logo

ప్రయాణికుల హితం.. ప్రమాద రహితం

జాగ్రత్తగా విధులు నిర్వహిస్తూ.. రోడ్డుపై ప్రయాణించే తోటి వాహనచోదకులు, పాదచారుల భద్రతను చూసుకున్నారు. ఎదురుగా వచ్చే ప్రమాదాన్ని అంచనా వేస్తూ చాకచక్యంగా వ్యవహరిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Published : 06 Feb 2023 02:32 IST

జిల్లాలో ఉత్తమ డ్రైవర్లుగా గుర్తింపు
- న్యూస్‌టుడే, తిరుపతి(ఆర్టీసీ)

జాగ్రత్తగా విధులు నిర్వహిస్తూ.. రోడ్డుపై ప్రయాణించే తోటి వాహనచోదకులు, పాదచారుల భద్రతను చూసుకున్నారు. ఎదురుగా వచ్చే ప్రమాదాన్ని అంచనా వేస్తూ చాకచక్యంగా వ్యవహరిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆ ముగ్గరు డ్రైవర్లు. జిల్లాలోని వివిధ ఆర్టీసీ డిపోల్లో పనిచేస్తున్న వీరు 30 ఏళ్లకుపైగా సర్వీసులో ప్రమాద రహిత డ్రైవర్లుగా పేరుగాంచారు. వీరికి ఆర్టీసీ గుర్తింపు ఇచ్చి  శనివారం అలిపిరి డిపోలో జరిగిన 34వ రోడ్డు భద్రతా వారోత్సవాలలో తిరుపతి మూడో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి వై.వీర్రాజు, ఆర్టీవో సీతారామిరెడ్డి, జిల్లా ప్రజా రవాణాధికారి చెంగల్‌రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలతో పాటు ప్రోత్సాహక నగదు బహుమతులు అందుకున్నారు.


12 దఫాలు ప్రశంసలు

వాకాడు డిపోకు చెందిన భక్తవత్సలం(60) 1989 నుంచి ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మొదట గూడూరు డిపోలో 7 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత నుంచి వాకాడులో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కోట- నాయుడుపేట, మల్లాం- నాయుడుపేట సర్వీసులు నడుపుతున్నారు. ఇప్పటివరకు చిన్న ప్రమాదం కూడా చేయకుండా ప్రమాద రహిత డ్రైవర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో నెల్లూరు రీజియన్‌ పరిధిలో పనిచేస్తున్న సమయంలో 12 దఫాలుగా నెల్లూరులో ఉత్తమ డ్రైవర్‌గా ప్రశంసలు అందుకున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా వాకాడు డిపో తిరుపతి జిల్లా పరిధిలోకి రావడంతో ఈ ఏడాది ప్రమాద రహిత డ్రైవర్‌గా జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు.

చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, ప్రయాణికులకు చిరునవ్వుతో సమాధానం ఇస్తూ బాధ్యతగా విధులు నిర్వర్తించడం ద్వారా తనకు ఈ గుర్తింపు వచ్చిందని భక్తవత్సలం తెలిపారు.


దూరప్రాంతాలకు నడిపిన అనుభవం

తిరుపతి మంగళం డిపోకు చెందిన ఎన్‌.సి.దొరై(56) 15 సంవత్సరాలకు పైగా తిరుపతి- హైదరాబాద్‌ ఏసీ సర్వీసును నడుపుతున్నారు. ఎస్‌.ఆర్‌.పురం మండలానికి చెందిన దొరై.. 1989లో ఆర్టీసీలో ఉద్యోగం పొంది పుత్తూరు, తిరుపతి డిపోల్లో పనిచేశారు. తిరుపతి డిపోలో డ్రైవర్‌గా మైసూర్‌, రామేశ్వరం దూర ప్రాంతాలకు నడిపిన అనుభవం ఉండటంతో మంగళం డిపోలో ఏసీ బస్సులు నడిపే అవకాశం వచ్చింది. తిరుపతి- హైదరాబాద్‌ మధ్య ఏసీ బస్సులు నడుపుతూ ప్రమాద రహిత డ్రైవర్‌గా గుర్తింపు పొందారు. ఇదివరకు మూడుసార్లు ప్రమాద రహిత ఉత్తమ డ్రైవర్‌గా ప్రశంసలు అందుకున్న దొరై.. ఈ ఏడాది జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచారు.

విధుల్లో ప్రతి డ్రైవర్‌కు ఓపిక, సహనం ఎంతో ముఖ్యమని, ఏకాగ్రతతో డ్రైవింగ్‌ చేయడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని దొరై అభిప్రాయపడ్డారు.


ఘాట్‌రోడ్డులోనే విధులు

మంగళం డిపోకు చెందిన ఎం.మురళి సర్వీసులో చేరినప్పటి నుంచి ఘాట్‌ రోడ్డు విధులు నిర్వర్తిస్తున్నారు. 1989లో ఆర్టీసీలో చేరిన ఈయన... తిరుమల డిపోలో 23 ఏళ్లుగా తిరుమల ఘాట్‌ రోడ్డులో బస్సులు నడుపుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మంగళం డిపోలోనూ అదే ఘాట్‌ రోడ్డు బస్సులు నడుపుతున్నారు. తన సర్వీసులో చిన్న ప్రమాదానికి తావులేకుండా బస్సులు నడిపి ఉత్తమ డ్రైవర్‌గా గుర్తింపు పొందారు. ఐదుసార్లు డిపో స్థాయిలో ఉత్తమ డ్రైవర్‌గా ప్రశంసలు అందుకున్న మురళి... ఈ ఏడాది జిల్లాలో తృతీయ స్థానంలో నిలిచారు.

ఏకాగ్రతతో ముందుగా వచ్చే ప్రమాదాన్ని పసిగట్టే విధంగా డ్రైవింగ్‌లో మెలకువతో ఉండాలని మురళి అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని