logo

సామాన్య భక్తులకు త్వరగా దర్శనం

‘భక్తులకు ఇబ్బంది లేకుండా తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో నవంబరు 1 నుంచి సర్వదర్శన టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు నిర్వహిస్తున్నాం.

Published : 27 Jan 2023 02:35 IST

తితిదే ఈవో ధర్మారెడ్డి

గౌరవ వందనం స్వీకరిస్తున్న తితిదే ఈవో ధర్మారెడ్డి

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: ‘భక్తులకు ఇబ్బంది లేకుండా తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో నవంబరు 1 నుంచి సర్వదర్శన టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు నిర్వహిస్తున్నాం. సామన్య భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించి ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు డిసెంబరు 1 నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. దీనిపై రెండు నెలల పరిశీలన తరువాత తుది నిర్ణయం తీసుకుంటాం’ అని తితిదే ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వెనుక మైదానంలో గురువారం ఈవో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం తితిదే సీవీఎస్‌వో నరసింహ కిషోర్‌ ఆధ్వర్యంలో పరేడ్‌ కమాండర్‌ ఏవీఎస్‌వో విశ్వనాధం నేతృత్వంలో గౌరవ వందనం స్వీకరించారు. ఈవో మాట్లాడుతూ.. ‘రూ.120 కోట్ల టాటా సంస్థ విరాళంతో తిరుమలలోని ఎస్వీ మ్యూజియాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం. దాత మురళీకృష్ణ సహాయంతో రూ.23 కోట్లతో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి మొదటి వారంలో కార్యకలాపాలు ప్రారంభిస్తాం. శ్రీవారి లడ్డూలను మరింత నాణ్యతగా, ఎక్కువగా తయారు చేసేందుకు వీలుగా రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ విరాళంగా అందించే రూ.50 కోట్లతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తాం. క్యూఆర్‌ కోడ్‌ విధానం విజయవంతమైన నేపథ్యంలో త్వరలో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం. రూ.15 కోట్ల విలువ చేసే 10 విద్యుత్‌ బస్సులను విరాళంగా అందించేందుకు ఒలెక్ట్రా సంస్థ ముందుకు వచ్చింది. వీటిని ఏప్రిల్‌ చివరి వారంలో అందిస్తారు. ధర్మరథాల స్థానంలో నడుపుతాం. తిరుమలలోని ఆకాశగంగ వద్దగల అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా గుర్తించి దాతలు మురళీకృష్ణ, నాగేశ్వరరావు సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం’ అని తెలిపారు. జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, డీఎల్‌వో రెడ్డప్పరెడ్డి, సీఈ నాగేశ్వరరావు, ఎఫ్‌ఏసిఏవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

అలరించిన జాగిలాల ప్రదర్శన

తితిదే పరిపాలనా భవనం వెనుక ఉన్నపరేడ్‌ మైదానంలో తితిదే జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తితిదే విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని