logo

ప్రేమ పేరుతో వంచన.. తాళి తెంచి నడిరోడ్డుపై వదిలి

ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా...కాదంటే చంపేస్తా... ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు, యువతిని బెదిరించి, వేధించి పెళ్లి చేసుకున్నాడు.

Published : 19 Mar 2024 04:06 IST

అత్తమామ, బావల నిర్వాకం

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా...కాదంటే చంపేస్తా... ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు, యువతిని బెదిరించి, వేధించి పెళ్లి చేసుకున్నాడు. ఆపై అర్ధరాత్రి తాళి తెంచి నడిరోడ్డుపై వదిలేసిన ఘటన మండలంలోని పాలేరు పంచాయతీ మోతకుంటలో సోమవారం వెలుగు చూసింది. బాధితురాలి కథనం మేరకు పాలేరు పంచాయతీ శేషాపురం గ్రామానికి చెందిన యమున(21) మోతకుంట గ్రామానికి చెందిన అభిరామ్‌(22) స్థ్థానిక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుకునేవారు. ఆ సమయంలో యమునను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, నిరాకరిస్తే చంపి, తాను ఆత్మహత్య చేసుకుంటానని అభిరామ్‌ వెంటపడి బెదిరించేవాడు. భయపడిన ఆ యువతి.. అతడి ప్రేమ అంగీకరించి సన్నిహితంగా మెలిగింది. ఈ నెల ఆరో తేదీన తమిళనాడులోని అరుణాచలం దేవస్థానానికి కారులో తీసుకెళ్లి పెళ్లి చేసుకుని వేకువజామున అతడి ఇంటికి వచ్చారు. 

తాము పెళ్లి చేసుకున్నామని, తండ్రి శేఖర్‌, తల్లి నాగభూషణమ్మ, అన్నలు క్రిష్ణ, అనిల్‌కు చెప్పగా వారు అంగీకరించ లేదు. తమకు ఇష్టం లేదంటూ యమున మెడలోని తాళి తెంచి, చంపుతామని బెదిరించి, ఆమె చేతిలోని చరవాణి, రెండున్నర గ్రాముల బంగారు ఉంగరాన్ని లాక్కుని దాడి చేశారు. అనంతరం వారు ఆమెను ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని శేషాపురం సర్వీసు రోడ్డులో వదిలేశారు. ఆపై ఆమె ఈ నెల ఏడో తేదీన మదనపల్లెలోని స్నేహితురాలు రెడ్డిరాణి వద్దకు చేరుకుని భర్త అభిరామ్‌కు ఫోన్‌ చేసి న్యాయం చేయాలని కోరగా.. కొద్దికాలం అక్కడే ఉండాలని, త్వరలోనే ఇంటికి తీసుకెళ్తానని నమ్మబలికాడు. అప్పటి నుంచి అతడు రాకపోగా, సోమవారం ఫోన్‌ చేస్తే కట్‌ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించి బంగారుపాళ్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై మల్లికార్జున కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని