logo

బాలికను జోగినిగా మార్చే యత్నం..

బడి మానేసిన ఓ 16 ఏళ్ల బాలికను జోగిని వ్యవస్థలోకి దించేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు.

Published : 07 Feb 2023 04:41 IST

అడ్డుకున్న అధికారులు

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: బడి మానేసిన ఓ 16 ఏళ్ల బాలికను జోగిని వ్యవస్థలోకి దించేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటన రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్‌ మండలంలోని ఓ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన బాలికను కర్ణాటకలోని హొసపేటె జిల్లాలోని హులిగికి తీసుకుని వెళ్లి అమ్మవారికి జోగినిగా (బసివినిగా) మార్చేందుకు తల్లిదండ్రులు, బంధువులు ప్రయత్నం చేశారు. దీనిపై గ్రామస్థులు సోమవారం బాలికల సంరక్షణ సహాయ కేంద్రం 1098కు చరవాణిలో సమాచారం ఇచ్చారు. వెంటనే సహాయ కేంద్రం సిబ్బంది, తహసీల్దారు శ్రీనివాసులు, ఎస్‌ఐ శివ, ఆర్‌డీటీ ఏటీఎల్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఐసీడీఎస్‌ అధికారులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. బాలికతో పాటు తల్లిదండ్రులు హులిగికి వెళ్లడానికి బళ్లారిలో ఉండగా గుర్తించి వెనక్కు తీసుకుని వచ్చారు. బాలిక, తల్లిదండ్రులకు తహసీల్దారు కార్యాలయంలో అధికారులు అవగాహన కల్పించారు. బాలిక తండ్రి మాట్లాడుతూ తమపై గ్రామస్థులు అసత్య ప్రచారం చేశారనీ.. తాము హలిగిలోని ఉలిగమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళుతున్నామని అన్నారు. బాలికను స్థానిక కస్తూర్బా పాఠశాలలో చేర్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దారు చెప్పారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో పలు మండలాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నందున ఈ ప్రాంతంలో బాలికలను చిన్న వయసులోనే జోగినిగా మార్చే దురాచారం ఇంకా కొనసాగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు, ఆర్‌డీటీ స్వచ్ఛంద సంస్థ ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని