logo

ఐరన్‌ లెగ్‌ను ఆదరించిన మాపైనే విమర్శలా?: మంత్రి రోజాపై నగరి నేతల ఆగ్రహం

ఐరన్‌ లెగ్‌గా పేరొందిన ఆర్కే రోజాను గోల్డెన్‌ లెగ్‌గా మార్చి ఎమ్మెల్యే, మంత్రిగా చేస్తే.. ఈరోజు తమపైనే విమర్శలు చేస్తూ తమను దూరంపెడుతున్నారని వడమాలపేట వైకాపా జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌ రెడ్డి, వైకాపా కీలక నేతలు రెడ్డివారి భాస్కర్‌రెడ్డి, ఎలుమలై, రవిశేఖర్‌ రాజు విమర్శించారు.

Updated : 06 Mar 2024 08:25 IST

 మాట్లాడుతున్న జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి తదితరులు

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: ఐరన్‌ లెగ్‌గా పేరొందిన ఆర్కే రోజాను గోల్డెన్‌ లెగ్‌గా మార్చి ఎమ్మెల్యే, మంత్రిగా చేస్తే.. ఈరోజు తమపైనే విమర్శలు చేస్తూ తమను దూరంపెడుతున్నారని వడమాలపేట వైకాపా జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌ రెడ్డి, వైకాపా కీలక నేతలు రెడ్డివారి భాస్కర్‌రెడ్డి, ఎలుమలై, రవిశేఖర్‌ రాజు విమర్శించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం పుత్తూరు, వడమాలపేట, నిండ్ర, విజయపురం, నగరి మండలాలకు చెందిన వైకాపా కీలక నేతలు మాట్లాడారు.

తమ నాయకుడు జగన్‌ 2019 ఎన్నికల్లో నగరి టికెట్‌ రోజాకు ఇవ్వడంతో.. ఇక్కడి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఎంపీ మిథున్‌రెడ్డి సూచనల మేరకు కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకున్నామని వివరించారు. ఐదు మండలాల్లో తనకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారని చెప్పిన మంత్రి రోజా, నేడు ఆమె అన్నదమ్ముల అవినీతి, అక్రమాలకు అడ్డుగా ఉన్నామని పక్కనపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆస్తులు అమ్మి కష్టపడి గెలిపించిన తమకు మంత్రి రోజా పదవులు ఇచ్చారని సెల్వమణి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైకాపా అధిష్ఠానం ప్రజానాడిని గుర్తించి ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించాలని, లేకుంటే నగరి టికెట్‌ కోల్పోయే పరిస్థితి ఉందని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని