logo

ఈ ఏడాది జిల్లాపై ఎండల ప్రభావం అధికం: కలెక్టర్‌

జిల్లాలో ఈ ఏడాది ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Published : 21 Mar 2023 03:02 IST

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి

తిరుపతి(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లాలో ఈ ఏడాది ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ బాలాజీతో కలిసి విపత్తుల నిర్వహణపై వివిధశాఖలకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. మార్చి ప్రారంభం నుంచే ఎండలు ఎక్కువగా ఉన్నాయని, ఈ దఫా 48 నుంచి 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు  నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు సమన్వయంతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రెవెన్యూ యంత్రాంగం జిల్లా, మండల స్థాయిలో కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేయాలని, పంచాయతీ, మున్సిపల్‌శాఖలు తమ పరిధిలో మజ్జిగ, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యశాఖ తమ పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారి విజయకుమార్‌, డీఈవో శేఖర్‌, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ పరమేశ్వరస్వామి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బాలకృష్ణారెడ్డి, అరుణ, అమరేంద్ర, గౌరీ, సుమలత పాల్గొన్నారు.
స్పందనకు 125 వినతులు : స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే వినతులను సంబంధితశాఖల అధికారులు సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందనలో జేసీ బాలాజీ, డీఆర్వో శ్రీనివాసరావుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ స్పందనలో 125 అర్జీలుగా రాగా వీటిలో 108 రెవెన్యూశాఖకు సంబంధించి వచ్చినట్లు తెలిపారు. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు కోదండరామిరెడ్డి, భాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని