logo

వైకాపా గెలుపు కిరీటానికి కుప్పం వజ్రం

రాష్ట్రం మొత్తం వైకాపా గెలిచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కిరీటం పెట్టినా.. కుప్పం గెలుపు వజ్రం వంటిదని చిత్తూరు ఎమ్మెల్సీ భరత్‌ అన్నారు. వైకాపా నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.

Published : 29 Jun 2022 02:24 IST

ఎమ్మెల్సీ భరత్‌


సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ భరత్‌, పక్కన ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ రమేష్‌, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రం మొత్తం వైకాపా గెలిచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కిరీటం పెట్టినా.. కుప్పం గెలుపు వజ్రం వంటిదని చిత్తూరు ఎమ్మెల్సీ భరత్‌ అన్నారు. వైకాపా నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సిఫార్సు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందేవని ఆరోపించారు. ఇప్పుడు సభ్యత్వ నమోదుకు రూ.100 వసూలు చేస్తున్నారని విమర్శించారు. వైకాపా దెబ్బకు చంద్రబాబు కుప్పంలో సొంతిల్లు కట్టుకుంటున్నారని, రాబోయే రోజుల్లో ఇక్కడే ఓటరుగా సైతం నమోదు చేసుకుంటారన్నారు. ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో వైకాపా నాయకులు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు త్వరలో మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొందరు అసంతృప్తితో ఉన్నారని అందరినీ కలుపుకొని సమష్టిగా ముందుకెళ్దామన్నారు. కార్యక్రమంలో కడప ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌కుమార్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ డా.సుధీర్‌, నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీ, సర్పంచులు తదితరులు ఉన్నారు.

కుర్చీలు ఖాళీ అయ్యి.. తలుపులు బిగించి..

వైకాపా నియోజకవర్గ ప్లీనరీ సమావేశం జరుగుతున్నప్పుడు మధ్యలో కార్యకర్తలు సభ నుంచి వెనుదిరిగారు. ఇంతలో సమావేశం నిర్వహిస్తున్న ప్రైవేటు కల్యాణ మండపం తలుపులు బిగించి ఎవరూ బయటకు వెళ్లకుండా నియంత్రించేందుకు యత్నించారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడే సమయానికి సగం కూర్చీలు ఖాళీ అయ్యాయి. సభ అరగంటలో పూర్తవుతుందని నాయకులు ఎంత కోరినా కార్యకర్తలు వినిపించుకోకుండా బయటకు వెళ్లిపోయారు.

అందరి బాధలు తీర్చండి..

కుప్పంపై శీతకన్ను మానితేనే భవిష్యత్తు ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గెలుస్తారని శాంతిపురం ఎంపీపీ భర్త, వైకాపా నాయకుడు కోదండరామిరెడ్డి అన్నారు. పలువురు నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని.. అందరి బాధలు తీర్చాలన్నారు. పక్క నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి, నిధుల పంపిణీలో కుప్పంపై శీతకన్ను కారణంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధిష్టానం స్పందించి అన్ని నియోజకవర్గాల మాదిరిగానే కుప్పాన్ని చూడాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని