంద్యాల, తిరుపతి- పాకాల మధ్య డబుల్‌లైన్‌ను, విద్యుదీకరణ పనులను చేపట్టడానికి అధికారులు నివేదికలను తయారుచేసి గత సంవత్సరం బోర్డుకు పంపారు. వీటికి కూడా బడ్జెట్‌లో స్థానం కల్పించలేదు. ఈ పనులు పూర్తయితే గుంతకల్లు రైల్వే డివిజన్‌ సంపూర్ణ డబలింగ్‌, విద్యుదీకరణ డివిజన్‌గా మారుతుంది. నిధులు కేటాయించక పోవడంతో పనులు ఎప్పుడు చేపడతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జరుగుతున్న గుత్తి- ధర్మవరం, గుంతకల్లు- గుంటూరు డబుల్‌లైన్‌, విద్యుదీకరణ పనులకు బోర్డు రూ.188 కోట్లను కేటాయించింది. కడప- బెంగళూరు మధ్య నిర్మిస్తున్న కొత్తలైన్‌కు రూ.10 కోట్లు కేటాయించారు. లెవల్‌ క్రాసింగుల ఆధునికీకరణ, వంతెనల నిర్మాణం, రైల్వేలైన్ల ఆధునికీకరణ తదితర పనులకు కొన్ని నిధులను కేటాయించారు. రైల్వే సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణం కోసం నిధులను కేటాయించలేదు.


‘నిధులు సద్వినియోగం చేసుకుందాం’

రైల్వేఅధికారులతో చర్చిస్తున్న డీఆర్‌ఎం వెంకటరమణారెడ్డి

గుంతకల్లు: బడ్జెట్‌లో గుంతకల్లు డివిజన్‌కు ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుందామని డీఆర్‌ఎం వెంకట రమణారెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ జోన్‌కు, గుంతకల్లు డివిజన్‌కు జరిగిన కేటాయింపుల గురించి తెలియజేయడానికి రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌ దిల్లీ నుంచి నిర్వహించిన వీడియో సమావేశాన్ని అధికారులు డీఆర్‌ఎం కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వీక్షించారు. అనంతరం డీఆర్‌ఎం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం డివిజన్‌లో జరుగుతున్న డబుల్‌లైన్‌తో పాటు విద్యుదీకరణ పనులకు బడ్జెట్‌లో నిధులను కేటాయించారని అన్నారు. ధర్మవరం- పాకాల మధ్య డబుల్‌లైన్‌ కోసం కూడా నిధులను కేటాయించారని అన్నారు. రైల్వేలైన్లను బలోపేతం చేయడానికి ప్రభుత్వం జోన్‌కు రూ.1360 కోట్లను కేటాయించిందని, వీటి నుంచి గుంతకల్లు డివిజన్‌కు కూడా నిధులు అందుతాయని చెప్పారు. గుంతకల్లులో నిర్మాణం అవుతున్న విద్యుత్తు లోకో షెడ్డు పనులకు రూ.5.6 కోట్లను కేటాయించారన్నారు.  ఏడీఆర్‌ఎంలు సూర్యనారాయణ, సుధాకర్‌, డీసీఎం రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని