logo

జగన్‌ పాలనలో .. ఉద్యానాలు కనుమరుగు

జగన్‌ ప్రభుత్వంలో పట్టణవాసికి ఆహ్లాదాన్ని అందించాల్సిన ఉద్యానవనాలు ఉనికిని కోల్పోయాయి. వీటిని సంరక్షించాల్సిన పురపాలికలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొత్త పార్కుల ఏర్పాటును గాలికి వదిలేశారు.

Published : 24 Apr 2024 05:05 IST

పట్టణాల్లో కనిపించని ఆహ్లాదం
పాడైన ఆట పరికరాలు

న్యూస్‌టుడే, గుంతకల్లు: జగన్‌ ప్రభుత్వంలో పట్టణవాసికి ఆహ్లాదాన్ని అందించాల్సిన ఉద్యానవనాలు ఉనికిని కోల్పోయాయి. వీటిని సంరక్షించాల్సిన పురపాలికలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొత్త పార్కుల ఏర్పాటును గాలికి వదిలేశారు. అమృత్‌ పథకం కింద కేటాయించిన నిధుల సద్వినియోగంలో విఫలమవుతున్నారు. ఫలితంగా ఉద్యానవనాల్లో పిల్లలకు ఆటవిడుపుగా ఏర్పాటు చేసిన ఆట పరికరాలు ధ్వంసమయ్యాయి. పచ్చదనం ఆవిరైపోయింది. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయిలోని పరిస్థితిపై కథనం

పిల్లలకు ఆట విడుపు ఏదీ?

రాజేంద్రనగర్‌లోని పురపాలక ఉద్యానవనాన్ని ఎకరా స్థలంలో ఆరేళ్ల కిందట ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు పాడైపోయి రెండేళ్లవుతున్నా అధికారులు వాటిని పట్టించుకోలేదు. పరిసరాల్లో సుమారు 12 వేల జనాభా ఉంటుంది. ఇక్కడి వాసులు సెలవు దినాల్లో పిల్లలతో కలిసి సరదాగా గడపడానికి అనువైన పరిస్థితి లేకపోవడం లేదు. పార్కులో పూర్తి స్థాయిలో పచ్చదనం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. నీటి సౌకర్యం పుష్కలంగా ఉన్నా

ఆదిలోనే హంసపాదు

మొదినాబాదులో మున్సిపాలిటీకి చెందిన ఎకరా స్థలంలో అధికారులు పార్కుల ఏర్పాటు పనులు చేపట్టారు. ఆ పనులన్నీ నాలుగేళ్ల కిందట అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇక్కడ నీటి కోసం ట్యాంకును ఏర్పాటు చేసినా, అక్కడ నీటి వసతి లేదు. పిల్లల కోసం క్రీడా పరికరాలు ఏర్పాటు చేయలేదు. పార్కులో మొక్కలు నాటింది లేదు. వ్యాయామ పరికరాలు కంపచెట్లలో కూరుకుపోయాయి. పార్కు పనులకు సంబంధించి అధికారులు ఇంకా రూ.24 లక్షలు ఖర్చు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు జరిగిన పనులన్నీ వృథా అయ్యాయి.  

మొక్కలు నాటి పెంచే  వారే కరవయ్యారు

మొక్కలు లేని హంపయ్య పార్కు హంపయ్య కాలనీలో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ. 52 లక్షలు కేటాయించింది. ఇక్కడ జిమ్‌, చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేశారు. ఆరేళ్ల కిందట పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన పరికరాలన్నీ తుప్పు పట్టిపోయాయి. మొక్కలు నాటిన దాఖలాలు లేవు. మొక్కలు నాటేందుకు రూ.10 లక్షలు ఉన్నా ఈ నిధులతో మొక్కలు కొనకూడదని, ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ఉన్నతాధికారులు చెప్పడంతో పురపాలక అధికారులు పట్టించుకోలేదు.

ఐదేళ్లు పచ్చందాలు కరవు

తాడిపత్రి : తాడిపత్రి పురపాలికలో వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క ఉద్యానవనం ఏర్పాటు చేయలేదు. తెదేపా హయాంలో సంజీవనగర్‌, పెన్నానది ఒడ్డున నిర్మించిన ఉద్యానవనాలను అభివృద్ధి చేయలేదు. పురపాలికలో 36 వార్డులు, సుమారు 1.30 లక్షల జనాభా ఉంది. తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే జేసీˆ ప్రభాకర్‌రెడ్డి పట్టణంలో ఉద్యానవనాల కోసం ఐదు కాలనీల్లో స్థలాలను సేకరించి ప్రహరీలు నిర్మించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఎక్కడా ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. అరకొర వసతులతో సంజీవనగర్‌లో ఉన్న చిన్నారుల ఉద్యానవనం, పెన్నానదిలో జేసీˆ ప్రభాకర్‌రెడ్డి సొంత నిధులతో నిర్మించిన ఉద్యానవనమే దిక్కైంది. సంజీవనగర్‌లో ఉన్న ఉద్యానవనంలో చిన్నారులు ఆడుకునే పరికరాలన్నీ ధ్వంసమయ్యాయి.  

వర్షాకాలంలో మూతే

తాడిపత్రిలోని సంజీవనగర్‌లో ఉన్న చిన్నపిల్లల ఉద్యానవనంలో వర్షాకాలంలో భారీగా నీరు నిల్వ ఉంటుంది. ఆసమయంలో ఉద్యానవనాన్ని మూసేస్తారు. అధికారులు, పాలకులు అటువైపు చూసే పాపానపోలేదు. ఐదేళ్లలో పురపాలికలో ఎక్కడా ఒక్క ఉద్యానవనం ఏర్పాటు చేయలేదు.

లక్ష్మీరెడ్డి, సంజీవనగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని