logo

భారంగా పశుపోషణ

ఉమ్మడి జిల్లాలో చిన్న, సన్నకారు రైతులు, పేదలకు పాడి పరిశ్రమ ప్రధాన జీవనాధారం. వేల కుటుంబాలు.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులు సగానికి పైగా పాడి పరిశ్రమతో జీవనం సాగిస్తున్నారు.

Published : 20 Jan 2023 02:50 IST

దాణా ధరల పెరుగుదలే కారణం
తగ్గిన పెంపకందార్ల ఆదాయం

దుకాణంలో విక్రయానికి ఉంచిన వివిధ రకాల దాణా బస్తాలు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో చిన్న, సన్నకారు రైతులు, పేదలకు పాడి పరిశ్రమ ప్రధాన జీవనాధారం. వేల కుటుంబాలు.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులు సగానికి పైగా పాడి పరిశ్రమతో జీవనం సాగిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి పాడి పరిశ్రమే ఆదాయ మార్గం. అయితే పెరిగిన ఖర్చులతో పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం, దాణా ధరలు అమాంతం పెరగడంతో పాడి పెంపకందార్ల ఆదాయం గణనీయంగా తగ్గింది. దాణా ధరలు పెరిగినా పాల ధర పెరగక స్థిరంగా ఉండటంతో రైతులు పాడిని వదులుకునే పరిస్థితి నెలకొంది.

బస్తాపై అదనంగా రూ.300 ఖర్చు

నాణ్యమైన పాల దిగుబడి కోసం ఆవులకు సమతుల ఆహారం అందించాలి. ఏడాదిలో పశువుల దాణా ధరలు అమాంతం పెరిగాయి. పాడి ఆవుల నుంచి అధిక పాల ఉత్పత్తి కోసం రైతులు పచ్చిగడ్డి, ఎండుగడ్డితో పాటు దాణా, వేరుసెనగ పిండిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. లీటరు పాల ఉత్పత్తికి రూ.15-20 వరకూ దాణా కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం 50 కిలోల దాణా బస్తాపై అదనంగా రూ.300 ఖర్చు చేయాల్సి వస్తోంది. పాల డెయిరీలు రైతులకు లీటరుపై రూ.25-35 వరకూ చెల్లిస్తున్నాయి. పోషణ ఖర్చులు పెరగడంతో పాడి రైతులకు భారంగా మారనుంది. పాడి పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలు క(న)ష్టాలతో కొట్టుమిట్టాడే పరిస్థితి నెలకొంది.


కష్టంగా పెంపకం
-జయరామిరెడ్డి, పాడి రైతు, నాచుకుప్పం

దాణా ధరలు పెరగడంతో పాల దిగుబడితో వచ్చే ఆదాయం తగ్గుతోంది. పాల నుంచి వచ్చే ఆదాయం దాణా, పశుగ్రాసం కొనుగోలుకే వెచ్చించాల్సి వస్తోంది. పాడి ఆవుల పెంపకం భారంగా మారింది.


పశువులను అమ్ముకోవాల్సిందే
- నారాయణస్వామి, పాడి రైతు, శెట్టిపల్లె

దాణా ఖర్చుల పెరుగుదలతో కష్టాలు తప్పడం లేదు. కొనుగోలు చేసి ఆవులను పోషించాలంటే పాలతో వచ్చే ఆదాయం చాలదు. పొలంలో పచ్చగడ్డి పెంచుకుంటే కొంత ఆదాయం మిగులుతుంది. పాల ధరలు పెంచకుంటే పశువులను అమ్ముకోవాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని