logo

నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సస్పెండ్‌ చేయాలి

నార్పల మండలానికి చెందిన 23 ఏళ్ల దళిత యువతి దారుణ హత్యకు గురైన ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మండిపడ్డారు.

Published : 27 Mar 2023 05:22 IST

యువతి హత్యకు గురైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న
ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ, తదితరులు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : నార్పల మండలానికి చెందిన 23 ఏళ్ల దళిత యువతి దారుణ హత్యకు గురైన ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మండిపడ్డారు. బుక్కరాయసముద్రం చెరువు గట్టుపై యువతి హత్యకు గురైన ప్రాంతాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దళితులపై దాడులు, హత్యాచారాలు ఆగడం లేదన్నారు. యువతి కనిపించడం లేదని, జాఫర్‌ అనే వ్యక్తిపై తమకు అనుమానం ఉందని యువతి తల్లిదండ్రులు ఈ నెల 5న నార్పల పోలీసులకు ఫిర్యాదు చేసినా తగిన రీతిలో స్పందించలేదన్నారు. జాఫర్‌ను స్టేషన్‌కు పిలిపించి అతడి తప్పులేదని పోలీసులే చెప్పడం దారుణమన్నారు. ఈ కేసులో నార్పల ఎస్సై రాఘవరెడ్డి, కానిస్టేబుళ్లు, శింగనమల సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించినందున తక్షణమే వీరిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత యువతి హత్యకేసులో నిందితుడిని కాపాడే ప్రయత్నం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు హరి, నాగలింగ, నాగరాజు, చంద్ర, కదిరప్ప, శ్రీరాములు, వెంకటేష్‌, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
అనంత నేరవార్తలు: నార్పల మండలానికి చెందిన దళిత యువతి హత్యాచారం ఘటనలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని, వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మార్సీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం ఎస్పీ ఫక్కీరప్పకు వినతిపత్రం అందజేశారు. నిందితుడు జాఫర్‌పై హత్యాచారం కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి, నాయకులు మధు మాదిగ, బండారు శంకర్‌, గంగాధర్‌, మహేష్‌, పెద్దిరాజు, స్వతంత్రకుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని