logo

నేతకు ఉపాధి మేత

గ్రామీణ కుటుంబాలకు గరిష్ఠంగా వందరోజులు పనికల్పించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పడుతున్నాయి.

Updated : 24 Mar 2023 03:36 IST

వేతనాల్లో ఊరూరా వాటాలు
క్షేత్రస్థాయిలో సిబ్బంది దాసోహం
జిల్లాలో పథకం అమలు తీరిది

గూడూరు,గూడూరు గ్రామీణ, న్యూస్‌టుడే: గ్రామీణ కుటుంబాలకు గరిష్ఠంగా వందరోజులు పనికల్పించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పడుతున్నాయి. చోటా నేతల కనుసన్నల్లో నిధులు జమవుతున్న పరిస్థితి ఊరూరా కనిపిస్తోంది. పనుల్లో పాల్గొననివారికి నగదు జమచేయడంపై ఎక్కడికక్కడ దుమారం రేగుతోంది. ఉద్యోగ భద్రతలేని క్షేత్రస్థాయి సిబ్బంది స్థానిక నేతలకు పూర్తిస్థాయిలో దాసోహం అవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఊరికి ఒకరిద్దరు చొప్పున మంత్రాంగం నడిపిస్తూ ప్రతి మండలంలో రూ.లక్షల్లో నిధులు స్వాహా చేస్తున్నట్లు అంచనా.

జిల్లాలోని కుటుంబాలు 2.76 లక్షలుకాగా 4.78 లక్షల మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. వీరికి ఏటా రూ.206.99 కోట్లను వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. మొత్తం వ్యయంలో ఇది 64.61%. ఉపాధితోపాటు ఆస్తుల సృష్టికి ఉపకరిస్తోన్న ఈ పథకానికి నాలుగేళ్లుగా స్థానిక నేతలు తూట్లు పొడుస్తున్నారు.

 గూడూరు మండలంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4.73 కోట్లు కూలీలకు వెచ్చించారు. రూ.2.17 కోట్లు మెటీరియల్‌కు వ్యయం చేశారు. ఇదే మండలం రామలింగాపురంలో కూలీలు 419 మంది ఉన్నారు. గతంలో 500 మంది వరకు ఉండగా స్థానికుల ఫిర్యాదుతో పలువురి పేర్లు రద్దు చేశారు. ఇక్కడ ఓనేత రాజకీయ పలుకుబడితో కొందరు పనులకు రాకున్నా నగదు జమచేయిస్తూ స్వాహా చేస్తుండటంపై కూలీలు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఇక్కడ పదుల సంఖ్యలో ఇలాంటివారుండగా రూ.వేలల్లో జమ కావడంపై దుమారం రేగింది.

ఓజిలి మండలంలో రూ.16 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. కూలీలకు రూ.7.34 కోట్లు, మెటీరియల్‌  కోసం రూ.8.65 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. సగటూరు తదితర గ్రామాల్లో కొందరు పనులకు రాకున్నా వేతనం జమచేయడంపై ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈతంతు రెండేళ్లుగా జరుగుతున్నట్లు చెబుతున్నారు. రాజకీయ పలుకుబడిగల కుటుంబంలోని భార్యాభర్తలకు నగదు జమచేస్తున్నట్లు వేతన ఖాతాలను సాక్ష్యంగా చూపుతున్నారు.

వెంకటగిరి మండలంలోని పలు  గ్రామాల్లో ఇదేతీరు నడుస్తోంది. కూలీల కోసం రూ.6.36 కోట్లు ఏటా వ్యయం చేస్తుండగా పదోవంతు వరకు రాజకీయ పలుకుబడి ఉన్నవారి ఖాతాల్లో పనిచేయకున్నా వేతనం జమచేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదంతా కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది, మండలస్థాయి అధికారుల సహకారంతో సాగుతోంది. దీనిపైనా స్థానికులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాగా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.

ఫిర్యాదులపై విచారించి చర్యలు

ఎక్కడైనా కూలీలు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుం టాం. కూలీలకు న్యా యం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తాం.

శ్రీనివాస ప్రసాద్‌, డ్వామా, పీడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని