logo

ఓరిమితోనే..భవితకు చోటు

‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో వజ్రాయుధం.. ఓటు. ఈ హక్కు పొందడంలో నిర్లిప్తత నెలకొంది. ఎన్నికల రోజు హడావుడిగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి.. జాబితా చూసుకుని.. పేరు లేకపోతే..

Published : 25 Jan 2023 04:22 IST

జాతీయ ఓటర్ల దినోత్సవం నేడు

‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో వజ్రాయుధం.. ఓటు. ఈ హక్కు పొందడంలో నిర్లిప్తత నెలకొంది. ఎన్నికల రోజు హడావుడిగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి.. జాబితా చూసుకుని.. పేరు లేకపోతే.. నా ఓటు లేకుండా చేశారు... ఉద్దేశపూర్వకంగా తొలగించారని నిందించడమే తప్ప... అసలు నా ఓటుందా? లేదా? లేకుంటే ఏం చేయాలి? అని ముందు జాగ్రత్త తీసుకునే వారు తక్కువ. ఒకసారి ఓటేస్తే అయిదేళ్లు పాలితులమవుతామనే సత్యాన్ని తెలుసుకోకుండా ఓటు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.’’


న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌: ‘‘యువతకు ఓటు హక్కే లక్ష్యంగా.. ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. అందుకే నేడు ఓటర్ల జాబితా చూసుకోవాలి. అర్హత ఉండి మీ పేరు లేకపోతే మళ్లీ నమోదు చేసుకోవాలి. రండి.. పోయేదేముంది.. ఒక గంట సమయమేగా. రెవెన్యూ కార్యాలయాల గడప తొక్కకుండానే... చరవాణి నుంచే ఓటు నమోదుకూ వీలుంది. ఓరిమితో ఓటరుగా నమోదై.. ఓటుపథాన నడవాలి.. చైతన్యంతో మసలుకోవాలి. బంగారు భవితకు బాటలు వేయాలి.

యువతీ యువకులకు ఓటు నమోదుపై అవగాహన


రండి... సరిచూసుకోండి

ఉమ్మడి జిల్లాలో 21 నియోజకవర్గాల్లో 4,643 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఈనెల 5న ప్రచురించిన ఓటర్ల తుది జాబితాలు అందుబాటులో ఉండనున్నాయి. కలెక్టరేట్‌, ఆర్డీవో, తహసీల్దారు, మున్సిపల్‌ కార్యాలయాలు, బూత్‌ లెవల్‌ అధికారుల వద్ద కూడా జాబితాలు ఉన్నాయి. వీటిని ఎప్పుడైనా పరిశీలించవచ్చు.nvsp.in వెబ్‌సైట్‌, voter help line’ యాప్‌లో ఆన్‌లైన్‌లో ఓటర్ల జాబితా చూడవచ్చు. 1950 టోల్‌ ఫ్రీ నంబరులో సంప్రదించి.. మీ పేరు, ఊరు, ఇంటి నంబరు, చిరునామా, ఓటరు గుర్తింపు సంఖ్య తెలియజేస్తే, మీ ఓటు ఉందో లేదో తెలుస్తుంది.


నిరంతర ప్రక్రియ

ఓటు నమోదు నిరంతర ప్రక్రియ. 18 ఏళ్లు నిండితే ఎప్పుడైనా ఓటరుగా నమోదు కావచ్చు. ఏటా జనవరి 1, జులై 1, అక్టోబరు 1.. ఇలా ఈ 3 నెలల చివరకు 18 ఏళ్లు నిండితే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఓటరుగా నమోదు కావచ్చు. తహసీల్దారు కార్యాలయ ఎన్నికల విభాగాల్లో ఫారం-6 ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే ఓటు ఉంటే.. చేర్పులు, మార్పులు, బదిలీ, తొలగింపు దరఖాస్తు ఇవ్వవచ్చు. nvsp.in వెబ్‌సైట్‌,voter help line’ యాప్‌లోనూ దరఖాస్తు చేయవచ్చు. వీటిని ఎప్పటికప్పుడు విచారించి.. ఓటు హక్కు కల్పిస్తారు. కొత్తగా ఓటు హక్కు కోరే వారు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, వయసు ధ్రువీకరణ, ఆధార్‌కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తుకు జత చేయాలి.


నిర్లిప్తత వీడండోయ్‌

ఓటర్ల జాబితాలో 18-19 ఏళ్లవారు 4 శాతం ఉండాలి. మూడు జిల్లాల్లోనూ ఒక శాతానికి మించి నమోదు కాలేదు. కాకినాడ జిల్లా ఓటర్లలో 18-19 ఏళ్ల వారు 50 వేలకు పైగా ఉండాలి. కానీ ఉన్నది 14,800 మందే. తూర్పుగోదావరి జిల్లాలో 45 వేల మందిని గుర్తించినా 13,967 మందే ఓటర్లుగా ఉన్నారు. కోనసీమ పరిధిలో 40 వేల మంది ఉంటే.. ఓటర్లుగా 60 శాతం లోపే ఉన్నారు. మిగిలిన వారినీ ఓటర్లుగా చేర్పించాల్సిన తరుణమిదే.


పోలింగ్‌కూ వెనకబాటే

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2019లో సార్వత్రిక ఎన్నికల్లో 80.20 శాతం మందే ఓటేశారు. రాజానగరంలో అత్యధికంగా 87.51 శాతం, అత్యల్పంగా రాజమహేంద్రవరం నగరంలో
66.34 శాతం పోలింగ్‌ నమోదైంది.


నిర్ణయించేది నువ్వే!

ఈనాడు, కాకినాడ: ఎవరు నెగ్గాలో.. ఎవరు ఓడాలో.. తేల్చేది ఓటరే. ఎలాంటి వారు ఏలాలో నిర్ణయించేది ఓటరే.. నాకు ఓటు లేకపోతే.. నేనొక్కడినే ఓటు వెయ్యకపోతే ఏమవుతుందిలే.. అనేది చాలామంది భావన కానీ.. పూర్వ ఎన్నికల తీరు పరిశీలిస్తే.. 1, 2, 3, 4, 5.. ఇలా అంకెల తేడాతో విజయం తారుమారయ్యే పరిస్థితి నెలకొంది. ఓట్ల లెక్కింపులో చివరి క్షణం వరకు విజయం దోబూచులాడింది. ఓటు.. ఓటరు నిర్ణయం ఎంత కీలకమో తేలింది. గత పంచాయతీ, పరిషత్తు, పుర ఎన్నికల్లో ఉత్కంఠ రేపే ఫలితాలు తారసపడ్డాయి.


పంచాయతీ ఎన్నికల్లో..

గొల్లప్రోలు మండలం వన్నెపూడి పంచాయతీ ఎన్నికల్లో రాసంశెట్టి వెంకటలక్ష్మి, కొడవలిలో జోడా శ్రీను ఒక్క ఓటు మెజార్టీతో వార్డు
సభ్యులుగా గెలిచారు. రౌతులపూడి మండలం ధారజగన్నాథపురంలో మిరియాల జోగిరాజు.. జగ్గంపేట మండలం గోవింద
పురంలో కమ్మిల వెంకటేశ్వరరావు మూడు ఓట్లతో గెలిచారు. రౌతులపూడి మండలం రాఘవపట్నంలో రాయిపల్లి లోవరాజు 5 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

గొల్లప్రోలు మండలం కొడవలి ఎంపీటీసీ స్థానం నుంచి వైకాపా అభ్యర్థి బుద్ధా భగవాన్‌ ఒకటే ఓటు ఆధిక్యంతో విజయం సాధించారు.
జగ్గంపేట మండలం రామవరం- 2 ఎంపీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి దొడ్డా శ్రీను రెండు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.


పరిషత్తు పోరులో..

ప్రత్తిపాడు మండలం ఏలూరు-1లో వైకాపా అభ్యర్థి దాడిశెట్టి రాణి మూడు ఓట్ల మెజార్టీతో నెగ్గారు.

కరప మండలం సిరిపురం స్థానంలో జనసేన అభ్యర్థి కత్తుల ధనలక్ష్మి నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచారు.


పుర సమరంలో..

రామచంద్రపురం మున్సిపల్‌ ఎన్నికల్లో 16వ వార్డు అభ్యర్థిని పెంటపాటి దేవి నాలుగు ఓట్ల తేడాతో గెలిచారు.
రామచంద్రపురం ఒకటో వార్డు నుంచి పోటీచేసిన తెదేపా అభ్యర్థి పైడిమళ్ల సత్తిబాబు 5 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని