logo

అందేనా.. ఆపత్కాల సాయం

వైఎస్సార్‌ బీమా ప్రయోజనం కోసం బాధిత కుటుంబాలకు ఎదురు చూపులు తప్పడం లేదు. నిధుల లేమి, ధ్రువపత్రాల సమర్పణలో లోటుపాట్లు తదితర కారణాలతో సాయం సకాలంలో అందడం లేదు.

Updated : 03 Jun 2023 04:17 IST

వైఎస్సార్‌ బీమా కుటుంబాలకు తప్పని నిరీక్షణ
అధిక శాతం క్లెయిమ్‌ల పెండింగ్‌

వైఎస్సార్‌ బీమా ప్రయోజనం కోసం బాధిత కుటుంబాలకు ఎదురు చూపులు తప్పడం లేదు. నిధుల లేమి, ధ్రువపత్రాల సమర్పణలో లోటుపాట్లు తదితర కారణాలతో సాయం సకాలంలో అందడం లేదు. 2022 జులై 1 నుంచి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో అధిక శాతం పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రమాద మరణాలకు బీమా సంస్థ నుంచి నగదు జమవుతున్నా సాధారణ మరణాలకు ప్రభుత్వం ఇచ్చే నగదు చెల్లింపులు సకాలంలో జరగనట్లు సమాచారం.

న్యూస్‌టుడే, గూడూరు

ఉమ్మడి జిల్లాలో 2022-23లో 2,115 మంది మరణించగా 850 మందికి మాత్రమే సాయం అందజేశారు. సాధారణ మరణాలకు రూ.లక్ష సాయాన్ని ప్రభుత్వమే అందిస్తుంగా.. ప్రమాద మరణాలకు బీమా సంస్థ ద్వారా రూ.5 లక్షలు అందిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పథకం అమలు కోసం ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. 18-50 ఏళ్ల వయస్సువారు సాధారణంగా మృతిచెందినా పరిహారం అందించాల్సి ఉంది. 18-70 ఏళ్ల వయస్సు వరకు ప్రమాద మరణాలు, శాశ్వత వైకల్యం సంభవిస్తే పరిహారం వర్తిస్తుంది. పథకం ఇంప్లిమెంట్‌ ఏజెన్సీ వార్డు, గ్రామ సచివాలయ శాఖ కాగా కార్మికశాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉంది. వైకాపా ప్రభుత్వం బీమా పథకంలో పలు మార్పులు చేయడం, ఇంటి యజమానికి మాత్రమే ప్రమాద బీమా వర్తింపజేయడంతో అందరికీ ప్రయోజనం దక్కని పరిస్థితులు నెలకొన్నాయి.

పరిష్కారం ఇలా..

* గూడూరు మండలంలో 48 మంది మరణించగా 22 క్లెయిమ్‌లు పరిష్కారమయ్యాయి. సాధారణ మరణాలకు వార్డు, సచివాలయ శాఖ నుంచి పరిహారం అందించగా ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు బీమా కంపెనీ చెల్లింపులు చేసింది. దీంతో సగానికి పైగా బాధిత కుటుంబాల  పరిహారంపై సందిగ్ధం నెలకొంది.

* వెంకటగిరి, కోట మండలాల్లో 38 మంది గతేడాదిగా మరణించారు. ఇందులో సాధారణ 35 కాగా, ప్రమాదానికి సంబంధించి మూడు ఉన్నాయి. 35 మందికి గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రొసీడింగ్స్‌ ఇవ్వగా 15 మంది బాధిత కుటుంబాల ఖాతాల్లో నగదు చేరింది. మరో 3 కుటుంబాలకు బీమా కంపెనీల నుంచి నగదు జమకాగా మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

* బంగారుపాళ్యం మండలంలో 35 మరణాలు సంభవించగా అందులో సాధారణం 31 వరకు ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వుల మేరకు అందులో 15 మందికి ప్రయోజనం దక్కింది. మరో నలుగురికి బీమా కంపెనీ నుంచి సాయం జమైంది. మిగిలినవారికి ఎప్పుడు ప్రయోజనం దక్కుతుందో తెలియని పరిస్థితి.

పొరపాట్లు ఉంటే సరిచేయిస్తాం

అర్హత ఉండి అన్ని ధ్రువీకరణ పత్రాలు అందించిన వారికి బీమా ప్రయోజనం వెంటనే దక్కుతోంది. ఎక్కడైనా పొరపాట్లు ఉండి పరిహారం అందకపోతే సరిచేయించే ఏర్పాట్లు చేస్తాం.

బాలూనాయక్‌, జాయింట్‌ కమిషనర్‌, కార్మికశాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని