logo

అధికారుల అనుమతి తర్వాతే వాలంటీర్ల రాజీనామాకు ఆమోదం

ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు.

Published : 29 Mar 2024 02:40 IST

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం జరిగిన మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్ల రాజీనామాలకు అధికారుల అనుమతి తర్వాతే ఆమోదం లభిస్తుందన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్ల నుంచి సెల్‌ఫోన్‌, సిమ్‌ కార్డుల స్వాధీనానికి చర్యలు చేపడతామన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై పత్రికలు, ఆన్‌లైన్‌ ద్వారా వస్తున్న ఫిర్యాదుల్ని వేగంగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. జేసీ శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రేడ్‌ యూనియన్‌ కార్యాలయాల వద్ద జెండాలు తొలగించకుండా చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్‌వో పుల్లయ్య, శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీప్రసన్న, అట్లూరి శ్రీనివాసులు(భాజపా), గంగరాజు(సీపీఎం), భాస్కర్‌ (కాంగ్రెస్‌), సురేంద్రకుమార్‌ (తెదేపా), ఉదయ్‌కుమార్‌ (వైకాపా) పాల్గొన్నారు. ః కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల సభ్యుల సమక్షంలో కలెక్టర్‌ పరిశీలించారు. మే 13న జరిగే పోలింగ్‌కు పది రోజుల ముందుగా ఈవీఎంలను మరోసారి పరిశీలిస్తామని పేర్కొన్నారు. ః నీటి ఎద్దడి ఉన్న గ్రామాలు గుర్తించి, నీటి సరఫరాకు చేపట్టే చర్యలపై సోమవారానికల్లా నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ షన్మోహన్‌ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ అవసరమైతే నాడు-నేడు పనులు జరిగిన పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని బోర్లు వినియో గించాలన్నారు. 250కి పైగా బోర్లు ఉన్న మండలాల్లో మరో మెకానిక్‌ను నియమించాలని ఆదేశించారు.

ఓటరు నమోదుపై 450 స్వీప్‌ ర్యాలీలు: జిల్లాలో  డ్వామా, పుర/నగరపాలక సంస్థలు, ఐసీడీఎస్‌, ఆరోగ్యశాఖల సమన్వయంతో ఓటరు చైతన్య కార్యక్రమాలు, ర్యాలీలు 450 జరిగాయి. 2019 ఎన్నికల్లో జిల్లాలో 85.02 శాతం పోలింగ్‌ నమోదైందని, ఈ విడత దీన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్‌ తెలిపారు. ఏప్రిల్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువత ఏప్రిల్‌ 15లోగా ఓటరుగా నమోదవ్వచ్చని, సహాయం కోసం 1950 నంబరుకు డయల్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని