logo

అందరూ అడగలేదంట..!

: రబీలో వేరుసెనగ పంట సాగుకు రాయితీ వేరుసెనగ విత్తన కాయలు రైతులు అడగలేదు.. మా మండలాలకు విత్తన కేటాయింపులు వద్దంటూ జిల్లాలో మూడు మండలాలు మినహా మిగిలిన 28 మండల వ్యవసాయాధికారులు తేల్చేశారు.

Published : 04 Dec 2022 03:48 IST

కార్యాలయాల్లో కూర్చొని తేల్చేసిన ఏవోలు

వేరుసెనగ విత్తులేక రైతుల ఇక్కట్లు

నిండ్ర మండలంలో వేరుసెనగ కాయల పంపిణీ (పాత చిత్రం)

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: రబీలో వేరుసెనగ పంట సాగుకు రాయితీ వేరుసెనగ విత్తన కాయలు రైతులు అడగలేదు.. మా మండలాలకు విత్తన కేటాయింపులు వద్దంటూ జిల్లాలో మూడు మండలాలు మినహా మిగిలిన 28 మండల వ్యవసాయాధికారులు తేల్చేశారు. రైతులు ఏ పంట సాగు చేస్తారు..? వేరుసెనగ సాగుకు రైతుల వద్ద విత్తనాలు ఉన్నాయా.? లేవా..? తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే కార్యాలయాల్లో కూర్చొని పలువురు ఏవోలు వేరుసెనగ విత్తు అవసరం లేదని నివేదించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.. ఆ నివేదిక ఆధారంగా నగరి, నిండ్ర, విజయపురం మండలాల్లోనే పంపిణీ చేస్తున్నారు.. ఎవరిని అడిగి పంపిణీ మూడు మండలాలకే పరిమితం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తనం వేసినప్పటి నుంచి అమ్మే వరకు రైతు నష్టపోకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని.. సకాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేసి అధిక దిగుబడి వచ్చేలా చూస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం మాటలు చెబుతున్నారు. ఇవేవీ క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో రైతుకు సరైన సమయంలో విత్తనాలు అందటం లేదు. ఫలితంగా వారి అవస్థలు చెప్పనలవికావు. రాయితీపై ఇచ్చే  వేరుసెనగ విత్తనాలు కొందరికే అందడం.. మరికొందరికి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అడిగిన మండలాలకే సరఫరా

వేరుసెనగ విత్తు కావాలని ప్రతిపాదించిన మూడు మండలాలకు సరఫరా చేశాం. మిగిలిన మండలాల ఏవోలు విత్తు అడగకపోవడంతో పంపిణీ చేయలేదు. అవసరమైతే పంపిణీకి చర్యలు తీసుకుంటాం.
 రత్నప్రసాద్‌, ఇన్‌ఛార్జి జేడీఏ

సాగుపై ఆసక్తి ఉన్నా..

జిల్లాలో రబీలో వేరుసెనగ సాధారణ సాగు 8,500 ఎకరాలని వ్యవసాయ శాఖ అంచనా. వాతా వరణం అనుకూలించడంతో రబీలో నీటి ఆధారంగా వ్యవసాయ శాఖ చిత్తూరు, పలమనేరు డివిజన్ల పరిధిలో దీని సాగుకు అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. రాయితీ విత్తుకు రైతులు నిరీక్షించినప్పటికీ పంపిణీ లేకపోవడంతో ఎక్కడ తెచ్చుకోవాలో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. కేవలం నిండ్ర, విజయపురం, నగరి మండలాలకు 1,990 క్వింటాళ్లు కేటాయించగా.. ఏపీ విత్తన సంస్థ ప్రస్తుతానికి 1,666 క్వింటాళ్లు సరఫరా చేయడంతో పంపిణీ కొనసాగుతోంది. అన్ని మండలాల్లో రాయితీ విత్తు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని